‌వెంకట్‌రెడ్డి ‘చెయ్యి’ జారతున్నాడా !?

కాంగ్రెస్‌ ‌సీనియర్‌నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ్ముని బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునుగోడు ఎన్నిక నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్య చేయడమే  ఇందుకు కారణం. గురువారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడిన తీరు త్వరలో పార్టీనివీడి వెళ్ళనున్నాడన్న విషయాన్ని స్పష్టంచేస్తున్నది. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూనే, ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతాననడంత• ఇక ఎట్టి పరిస్థితిలోనూ ఆయన కాంగ్రెస్‌లో కొనసాగడన్నది స్పష్టమవుతున్నది. ఈ లోగా తన నియోజవర్గం అభివృద్ధిపైనే దృష్టిసారించనున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి గతంలో ఎవరూ తీసుకురానన్ని నిధులను తెచ్చానని, మరింత అభివృద్ధికోసం ప్రణాళికలను సిద్ధం  చేస్తున్నట్లు చెప్పారు.
ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికూడా ఇలానే ఉన్నట్లుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, తన నియోజకవర్గ ప్రజలతో చర్చించే మిషతో కొంతకాలయాపన చేసినా చివరకు అందరూ ఊహించినట్లుగానే బిజెపిలో చేరిపోయారు. వాస్తవంగా మునుగోడు ఉప ఎన్నిక పాత్రధారి  ఆయనే అయినా, సూత్రధారి మాత్రం బిజెపి అన్నది తెలియందికాదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ‌తిరుగులేని నాయకులుగా ఇంతకాలం చెలామణి అవుతున్నారు. తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలని ఉత్సాహ పడుతున్న బిజెపి వివిధ పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్నవారిని, పార్టీలకు చాలాకాలంగా దూరంగా ఉన్నవారిని ఆకర్షించే పథకంలో భాగంగానే రాజగోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. ఆయన పార్టీలో చేరడం వెనుక బిజెపి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్టును  ఇప్పించిందన్న  విస్తృత ప్రచారం జరిగింది. దాన్ని రాజగోపాల్‌రెడ్డికూడా పూర్తిగా కొట్టిపారేయలేదు. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు శాసనసభ స్థానానికి రాజీనామాచేయించి, అతనికే తిరిగి బిజెపి టికెట్‌  ఇచ్చింది. తిరుగులేని నాయకులుగా చెలామణి అవుతున్న సోదరుల్లో ఒకడైన రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని బిజెపి భావించింది.
కాని, మునుగోడు ప్రజలు మరోరకంగా తీర్పు ఇచ్చారు. దీంతో తాత్కాలికంగా బిజెపి నిరాశపడినా, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నది. తాజాగా వెంకట్‌రెడ్డి చేసిన ప్రకటన వెనుకకూడా బిజెపి పథకం ఉండిఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఎన్నికల సందర్భంలోనే బిజెపినుండి పోటీలోఉన్న తమ్ముడి గెలుపుకు కృషిచేయాలంటూ తన కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడిన తీరుపై ఒకటికి రెండుసార్లు కాంగ్రెస్‌పార్టీ వివరణకోరుతూ నోటీసులిచ్చింది. దానిపై వివరణ  ఇవ్వాల్సి ఉంది. అయితే  రెండు రోజులక్రితమే వివరణ ఇచ్చాననని చెబుతున్న వెంకట్‌రెడ్డి అందులో ఏం చెప్పారో తెలియదుగాని గురువారం మాత్రం తిరుమలలో చేసిన ప్రకటన కాంగ్రెస్‌ ‌పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చింది. రేవంత్‌రెడ్డి పిసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటినుండి కోమటినెడ్డి బ్రదర్స్ ‌వ్యతిరేకిస్తూ వొస్తున్నారు. తమ ఇద్దరిలో ఒకరికి ఆ పదవిని కట్టబెడితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవాన్ని కలిగిస్తామని అనేకసార్లు  వారిద్దరూ బాహాటంగానే ప్రకటించారు. అయితే అధిష్టానం మాత్రం ఆ విషయంలో రెండో ఆలోచన చేయకపోవడంతో తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారాడు.  వెంకట్‌రెడ్డికి మాత్రం స్టార్‌ ‌క్యాంపెయినర్‌• అం‌టూ గౌరవ పదవినిచ్చింది కాంగ్రెస్‌.
అయినా ఆయన పెద్దగా కాంగ్రెస్‌ ‌కార్యక్రమాల్లో పాల్గొనలేదు. నువ్వా నేనా అన్నట్లు మునుగోడులో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన విదేశాలకు వెళ్ళాడు.  తాజాగా రాహుల్‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర తెలంగాణలో జరుగుతున్నప్పుడుకూడా ఆయన రాహుల్‌ను కలువలేదు. పైగా తనకు క్రమశిక్షణా కమిటి నోటీసులిచ్చినప్పుడు  తానెల పాల్గొంటానంటూ, తనకు పార్టీ క్లీన్‌ ‌చిట్‌ ఇచ్చిన తర్వాతే భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొంటానని చెబుతున్నాడు. ఇదిలాఉంటే  జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లిఖార్జున  ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలోని పార్టీపై దృష్టిని కేంద్రీకరించినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డిపైన పలువురు సీనియర్‌ ‌నాయకులు గతంలో చేసిన ఫిర్యాదుల లేఖలనుకూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించడమేకాకుండా, ప్రస్తుతానికైతే పిసీసీ అధ్యక్షుడి మార్పు అవసరంలేదన్నట్లు వార్తలు వొచ్చాయి. ఏపీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడిని మార్చినట్లు ఇక్కడ కూడా మార్పు జరిగితే తనకు అవకాశం  వొస్తుందనుకున్న వెంకట్‌రెడ్డికి  దీంతో మరోసారి నిరాశే ఎదురైంది. పైగా కాంగ్రెస్‌కూడా ఎదుగుబొదుగు లేకుండా పోతోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన పార్టీ మారాలన్న నిర్ణయానికి వొచ్చాడన్నది స్పష్టమవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *