‘‘నల్లగొండ జిల్లాకు చెందిన చొల్లేటి ప్రభాకర్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. తన హయాంలో సుమారు 12 ఎన్నికలను చూశారు. తన సర్వీసు మొత్తంలో ఒక్కపైసా అవినీతి చేయని అధికారి.మునుగోడు రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర వోటు అమ్ముకోకూడదంటూ ప్లకార్డు పట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చిందంటే వోటు మీద డబ్బు ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వోటు విలువైన ఆయుధం -అమ్ముకోవడం అమాయకత్వం అంటూ నినాదం చేస్తున్నారు. ప్రలోభాలకు లొంగవద్దు, వోటు హక్కు అమ్ముకోవద్దంటున్నారు. అభ్యర్ధుల కుల,మతాలు కాదు వారి అభిమతాలు ముఖ్యమని చెప్తున్నారు. నిజాయితిగా వోటు వేయండి -నిజాయితి గల వ్యక్తులనే ఎన్నుకోండి అంటూ పిలుపునిస్తున్నారు.’’
ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలి. లేదంటే ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం అనేది నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగానే ఉంటుంది. ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే ఆయా దేశాల్లో ప్రజలు చైతన్యవంతులై, విద్యావంతులై స్ఫూర్తిని కలిగి ఉండాలి.ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రతి పౌరుడు తన అంతరంగంలో ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవర్చుకోవాలి. ప్రజాస్వామ్య సంస్కారం అనేది బయటి నుంచి రాదు, మనలోనుంచే రావాలి. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే పౌరులు తమ బాధ్యతల గురించి తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ రాజ్యాంగ బద్దంగా వచ్చిన వోటు హక్కు గురించి తెలుసుకోవాలి. వోటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా వోటు హక్కును కల్పిస్తున్నది. ఈ వోటు హక్కు కోసం రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. బ్రిటిష్ కాలంలో సార్వత్రిక వయోజన వోటు ఉండేది కాదు.
పన్ను చెల్లింపుదారులు, విద్యావంతులు మాత్రమే వోటు వేసేవారు. అంబేడ్కర్ సార్వత్రిక వోటు హక్కు కోసం పోరాడారు. మహిళల వోటు హక్కు ఉద్యమం దీర్ఘకాలం పోరాడిన తర్వాత బ్రిటన్ మహిళలు 1928లో వోటు హక్కు పొందగలిగారు. అమెరికాలో సైతం మహిళలు 1920లో మాత్రమే వోటు హక్కు లభించింది. కొన్ని ముస్లీం దేశాల్లో ఇప్పటికీ మహిళలకు వోటు హక్కు లేదు. కాని స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి వోటు హక్కు ఒక అత్యవసరమైన అంశం అనే అభిప్రాయాన్ని అంబేద్కర్ తీసుకురాగలిగారు. నిరక్షరాస్యత ప్రాతిపదికన వోటింగ్ హక్కులు కల్పించడాన్ని రాజ్యాంగ సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత రాజ్యాంగంలో సార్వత్రిక వయోజన వోటు హక్కును ముందుకు తీసుకొచ్చారు. సాధించారు కూడా. ఇప్పుడు 18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడు వోటు వేస్తున్నాడంటే దాని వెనుక అంబేద్కర్ పడిన కష్టం ఎంతో ఉంది. అందుకే, భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి వోటు హక్కును వినియోగించుకోవాలి. వోటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. రాజకీయ నాయకుల స్వార్థం కోసం వోటు అనేది నేడు అమ్ముడు సరుకైంది. ఎవరు డబ్బులు ఇస్తే వారికే వోటు వేసే పరిస్థితి నెలకొంది. అభ్యర్థి ఎలాంటి వాడు అని ఆలోచించడం మానేసి, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే వోటు వేయాలనే స్థాయికి వోటరు ను దిగజార్చారు.ప్రలోభాలకి, ప్రచారాలకు లొంగి ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టే పరిస్థితి దాపరించింది. వోటు విలువైన ఆయుధం అని తెలిసినా, ఆ ఆయుధాన్ని సరైన విధంగా వాడుకోలేకపోతున్నారు. మద్యం మత్తులో తూగుతూ అనర్హులకు వోటు వేస్తున్నారు. తాజాగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ డబ్బే కీలక పాత్ర పోషిస్తుంది. నియోజకవర్గంలో డబ్బులు వరదలా పారుతుంది.ప్రజలు సైతం అలాగే ఉన్నారు.గెలిచాక ఎవరూ చేసేదేమీ ఉండదు. ఇప్పుడు వోటు కు ఎంత ఇస్తారో చెప్పండి అంటున్నారు. డబ్బు తీసుకోని వోటు వేసిన వారి, రేపటి రోజు పనులు చేయడం లేదని ప్రజా ప్రతినిధులను నిలదీసే హక్కు ఎలా ఉంటుంది..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓ కీలక సవాల్ విసిరారు. మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు, మద్యం పంచకూడదని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణం చేద్దాం రండి అంటూ బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు పిలుపునిచ్చారు. కానీ, ఈ పార్టీలు ఆయన మాటలను పట్టించుకోలేదు. ఒకవేళ ఆయన సవాల్ స్వీకరించి ఉంటే ఇవాళ పరిస్థితి మరోలా ఉండేది. వాస్తవానికి టీఆర్‌ఎస్, బీజేపీ స్థాయిలో డబ్బు ఖర్చు చేయలేకే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ సవాల్ విసిరి ఉండవచ్చు. కానీ, స్వీకరించే ప్రయత్నం చేయలేదు.. నల్లగొండ జిల్లాకు చెందిన చొల్లేటి ప్రభాకర్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. తన హయాంలో సుమారు 12 ఎన్నికలను చూశారు. తన సర్వీసు మొత్తంలో ఒక్కపైసా అవినీతి చేయని అధికారి. మును గోడు రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర వోటు అమ్ముకో కూడదంటూ ప్లకార్డు పట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చిందంటే వోటు మీద డబ్బు ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వోటు విలువైన ఆయుధం -అమ్ముకోవడం అమాయకత్వం అంటూ నినాదం చేస్తున్నారు. ప్రలోభాలకు లొంగవద్దు, వోటు హక్కు అమ్ముకోవద్దంటున్నారు. అభ్యర్ధుల కుల,మతాలు కాదు వారి అభిమతాలు ముఖ్యమని చెప్తున్నారు. నిజాయితిగా వోటు వేయండి -నిజాయితి గల వ్యక్తులనే ఎన్నుకోండి అంటూ పిలుపునిస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలు అనేది గతంలో జరిగిన ఉప ఎన్నికలకు భిన్నంగా కనిపిస్తున్నది. నాగార్జునసాగర్ లో నోముల భగత్ కు సెంటిమెంట్ కలిసి వచ్చింది. దుబ్బాకలో రామలింగారెడ్డి చనిపోయినా, రఘునందన్ రావు మీద సింపతీ వచ్చింది. చాలా సార్లు ఓడిపోయాడు, జనాల్లో ఉంటాడు అనే ఆలోచన ఏర్పడింది. హుజూరాబాద్ లో ఈటెలను కేసీఆర్ ఒంటరిని చేశాడనే సెంటిమెంట్ పని చేసింది. అలా అని అక్కడ నాయకుల కొనుగోళ్లు, వోట్ల అమ్మకాలు జరగలేదని కాదు కానీ, మునుగోడులో పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా మూలంగానే ఈ ఎన్నికల డబ్బు మురికిలో మునిగిపోయిందనే విమర్శలూ ఉన్నాయి. నాయకులు సైతం సంతలో పశువుల్లా అమ్ముడుపోతున్నారు. రాబోయే రాజకీయ భవిష్యత్ ను పణంగా పెట్టి తాత్కాలికంగా వచ్చే డబ్బుకోసం తలవంచుతున్నారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజాసేవ చేయాలనుకునే పేద, మధ్యతరగతి వ్యక్తులు రాజకీయాల్లోకి అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. చాలా మంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. డబ్బులు ఖర్చుచేసి విజయం సాధించే ప్రయత్నం చేస్తున్నారు.ఒకవేళ గెలిస్తే, ఆ సంబంధాలను ఉపయోగించుకొని తమ ఆర్థిక సామ్రాజ్యాలను బలోపేతం చేసుకుంటున్నారు. ఓటమి పాలైతే మళ్లి జనాల్లో కనిపించడంలేదు. నల్లగొండ జిల్లాలో ఓ తేరా చిన్నపరెడ్డి, వేంరెడ్డి నర్సింహారెడ్డి లాంటి నాయకులు ఇందుకు ప్రత్యక్ష ఉదహరణగా చెప్పుకోవచ్చు ఇలా ఎంతో మంది ఉన్నారు.
ఇప్పటికైనా యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. వోటుని స్వేచ్ఛగా నిజాయితీగా వేసినట్లయితే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. నేటి ఇంగ్లాండ్ సంఘటన కూడా ఉదాహరణ 45 రోజుల్లో ఒక ప్రధానమంత్రి తమ పదవికి రాజీనామా చేశారు అదే మన భారతదేశం అయితే అసమర్థులు కూడా ఐదేళ్లు పరిపాలిస్తారు.
‘‘డబ్బులు ఇస్తే తీసుకోండి. కానీ వోటు మాత్రం మాకే వేయండి.’’ అనే నినాదం అన్ని పార్టీల నుంచి ఈ మధ్య వినిపిస్తోంది. ఇది కూడా చాలా దారుణమైన పరిణామం. డబ్బులు తీసుకోవద్దని చెప్పాల్సింది పోయి. తీసుకోమని రాజకీయ నాయకులే ప్రోత్సహించడం చూస్తుంటే ప్రజాస్వామ్యస్ఫూర్తి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. డబ్బులు తీసుకోమని చెప్పడం కూడా నేరం కిందకే వస్తుంది. కానీ ఎన్నికల కమిషన్ దీన్ని ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. హుజరాబాద్ ఎన్నికల్లో వోటుకు 6 వేల రూపాయలు పంచినప్పుడు .. కొందరు తమకు డబ్బులు అందలేదని బహిరంగంగా వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితులు.. వోటర్లు ఎంతగా అమ్ముడుపోతున్నారనడానికి దర్పణం పట్టాయి. నిజానికి డబ్బులు కావాలని అడగిన వాళ్లపై కేసులు పెట్టాలి. కానీ ఒక కేసు పెట్టినట్టు ఎక్కడ రుజువులు లేవు..ఈ దేశంలో టి.ఎన్.శేషన్ మినహా ఏ ఎన్నికల కమిషనర్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన దాఖలాలు లేవు. ‘‘అంబేద్కర్ ఇచ్చిన వోటు అనే ఆయుధంతో బానిస సంకెళ్లు తెంపుకోవచ్చు.. లేదా అమ్ముకుని అదే బానిసత్వంలో బతకవచ్చు. ఇప్పటికైనా వోటర్లే తమ వోటు ను అమ్ముకుంటారో..! సక్రమంగా వాడుకుంటారో..! మునుగోడు వోటర్లు నిర్ణయి ంచుకోవాలి..
– శేఖర్ కంభంపాటి, సీనియర్ జర్నలిస్ట్ :




