వైద్యవిద్యకు పివి నరసింహారావు ప్రదానాలు!

భారతదేశానికి ఒక విపత్కర పరిస్థితిలో ప్రధాని పదవిని (జూన్‌ 1991 – మే 1996) చేపట్టి, కష్టాలనుంచి గట్టెక్కించిన వ్యక్తి పివి నరసింహారావు (28.06.1921 -23.12.2004). ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడుగా, విదేశీ సంబంధాలు చక్కదిద్దిన చాణక్యుడుగా పేరొందిన వ్యవహారదక్షుడు. పివి విద్యారంగానికి, ప్రత్యేకించి వైద్యవిద్యా రంగానికి కూడా చేసిన సేవలు ఎనలేనివి. విద్యలో అంతర్భాగమే వైద్య విద్య. వైద్య విద్య ప్రాణ రక్షక వృత్తి విద్య. పివి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (1971-73) గా చేసే కంటె ముందు, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటి, అధికార భాషా సంఘం సభ్యుడుగా, విద్యా ప్రాంతీయ కమిటి చైర్మన్‌ (1958-61)గా, న్యాయ (1962-67), విద్యా (1968-71), వైద్య ఆరోగ్య (1967) శాఖల మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నది. 1967-68 విద్యా సంవత్సరంలో ఉస్మానియా మెడికల్‌ కాలెజ్‌ లో 6 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ శాఖలను అభివృద్ధి చేయించినరు. గాంధి మెడికల్‌ కాలెజ్‌ లో సీట్ల సంఖ్య 120 నుంచి 150కి పెంచగలిగినరు. దేశంలో తొలి జాతీయ విద్యా విధానం ప్రకటించిన మరుసటి (1969) సంవత్సరమే రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ కోర్స్‌ ను, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ లలో తెలుగు మాధ్యమంను ప్రవేశపెట్టిన చొరవ ఆయనది. పూర్వ ప్రధాని రాజీవ్‌ కూడా నూతన విధానాలను ప్రవేశపెట్టిన వాడు. ఆ తరుణంలో విద్యా శాఖకు విస్తృత నిర్వచనాన్ని ఇచ్చి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా రూపకల్పన జరిగింది. అందులో పివి ప్రధాన పాత్ర పోషించటమే కాక, ఆ రూపాంతర శాఖకు మొదటి మంత్రి (1985) గా ఒక అకర్షణను తేవటంలో పివి చిత్తశుద్ధి గొప్పది. వైద్యవిద్యను మానవవనరుల అభివృద్ధి శాఖలో చేర్చాలనే ప్రయత్నం మాత్రం ఫలించలేదు. జిల్లాకొక నవోదయ పాఠశాల పివి ఆలోచనల ప్రతిఫలమే! ప్రతి పాఠశాలకు కనీసం రెండు గదులు, ఇద్దరు ఉపాధ్యాయులు, బోధనా సామగ్రి ఉండే విధంగా చర్యలు తీసికొన్నరు.

రెండవ జాతీయ విద్య విధానం 1986 లో ప్రకటించగా, 1992 లో పివి దానిని మరింత ప్రయోజనకరంగా మార్పు చేయించినారు. పివి కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి (1985-88), ఆరోగ్యం (1986-88), ప్రణాళిక (1984-85) శాఖల మంత్రిగా, ప్రణాళికా సంఘం డిప్యూటి చైర్మన్‌ గా కీలక పదవులు నిర్వహించినరు. హయ్యర్‌ సెకండరీ విద్యను ఆరోగ్య రంగానికి చెందిన వృత్తి విద్య కోర్స్‌ లతో పటిష్టపరచిన ఘనత పివిది. ఇందు కోసం బజాజ్‌ కమిటి (1986) వేసి, కమిటి ఇచ్చిన అన్ని సిఫారిష్‌ లను అమలు పరచిన ఆరోగ్య విద్యా రంగ సంస్కర్త ఆయన. విద్య, ఆరోగ్య శాఖల మంత్రిగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలలో పాల్గొన్నారు. విధాన నిర్ణయాలు గైకొన్నరు. కేంద్ర మంత్రి హోదాలో సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ కాన్‌ఫరెన్స్‌ లో 1988 ఫిబ్రవరి 15న పివి పాల్గొన్నరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్య, ఆరోగ్య సంబంధ వృత్తి విద్య, ఆరోగ్యం ఔషధాల విద్య మెరుగు పరచటానికి ప్రత్యేక అధ్యయనాలు ప్రారంభినట్టు ప్రకటించినరు. వైద్య విద్యలోని కొన్ని శాఖలలో అధ్యాపకుల కొరత తీర్చటానికి చేపట్టిన చర్యలను ప్రస్తావించినరు. జాతీయ ఆరోగ్య విధానం 1983లో దేశ ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చగల భవిష్యత్‌ వైద్య విద్య రూపొందించు కోవాలని గొప్పగా వ్రాసుకొన్నము. దురదృష్టవశాత్తు వైద్య విద్యా రంగ నిపుణులు ఇప్పటికి మూస ధోరణి నుంచి బయటపడుట లేదు. ఆ తరువాత ఆరు నెలలకు బహమస్‌ లో జరిగిన 8వ కామన్‌వెల్త్‌ ఆరోగ్య మంత్రుల మహాసభలో పాల్గొన్న సందర్భంలో ఆరోగ్య రంగంలోని మానవ వనరుల అసమతౌల్యతను ప్రత్యేకంగా పేర్కొన్నరు. రాబోయే సంవత్సరాలలో చేపట్టవలసిన చర్యలను ప్రతిపాదించినరు. దేశంలో 1986 ఆ తదనంతర సంవత్సరాలలో ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయాలు నెలకొల్ప బడినయి.

ఇందిరాగాంధి నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటి 1991 నుంచి ఆరోగ్య శాస్త్రాల కోర్స్‌లు ప్రారంభించింది. వైద్య విద్యకు ఆయన ఇచ్చిన ఊతంతో 1985-95 మధ్య దశాబ్దకాలంలో 54 కొత్త కళాశాలలు ఏర్పడి, వాటి సంఖ్య 106 నుంచి 160 కి పెరిగింది. పివి ప్రభుత్వం 1992 ఏప్రిల్‌ నుంచి అమలులోనికి వచ్చిన 8వ పంచ వర్ష ప్రణాళికలో ‘ఆరోగ్య శాస్త్రాల జాతీయ విద్యా విధానం’ ఉండాలని గుర్తించింది. 1992లో చైల్డ్‌ సర్వైవల్‌ అండ్‌ సేఫ్‌ మదర్‌హుడ్‌ కార్యక్రమం ప్రారంభించి ప్రసవ కర్తలకు, మెడికల్‌ ప్రాక్టీషనర్‌లకు శిక్షణ మాడ్యూల్స్‌ రూపకల్పన చేయించినరు. సామాజిక ఆరోగ్యంలో మహిళల పాత్ర గుర్తెరిగి మహిళా ఆరోగ సమితిలను ఏర్పరచి, వారికి కూడా శిక్షణ మాడ్యూల్స్‌ చేయించినరు. సంప్రదాయ విధానాల వైద్య విద్యకు కూడా పివి చేసిన సేవలు విశిష్టమైనవి. ప్రభుత్వ రంగంలో కళాశాలలను పటిష్టపరచినరు. ప్రైవేట్‌ రంగంలో 13 కొత్త కళాశాలలు నెలకొల్పటానికి కారకుడైనరు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 1988లో స్థాపించిన ‘రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్‌’ గురుశిష్య పరంపరలో విద్యా బోధన, పరిశోధనలు చేస్తున్నది. పివి ప్రోత్సాహంతో మహారాష్ట్ర ప్రభుత్వం 1997లో రాంటేక్‌ వద్ద కవికులగురు కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది. ఆ విశ్వవిద్యాలయం పరిధిలో యోగ, ప్రకృతి వైద్యం, పథ్య శాస్త్రం, పంచకర్మ, ఆయుర్వేదం కోర్స్‌లు నడుస్తున్నవి. సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్న చైనాతో దేశీయ వైద్య అభివృద్ధి, ఓషధుల పరిరక్షణకు 1993లో ఒప్పందం కుదుర్చుకొన్నరు. వారి చొరవతో 1974లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్వామి రామనందతీర్థ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషియో ఎకనామిక్‌ రీసర్చ్‌ అండ్‌ నేషనల్‌ ఇంటెగ్రేషన్‌ కూడా రైతులకు ఔషధ, సుగంధ మొక్కల సాగు పట్ల అవగాహన కల్పిస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం 1995లో ఇండియన్‌ సిస్టంస్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ హోమియోపతి (ఐఎస్‌ఎం అండ్‌ ఎచ్‌) డిపార్ట్‌మెంట్‌ ను ప్రారంభం చేసింది. దానికి 2003లో ఆయుర్వేద, యోగ నాచురోపతి, యునాని, సిద్ధ అండ్‌ హోమియోపతి (ఆయుష్‌) డిపార్ట్‌మెంట్‌ అని పేరు మార్పు జరిగింది. పివి గారి ప్రేరణతో ఆయన కుమార్తె వాణి దేవి 1995లో ఫార్మసి కళాశాల ప్రారంభించినరు. పివి వ్యక్తిగత వైద్యుడు కె శ్రీనాథరెడ్డి 2006లో పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించి దాని ఆధ్వర్యంలో 5 ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ లను నడుపుతున్నరు. తెలంగాణ ప్రభుత్వం 2014లో నెలకొల్పిన పశువైద్య విశ్వవిద్యాలయానికి ‘శ్రీ పివి నరసింహారావు వెటెరినరి యూనివర్సిటి’ గా నామకరణం చేసింది. పివి శతజయంతి సందర్భంగా ఆయన బహుముఖ ప్రజ్ఞను విధానాలను అధ్యయనం చేయటానికి కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘పివి నరసింహారావు నాలెడ్జ్‌ సెంటర్‌’ ను నెలకొల్పింది. పివి స్ఫూర్తితో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకొక వైద్య కళాశాలను నెలకొల్పుతున్నది.

పివి ఇంత తాపత్రయ పడ్డా ఆయన ఆలోచనా సారాన్ని వైద్యవిద్యా రంగ నిపుణులు పాక్షికంగానే స్వీకరించినట్టు స్పష్టం అవుతున్నది. గ్రామీణ వ్యావసాయక నేపథ్యం నుంచి వచ్చిన పివి ఆలోచనలు వారి డాబుసరి తనానికి నచ్చలేదు. ప్రజాహితం కోసం పివి సదుద్దేశంతో చెప్పిన సూచనలు వారి చెవికి ఆనలేదు. అది విద్యావేత్తల, నియంత్రణా సంస్థల వైఫల్యంగా ఒప్పుకోవలసిందే. పాలనా సంబంధ చక్రబంధంలో ఉన్న పివి పరిస్థితుల ప్రాబల్యతను బట్టి ప్రాధాన్యతలు నిర్ణయించుకొనే క్రమంలో కొన్నింటిని తను వ్యక్తిగతంగా చూడలేక పోవచ్చు. కాని పివి ఆలోచనలు అమలు పరచవలసిన అగత్యం ఇంకా ఉన్నది. ఇప్పటికీ, 52% అల్లోపతి వైద్యుల ప్రాక్టీసు 5 రాష్ట్రాలలోనే, అదీ పట్టణ ప్రాంతాలలోనే కేంద్రీకృతమై ఉంది. మన దేశంలో మానవవనరుల అసమతౌల్యత, భౌగోళిక అసమానతలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, పట్టణ గ్రామీణ విభజనలు వంటి సమస్యలు ఆరోగ్యరంగాన్ని పీడిస్తూనే ఉన్నయి. ప్రాథమిక మెడికల్‌ ప్రాక్టీస్‌ కు సంబంధించి హయ్యర్‌ సెకండరీ లేదా బేసిక్‌ డిప్లొమా, ఫార్మసిస్ట్‌లు, నర్స్‌లకు మెడికల్‌ ప్రాక్టీస్‌ కు అనుమతించే బ్రిడ్జ్‌ కోర్స్‌ల రూపకల్పన ఇప్పటికీ దేశానికి అవసరమే! దేశ సమగ్ర ఆరోగ్యం కోసం పివి నరసింహారావు వైద్యవిద్యా రంగానికి చేసిన ప్రదానాలు మరువ లేనివి. పివి సూచనలు ఎప్పటికీ శిరోధార్యమే!
– డాక్టర్‌ రాపోలు సత్యనారాయణ
(పాలకుర్తి – 506146,
 ఫోన్‌: 9440163211)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *