ఒక్క కవితతోనే.. ఒక్కసారే.. వాడి బతుకు ఉడుకెత్తాలి.. వీడిజీవనం మొలకెత్తాలి
-అని ప్రఖ్యాత కవి రావిరంగారావు కవిత్వం కావాలి అన్న తన కవితలో వెల్లడిరచారు. నిజమే… కవిరాసే కవితలో మంటలు, పంటలే కాదు మంచు పర్వతాల సొగసులు, అగ్నిపర్వతాల జ్వాలలు కనిపించాలి. మొత్తానికి పూలనిప్పులా కవిత్వం
ఫరిడవిల్లాలి. చరిత్ర శిరసు మీద అజేయ శిఖరమై పాతుకుపోవడమే/ ఇప్పుడిక అనివార్యమైన అవసరం అని తన ముంతపొగ దీర్ఘ కవిత ముగింపులో ప్రముఖకవి యార్లగడ్డ రాఘవేంద్రరావు రాసిన రెండే వాక్యాలు ప్రతి కవి తప్పనిసరిగా ఇప్పుడు ఆలోచించదగినవి. ముంచెత్తే ఉప్పుటేరుల నుండి, ఛిద్ర స్వప్నాల, ధ్యానభంగాల నుండి పెనుగులాడుతూ దగ్థ గీతాల ఆర్తారావాల్ని విన్పిస్తున్న పాలకంకుల వెతను అక్షరమయం చేయాల్సిన గురుతర బాధ్యత కవిపై ఎంతగానో ఉంది. ఇదే కోవలో తనలోని ఉత్తుంగ అంతర్మధనాన్ని అక్షర స్వరం చేసి ఉద్విగ్న ఆలోచనలను ప్రతి ఒక్కరిలో మేల్కొల్పే బాధ్యతను అక్షరం ప్రభాకర్ జాగ్రత్తగా నిర్వహించారు.
వినూత్న ఆలోచనలను రేకెత్తిస్తూ, సందేశాత్మక ధోరణితో సాగే ఖండికలలో కవిలోని అంతర్నేత్రపు సూక్ష్మాతి సూక్ష్మ పరిశీలనను గమనించవచ్చు.
చెలిమి చేవను
చేరదీయని
స్నేహమంటే
దండగేనోయ్
అంటారు. నిజం నిప్పులాంటిది. అబద్ధాన్ని కమ్మేసి నిజాన్ని రూపుమాపాలనుకునే వారిపై ఇలా ఆగ్రహ స్వరమయ్యారు.
అబద్ధానికి
అత్తరు పన్నీరు
అద్దుతూ
నీ మద్దతుతో
ఆ అబద్ధాన్ని
అమాయక జనం పైకి
రుద్దుతూ
నిజాన్ని నిఖిలం
దాటించాలనీ
చూస్తున్న…. నీవా
నిజాయితీకి నిలువటద్దం
నోర్మూసుకో…
జీవితాన్ని తీర్చిదిద్దేలా కవుల కావ్యాలలోని రాతలు ఉండాలని ప్రభాకర్ ప్రగాఢంగా ఆకాంక్షించారు. కలలు కల్లలై, చిరాకు పరాకులు మెరుపు తీగలై ఉరుముతుంటే జీవితం ప్రమాదం అంచున జాగారం చేస్తున్నదని వాపోయారు. కోకిల కోసం వసంతం రాకుండా ఆగదని, ఎవరి మెప్పు కోసం నెమలి నాట్యమాడదని, పరుల కొరకే బ్రతికే నేల, నింగి, పారే సెలయేరును గమనిస్తూ చేసిన మేలును మరవకుండా ముందుకు సాగమంటూ మరో అక్షర స్వరాన్ని ఇలా శృతి చేశారు.
పిడికెడు మెతుకులు పెడితే
ఇంటిని కంటికి రెప్పలా కాపాడు
క్రమశిక్షణ సంరక్షణ ఎక్కడ ఉన్నా
చేతులెత్తి మొక్కవయ్యా ప్రభాకరా
అక్షర యజ్ఞానికి స్వచ్ఛమైన స్వరాన్ని ఆయువుగా పోసిన గాన నేత్రపు అమరగాయక స్వరామృతాన్ని మనసారా ఆహ్వానించారు. పాటల పాఠశాల, మహా గాయకుడు ఘంటసాలకు ఎంతో గొప్పగా, సగౌరవ అక్షర నీరాజనాన్ని సమర్పించారు.
అన్నమయ్య ఆర్తిని
క్షేత్రయ్య కీర్తిని
త్యాగయ్య గొంతులో
తారాడిన దాహార్తిని
భక్తరామదాసుడి స్ఫూర్తిని
పాటల జెండాగా ఎగరేసిన
అలుపెరుగని బాటసారి నీవేనయ్యా
అంటూ అనితర సాధ్యుడైన గాయక శిఖరి ఘంటసాలను కొనియాడారు. మా చెలిమి ఊటల పానశాల అని అభివర్ణించారు.
జీవితం చాలా చిన్నది. అలాంటి జీవితంలో గుండెగూటికి దుఃఖం కన్నమేస్తే ఆ వ్యధ తీవ్రత ఎలా ఉంటుందో హృదయ ద్రావకంగా అక్షరీకరించారు. ఐకమత్యం, స్నేహం ఎంత బలమైనవో చెప్పారు. కునుకులేని కలము ఓర్మిలో ఎన్ని రాత్రులు ఓడెనో అని అనడంలోనే కవిగా ప్రభాకర్ అంతరంగంలోని ప్రత్యేకతను పట్టుకోవచ్చు. నిత్య స్మరణలో ఆమె చేరితే ఆంక్షల మలుపు దాటడం ఎంతో సునాయాసమని అన్నారు. పదము పుట్టుక ప్రసవ వేదనేనని, జననమరణములు మనిషికొకటేనని చెప్పారు. ఎన్ని చదివినా ఏమి లాభమో, స్వార్థబుద్ధి లోభమెందుకు/ ఆశ జీవిగా బ్రతుకు మంచిదే, అవినీతి నీడలో మేడలెందుకు అని సూటిగా ప్రశ్నించారు.
కలల చికాకులు కాలనాగులై కాలుస్తుంటే, కళల చిరాకు పరాకులు మెరుపు తీగలై ఉరుముతున్నాయని వేదన చెంది జీవితం ప్రమాదం అంచున కొట్టుమిట్టాడుతున్నదని అంటారు. దీపాలు వెలిగిస్తేనే దీపావళి కాదు మనలో లోపాలను తొలగిస్తేనే దీపావళి అని చెప్పారు. నిజాలు దాచేస్తే దాగేవి కావు/ ఇజాలు మార్చేస్తే మారేవి కావు అని స్పష్టం చేశారు. రసజ్ఞతను రంపంకోతకు బలిచేసి, రసరమ్యతను ఊరవతల ఉరివేసి, సౌకుమార్యాన్ని సుకుమారంగా నులిపేసి మన తాతల మూతులు తేనెలు తాగాయని నీతులు చెప్పడం సిగ్గుచేటని కుండబద్దలుకొట్టారు. అబద్ధానికి అత్తరు పన్నీరు అద్ది అమాయక జనంపైకి రుద్దుతున్నారని ఆగ్రహించారు. కవుల కావ్యాల రాతలు కొంతమంది జీవితాన్ని చివరకు మారుస్తాయని రచనల ప్రభావాన్ని స్పష్టపరిచారు.
కాంక్షలు మించిపోయినా, ఆంక్షలు అడ్డగించినా బతుకులు పండే బాటను చూపమని కోరారు. సాగుబడి కూలబడి దిగుబడి మూలబడిరదని రైతు పక్షాన వేదన చెందారు. చేను చెలక చేవ తప్పి పంటచేను తగలబడి ప్రజల గుండెగూడు చెదిరిందని అన్నారు. సత్యమంటూనే అసత్యానికి ఆసరై, నిత్యం శాంతిని బోధిస్తూ అశాంతికి ఎగబడే వారిపై నిప్పులు కురిపించారు. కంచె చేను మేసినట్టుగా వంచకులు పెరిగేందుకు ఊతమై కపటపు కన్నీరును కార్చేవారి నైజాన్ని ఎండగట్టారు. కొంగ జపాలు, భజనలు చేసే కొండముచ్చులు పెరిగి సమాజం కుళ్లిపోయిందని వేదన చెందారు. క్షామం అక్కడ క్షేమంగా ఉన్నదని, శిలాఫలకాల రాళ్లు ఏళ్లకు ఏళ్లు అక్కడే ఉండి వెక్కిరిస్తున్నాయని, నిలదీసి నిగ్గుతేల్చే సవాళ్లు నీరసించిపోయాయని చెప్పారు. మనిషి మనుగడ హితమును కోరాలని చెబుతూ కల్లబొల్లి కథలు అల్లి దానికి కరోనా అని పేరు పెట్టిన పెద్దల బుద్ధిహీనతను శుద్ధి చేయమంటారు. ఉన్నదంతా మంచిదేననే ఊకదంపుడు ఉపన్యాసాల ఎంగిలి ఒప్పందాలను చీల్చి చెండాడమన్నారు. అసంతృప్తి రాజ్యమేలే చోట అక్షరాలు మొలకెత్తవని, భావాలు భాసిల్లక బోసిల్లుతాయని చెప్పారు. కాలాతీత వ్యక్తిత్వాలు రాజమార్గాలై సన్మార్గాన్ని చూపాలని ఆకాంక్షించారు.
కళల వాకిళ్లను
కకావికలం చేసుకొని ముళ్లకంచెలుగా
అల్లుకుంటున్నం
కలల రహదారిపై కుల్లు కొంటున్నం
అని పరువన్నదే లేకుండా దిగజారిన మనుషుల నైజాన్ని సూటిగా ఖండిరచారు. ఆత్మవంచన చేసుకోవడం సరైంది కాదని చెప్పారు. ఊళ్లు వానకు రంగేసి, భూమిని మింగేసి ఆ హరివిల్లును కిందకు దించామని అన్నారు. దాన వీర శూర కర్ణులమని జగన్నాథ రథ చక్రాల వంటి ప్రచారాస్త్రాలతో పొగిడిరచుకునేవాళ్లను ఎద్దేవా చేశారు.
తర్కమేదో తత్వమేదో
తండ్లాట పడుతుంటే
తలకిందులైన నిజం
తెలుసుకోవెందుకసలు
క్రాంతి పధం మనదని చెబుతూనే భ్రాంతిని పూర్తిగా విడిచిపెట్టమంటారు. చెలిమిని చిదిపేయాలని కలిమి నటిస్తుంటే హృదయం వేదన చెందిందని చెప్పారు. అంతరంగం మధించక అంతరిక్షం దర్శించినా ఎక్కడి-గొంగళి అక్కడే అన్న తీరును ప్రస్తావించారు. పళ్లు ఉన్న వనాలకే రాళ్లముళ్లు గుచ్చుకొని గాయాలవుతాయని చెప్పారు.
హలములన్ని కలములైతే
పొలాలన్ని ఫలాలోయి
రైతు వెన్నుదన్ను ఉంటే
అన్నం కన్నీరు కార్చేదా
ఏ విత్తును నాటితే ఆ ఫలితమే వస్తుందని, మట్టిని హింసించే పాపం ఊరికే పోదని తెలిపారు. జనులు పాపాన్ని నిలదీయకుంటే జగతి ప్రగతి జరగదని చెప్పారు. అడవికి మంట పెడితే కడుపు మండకుంటుందా అని ప్రశ్నిస్తారు. గుండెగుడిని తొలిచే అవమాన భారాన్ని గుర్తు చేశారు. మోసానికి వేషమేసి రోషమేది అనడం పొరపాటు అని ఆశ చూపే పాశమేదో పసిగట్టమన్నారు. నిరంతర చైతన్యాన్ని కవిగా బలంగా కోరుకున్నారు. భారాలను మోయనిదే బ్రతుకు తీరం చేరదని చెప్పారు.
స్వేదం పాదాలను తాకనిదే
వేద మెలా పవిత్రమౌతుంది
బడుగులకు మెతుకులు ఇవ్వనిదే
చదువుఋణం ఎలా తీరుతుంది
కన్నీళ్ళను దిగమింగనిదే
కావ్యం ఎలా పుడుతుంది
అని గొప్ప తాత్విక చింతనను వెలుబుచ్చారు. ప్రకృతిని ఆరాధిస్తూ జగతి ప్రగతిని కోరుకొమ్మన్నారు. ఒదిగి ఎదిగి జీవితంలో జాగ్రత్తగా నడవాలని సూచించారు. అంతుచిక్కని మర్మాలను కనుక్కునేందుకు నీలోకి నీవే తొంగిచూడమన్నారు.
కవిత్వమే ప్రాణవాయువు అన్న భావనను అక్షర స్వరాలు ఎంతో ప్రస్ఫుటంగా ప్రకటించాయి. పొదువు నుండి పిండుకున్న పాలంత స్వచ్ఛంగా, పెరట్ల పూసిన గుమ్మడి పువ్వు నవ్వంత విశాలంగా, మట్టి వాసనల సహజ పరిమళంలా, చెలిమెల ఊరిన ఊట నీటి తేటలా, వాస్తవాన్ని కుదురుకొన్న కళాత్మక కమనీయ, రమణీయ ఆవిష్కరణంగా అక్షర స్వరాలను పదిలంగా మానవీయ కోణాన అల్లి, ప్రచండ జ్వలనంతో భాసింపజేసిన అక్షరం ప్రభాకర్ కవిత్వ నిబద్ధత తప్పక నిలిచి గెలుస్తుంది.
-డా.తిరునగరి శ్రీనివాస్
9441464764





