- ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా మారనున్న ఇండియా
- ‘స్కామ్’లతో బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేసిన యూపీఏ
- ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు
- దేశ వ్యాప్తంగా ‘రోజ్‌గార్ మేలా’
- వర్చువల్‌గా యువతకు ప్రధాని జాబ్ లెటర్లు అందజేత
న్యూ దిల్లీ, జూలై 22 : ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్ మారనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం దేశవ్యాప్తంగా ‘రోజ్‌గార్ మేలా’ సందర్భంగా 70,000 మంది యువతకు ప్రధాని జాబ్ లెటర్లను వర్చువల్‌గా అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి 70,000 మందికి పైగా అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. కొత్తగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ…ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న వేళ, ప్రభుత్వోద్యోగిగా పనిచేసే అవకాశం రావడం గొప్ప గౌరవమని, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ దేశ ప్రజలు తీర్మానం చేశారని అన్నారు. వొచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యమైనవని ప్రధాని అన్నారు. మరి కొన్ని సంవత్సరాలలో, భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలోకి వొస్తుందని ప్రతి నిపుణుడు చెబుతున్నాడు.
దీని అర్థం ఉపాధి అవకాశాలు మరియు పౌరుల తలసరి ఆదాయం పెరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. గత ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రధాని మోదీ వారి హయాంలో బ్యాంకింగ్ రంగం భారీ విధ్వంసానికి గురైందన్నారు. ‘నేడు బ్యాంకింగ్ రంగం అత్యంత పటిష్టంగా భావించే దేశాల్లో భారత్ ఒకటి. కానీ 9 ఏళ్ల కిందటి పరిస్థితి ఇది కాదు.. గత ప్రభుత్వ హయాంలో మన బ్యాంకింగ్ రంగం భారీ విధ్వంసాన్ని చవిచూసింది. నేడు డిజిటల్ లావాదేవీలు చేయగలుగుతున్నాం. కానీ 9 ఏళ్ల క్రితం 140 కోట్ల మందికి ఫోన్ బ్యాంకింగ్ ఉండేది కాదు’ అని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో రోజ్గర్ మేలా జరిగింది. ఈ చొరవకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు యుటిలలో రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్త రిక్రూట్మెంట్లు, రెవెన్యూ శాఖ, ఆర్థిక సేవల విభాగం, పోస్ట్‌ల శాఖ, పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జలవనరుల శాఖ, ట్రాన్స్ పోర్ట్, హోమ్ మంత్రిత్వ శాఖతో సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో యువత ప్రభుత్వ ఉద్యోగంలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత యూపీఏ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు.
యూపీఏ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేసిందంటూ ఫైర్ అయ్యారు. గతంలో వెన్ను విరిచిన బ్యాంకింగ్ రంగాన్ని తాము పునరుద్ధరించి లాభాల బాట పట్టించామని మోదీ తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ‘ఫోన్ బ్యాంకింగ్ స్కామ్’ చేసిందని ఆరోపించారు. ఇది కొంతమందికి ప్రయోజనం కలిగించిందని, అయితే ఇది దేశ బ్యాంకింగ్ రంగానికి వెన్ను విరిచిందని పేర్కొన్నారు. అదే సమయంలో, బ్యాంకుల నుంచి పంపిణీ చేసిన రుణం తిరిగి రాలేదని.. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రాణాంతకంగా మారిందన్నారు.ఈ రోజు ప్రపంచంలో బ్యాంకింగ్ రంగం అత్యంత పటిష్టంగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. 9 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో మన బ్యాంకింగ్ రంగం భారీగా నష్టపోయిందన్నారు. నేడు మన బ్యాంకింగ్ రంగం దేశంలోని 140 కోట్ల జనాభాకు డిజిటల్ లావాదేవీల సౌకర్యాలను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. 9 సంవత్సరాల క్రితం పరిస్థితులు.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొంతమంది శక్తివంతమైన నాయకులు.. కుటుంబాలకు ఇష్టమైన వారికి వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారని, ఆ రుణాలు ఎప్పటికీ తిరిగి చెల్లించరంటూ పేర్కొన్నారు. అనంతరం తమ ప్రభుత్వం, బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, చిన్న బ్యాంకులను విలీనం చేయడం..
ఈ రంగానికి సహాయం చేయడానికి వృత్తి నైపుణ్యాన్ని ప్రవేశపెట్టడం వంటి అనేక చర్యలను చేపట్టిందని మోదీ నొక్కి చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అంతకుముందు వేల కోట్ల రూపాయల నష్టాలకు ప్రసిద్ధి చెందాయని, ఎన్పీఏ నష్టాల్లో ఉందని.. అయితే ఇప్పుడు అవి రికార్డు లాభాలకు ప్రసిద్ధి చెందాయని ప్రధాని చెప్పారు. ‘ముద్ర’ పథకం కింద పేదలు, అసంఘటిత రంగాలకు రుణాల ద్వారా సహాయం, మహిళా స్వయం సహాయక బృందాలను ఆదుకోవడం లాంటివి చేస్తున్నామని..బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు కష్టపడి, ప్రజలకు సేవ చేయడానికి, వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి నిబద్ధతతో ఉన్నారని కొనియాడారు. ప్రపంచ విశ్వాసానికి, ఆకర్షణకు కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని, దీన్ని దేశం పూర్తిగా వినియోగించుకోవాలని మోదీ అన్నారు. వివిధ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో మరింత పెరుగుతున్నాయని తెలిపారు.



