వొచ్చే ఎన్నికలకు కంటోన్మెంట్‌ ‌చివరి పరీక్షా ?

రాష్ట్రంలో మరో కొద్ది మాసాల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌ ‌రాజకీయ పార్టీలకు చివరి పరీక్షగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ కాలపరిమితి మరో తొమ్మిది నెలల్లో ముగియనుంది. డిసెంబర్‌, ‌జనవరి ప్రాంతాల్లో ఇక్కడ సాధారణ ఎన్నికలు జరుగుతాయనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన పార్టీలు చాలా ముందు నుండే తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. దాదాపు అరు నెలలుగా రాష్ట్రం రాజకీయ పార్టీల ప్రచారాలతో హోరెత్తిపోతున్నది. అనుకోకుండా కంటోన్మెంట్‌ ‌శాసనసభ్యుడు సాయన్న మరణం మరో మినీ సంగ్రామానికి దారితీసేదిగా మారింది. వాస్తవంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అటు అధికార పార్టీగాని, ప్రతిపక్షాలు గాని ఊహించలేదు. ఈ హఠాత్‌పరిణామం ఎవరికి అనుకూలిస్తుందన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు అయిదు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ అయిదు కూడా నువ్వా నేనా అన్నట్లు రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయి. ఈ అయిందిటిలో మూడింటిని బిఆర్‌ఎస్‌గా మారిన టిఆర్‌ఎస్‌ ‌గెలుచుకుంది. మరి రెండు శాసనసభ స్థానాల్లో బిజెపి విజయకేతనం ఎగురవేసింది. విచిత్రమేమంటే ఉప ఎన్నికలు జరిగిన ఈ అయిదు శాసనసభ నియోజకవర్గాలు కూడా చాలా ముఖ్యమైనవే కావడం. వీటిల్లో హుజూర్‌నగర్‌, ‌హుజురాబాద్‌, ‌మునుగోడు ఉప ఎన్నికలకు కోరి తెచ్చుకున్నవే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయినా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమడ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి హుజూర్‌నగర్‌ ‌స్థానం నుండి గెలుపొందారు. అయితే ఓటమి పాలైన కాంగ్రెస్‌ అధికారంలోకి రాని పరిస్థితి కారణంగా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోవడం ఇష్టం లేక ఆయన మరుసటి సంవత్సరం అంటే 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. దాంతో హుజూర్‌నగర్‌ ‌శాసనసభ స్థానంలో ఖాళీ ఏర్పడింది.

తన ఇలాఖాలో కనీసం యాభైవేల మెజార్టీతో తన భార్యను గెలిపిస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థినిగా ఆమెను నిలబెట్టినప్పటికీ ఆ స్థానంలో అధికారపార్టీ నుండి పోటీ చేసిన దానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత చెప్పుకోదగిన ఉప ఎన్నిక హుజురాబాద్‌లో జరిగింది. అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో నెంబర్‌ ‌టు స్థానంలో ఉన్న ఈటల రాజేందర్‌ ఆ ‌పార్టీనుండి బహిష్కృతుడు అవడం, ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన హుజురాబాద్‌ ఉప ఎన్నిక నిజంగా ఒక మినీ సంగ్రామంగానే ముగిసింది. అధికార పార్టీ నుండి అన్యాయంగా ఆయన్ను బలవంతంగా నెట్టి వేశారన్న సానుభూతి ఈటల రాజేందర్‌కు బాగా పనిచేసింది. అంతేగాక ఆయన్ను అక్కున చేర్చుకున్న బిజెపి, టికెట్‌ ఇవ్వడంతోపాటు తమ శ్రేణులందరినీ దింపడంతో ఆ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ ‌దాదాపు ఇరవై నాలుగు వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నిక బిజెపి, బిఆర్‌ఎస్‌ ఎన్నికగా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఈటల రాజేందర్‌ల మధ్య నెలకొన్నపోటీగానే సాగింది. ఆ తర్వాత అదే స్థాయిలో జరిగింది మునుగోడు ఎన్నిక. ఈ ఎన్నిక కూడా కావాలని సృష్టించుకున్నదనే భావన లేకపోలేదు.

ఈ స్థానంలో గతంలో కాంగ్రెస్‌ ‌టికెట్‌పై మంచి మెజార్టీతో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసమే ఆ పార్టీకి, పదవికీ రాజీనామా చేయడం వల్లే మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైందన్న వాదన ఉంది. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీలో చేరి, అదే పార్టీ టికెట్‌పై ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేశాడు. దశాబ్దాలపాటు ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అయిన తన గెలపు ఖాయమనుకున్న ఆయనకు ఓటమి తప్పలేదు. చాలా కాలంగా కాంగ్రెస్‌ ‌స్థానంగా చెప్పబడుతున్న మునుగోడు బిఆర్‌ఎస్‌ ‌స్వంతమైంది. ఆ పార్టీ నుండి పోటీచేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సుమారు పదకొండు వేల మెజార్టీతో గెలుపొందారు. ఇకపోతే మిగిలిన రెండు నియోజకవర్గాల్లో ఆక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంఎల్‌ఏల అకాల మరణం వల్ల ఉప ఎన్నికలు అనివార్యమైనాయి. నాగార్జున సాగర్‌ ‌శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మృతి కారణంగా ఇక్కడ ఉప ఎన్నికకు అనివార్యత ఏర్పడింది. 2021 మేలో జరిగిన నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌నర్సింహయ్య కుమారుడికే టికట్‌ ఇచ్చి నిలబెట్టింది.

కాంగ్రెస్‌ ‌దిగ్గజం కుందూరు జానారెడ్డిని ఆయన సుమారు పద్దెనిమిది వేల మెజార్టీతో చిత్తుచేశారు. ఈ రెండు పార్టీలు కూడా ఈ స్థానాన్ని ప్రిస్టేజీగా తీసుకున్నాయి. విచిత్రమేమంటే ఇక్కడ బిజెపికి డిపాజిట్‌ ‌దక్కకపోవడం. అంతకు ముందే దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ 2020 నవంబర్‌లో ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం కూడా బిఆర్‌ఎస్‌దే కావడంతో రామలింగారెడ్డిపై స్థానికులకున్న అభిమానంతో ఆయన భార్య సుజాతను గెలిపిస్తారనుకుంది అధికారపార్టీ. కాని బిఆర్‌ఎస్‌ ‌నుండి బిజెపిలోకి వెళ్ళిన మాధవనేని రఘునంధన్‌రావును 14 వందల స్వల్ప మెజార్టీతోనైనా గెలిపించారు.

మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాలన్నిటినీ రానున్న శాసనసభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు బేరీజు వేసుకుంటూ, ప్రజలు తమవైపంటే తమవైపే ఉన్నారని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ కీలక సమయంలో బిఆర్‌ఎస్‌ ‌తమ శాసనసభ్యుడిని కోల్పోవడంతో ఇప్పుడు కంటోన్మెంట్‌పైన మరోసారి కాన్సంట్రేషన్‌ ‌చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో తొమ్మిది మాసాల్లో ఎన్నికలు జరుగుతాయనుకుంటున్న సమయంలో ఆకస్మికంగా సాయన్న మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యత ఏర్పడింది. అయితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరుపాలన్న నిబంధన ప్రకారం ఎన్నికల కమీషన్‌ ఇక్కడ ఎన్నిక నిర్వహిస్తుందా లేక చట్టపరంగా లభించిన విశేష అధికారంతో సాధారణ ఎన్నికల వరకు వాయిదా వేస్తుందా అన్నది ఇంకా  తేలాల్సి ఉంది. ఎన్నికల కమీషన్‌ ఒక వేళ ఇక్కడ ఎన్నిక ప్రకటన చేస్తే, సాధారణ ఎన్నికలకు ముందే అన్ని రాజకీయ పార్టీలకు కంటోన్మెంట్‌ ఎన్నిక మరో లిట్మస్‌ ‌టెస్ట్‌గా మారే అవకాశాలు లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *