వైసిపికి కౌంట్‌డౌన్‌ ‌మొదలయ్యింది

  • కేసులతో వేధించిన వారి చిట్టా తీస్తాం
  • అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం
  • అమరావతిని భ్రష్టు పట్టించారు..పోలవరాన్ని ముంచారు
  • పార్టీలో పనిచేసే వారికే అవకాశాలు ఉంటాయని సూచన
  • లీగల్‌ ‌సెల్‌ ‌కమిటీ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు

అమరావతి, అక్టోబర్‌ 14 : ‌చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి..  గుండెల్లో నిద్రపోతా. తప్పు చేసినవాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు… చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులకైనా శిక్ష తప్పదు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శుక్రవారం టీడీపీ లీగల్‌ ‌సెల్‌ ‌నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి లెక్కలురాస్తున్నానని అన్నారు. వైసిపికి కౌంట్‌డౌన్‌ ‌మొదల య్యిందన్నారు. అధికారాన్ని ఉపయోగించి చేస్తున్న దాష్టీకానికి మూల్యం చెల్లించుకోక తప్పదని వైసిపిని హెచ్చరించారు. దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ టీడీపీఅని… ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు టీడీపీకి వచ్చాయని తెలిపారు.

టీడీపీకి 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తన జీవితంలో ఊహించలేదని తెలిపారు.ఇన్నేళ్లలో ఏ సీఎం వ్యక్తిగతంగా ప్రవర్తించ లేదని తెలిపారు. పోలీస్‌ ‌వ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టించిందని విమర్శించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పోలీస్‌ ‌శాఖలో కొందరిని పెట్టుకున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు తర్వాత ఇద్దరు చనిపోయారని… అప్రూవర్‌ ‌దస్తగిరి కూడా ప్రాణ భయంతో ఉన్నాడన్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజు ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు వేధించారన్నారు. రఘురామ పై పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించారని తెలిపారు. రఘురామను ఏపీకి రాలేని పరిస్థితిని కల్పించారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఎవరికీ అన్యాయం జరిగినా టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి ఒప్పుకుని… అధికారంలోకి రాగానే జగన్‌ ‌మాటమార్చారని ఆగ్రహించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కోర్టులు మొట్టికాయలు వేసినా జగన్‌ ‌తీరు మారడం లేదన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చి ఏపీని సర్వనాశనం చేశారని అన్నారు. పోలవరాన్ని ముంచేశారని..

విశాఖను తొల్చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎపికి అమరావతి, పోలవరం రెండు  కళ్లని అన్నారు. ఆనాడు హైదరాబాద్‌ను అభివృద్ది చేసినట్లే అమరావతిని తీర్చిదిద్దాలని సంకల్పిస్తే గ్రాఫిక్స్ అం‌టూ ఎద్దేవా చేశారని అన్నారు. పోలవరం ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదన్నారు. ఇకపోతే పార్టీలో పనిచేసేవారికి మాత్రమే స్థానం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కష్టపడ్డవారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *