ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం సహజం. వృద్ధాప్యం ఓ వ్యాధి కాదు. ముసలితనం శాపం కానే కాదు. వార్ధక్యం ఓ అద్భుత వరం. వృద్ధాప్యం అంటే భారం. ముసలితనం అంటే మూలిగే రోగం. వార్ధక్యం అంటే రోగాల పుట్ట అనే భావనలను తుడిచేద్దాం. వయోభారం అనేక సమస్యల వలయం అవుతున్నది. ముసలితనం అంటే నిరాదరణలు, ఈసడింపులు అవుతున్నాయి. వృద్ధాప్యం నయం చేయగల ఓ వ్యాధిగా కూడా భావించబడుతున్నది. వయోవృద్ధులు ఊరికి దూరంగా స్మశానానికి దగ్గరగా నిస్సహాయ జీవచ్ఛవాల్లా బతుకుల్ని ఈడుస్తున్నారు. వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులు, క్యాన్సర్స్, అల్జీమర్స్, బీపీలు, షుగర్లు, కదలలేని దుస్థితులు, సకల బలహీనతలు సాధారణంగా కనుపిస్తాయి. పుట్టిన వారు గిట్టక తప్పదు. మనిషన్నాక వృద్ధాప్యం రాక మానదు.
వృద్ధాప్యం ఓ వ్యాధి కారాదు..
ఈ డిజిటల్ సమాజంలోని వ్యక్తులు ముసలితనం లోకి జారుకుంటున్నామని తెలిసి కూడా వృద్ధాప్యాన్ని జయిస్తూ ఆనందమయ జీవితాలను అనుభవించడానికి సిద్ధ పడడం లేదు. పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల వలె ఉద్యోగ ఉపాధుల వేటలో ఇంటికి, ఊరుకు దూరమై పోతున్నారు. వృద్ధ తల్లిదండ్రులు తాము అనాధలం అయ్యామని మదనపడుతున్నారు. కొందరు వృద్ధులు అనాథాశ్రమాల దారి పట్టడం కూడా చూస్తున్నాం. కన్న పిల్లలు నిరంతరం నీడలా ఉంటూ మన యోగక్షేమాలను చూస్తారనే ఆశ పెట్టుకోవడం ఉత్తముల లక్షణం కాదు. తల్లితండ్రులుగా పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి, పెళ్లి చేసి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వడం వరకే మన భాద్యత అని తెలుసుకోవాలి. తల్లితండ్రులను చక్కగా చూసుకునే సంతానం దగ్గరగా ఉంటే అదృష్టం అని, వారు మనల్ని పెద్దగా పట్టించుకోక పోయినా మన బతుకుల్ని మనమే స్వతంత్రంగా జీవించడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. పిల్లలపై భారీ ఆశలు పెట్టుకుంటే నిరాశే ఎదురవుతుంది. మనల్ని అనుక్షణం చూడడానికి వారికి సమయం ఉండదు. వారికీ కూడా కుటుంబ భాద్యతలు వచ్చి పడతాయని మరువరాదు. వృద్ధాప్యాన్ని మరో బాల్యంగా తలచి సంతోషమయంగా మార్చుకోవడమనే కళను మనందరం నేర్చుకోవాలి.
వృద్ధాప్యానికి కారణాలు
వార్ధక్యం విశ్వవ్యాప్త సహజ వాస్తవం అని తెలుసుకొని అడుగులు వేయాలి. వృద్ధాప్యాన్ని తప్పించలేను, కాని వృద్ధాప్యాన్ని కొంత వరకు నిరోధించవచ్చని తెలుసుకోవాలి. ముసలితనం రావడానికి కారణాలుగా జీవ కణాల ప్రవర్తనలో మార్పులు, క్రోమోజోమ్స్ అరిగి పోవడం, కణాల పునరుత్పత్తి సామర్థ్యాలు తగ్గడం, డిఎన్‌ఏలో మార్పులు, మైటోకాండ్రియా పని ఆపేయడం, మూల కణాలు నీరస పడడం, జీవక్రియ నియంత్రణలు తగ్గడం, కణాలు జాంబీలుగా మారి పోవడం, కణజాలాల మధ్య సమాచార మార్పిడి ఆగిపోవడం లాంటి అంశాలను ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. ఆరోగ్యకర జీవన విధానంతో వృద్ధాప్యాన్ని కొంత మేరకు పరిష్కరించవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
క్రోనలాజికల్ ఏజ్ అండ్ బయలాజికల్ ఏజ్
జన్మతో వచ్చేది, మార్చలేనిది క్రొనలాజికల్ ఏజ్ అయితే మన జీవనశైలిని బట్టి నిర్ణయింపబడేది బయలాజికల్ ఏజ్ అని తెలుసుకోవాలి. జన్మ తేదీని బట్టి నిర్ణయించే వయస్సును ‘క్రోనలాజికల్ ఏజ్ (కారక్రమానుసార వయస్సు’ అని, శరీర జీవక్రియల చురుదనాన్ని బట్టి నిర్ణయించే వయస్సును ‘బయలాజికల్ ఏజ్(జీవసంబంధ వయస్సు)’ అని పిలుస్తాం. కొందరు 60 ఏండ్ల వయస్సు ఉన్నప్పటికీ 40 ఏండ్ల వయస్సు ఉన్న వారిలా కనిపిస్తే, మరి కొందరు 40 ఏండ్ల వయస్సులో కూడా 60 ఏండ్ల వృద్ధుల వలె కనిపిస్తారు. మనం వృద్ధాప్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం లేదు. ముసలితనంలో అంతర్గత, బాహ్య భాగాలు ఉన్నాయి. జన్యుపరమైన మరియు మానసిక స్థితులు అంతర్గత లక్షణాలు అయితే మద్య సేవనం, పొగ తాగడం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ, సరిగ్గా నిద్రపోవడం లాంటి జీవనశైలి లక్షణాలు బాహ్య కారణాలు అవుతాయి. క్రీడాకారులు, వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా/ఆనందంగా జీవితాలను గడిపే వ్యక్తులు అసలు వయస్సు కన్న యవ్వనంగా కనిపిస్తారు. ఇలాంటి వ్యక్తుల్లో కాలక్రమానుసార లేదా పుట్టిన రోజును బట్టి తేల్చిన వయస్సు (క్రోనలాజికల్ ఏజ్)తో పోల్చితే బాహ్యంగా కనిపించే బయలాజికల్ ఏజ్ తక్కువగా కనిపుస్తుంది. జీవనశైలి అస్తవ్యస్థంగా ఉన్న వ్యక్తుల్లో క్రోనలాజికల్ ఏజ్ కన్న బయలాజికల్ ఏజ్ ఎక్కువగా కనిపిస్తుంది.
వృద్ధులుగా కనిపించటానికి కారణాలు
క్రొనలాజికల్ ఏజ్ కన్న అధిక వయస్సు ఉన్న వారిగా కనిపించే వ్యక్తుల్లో నిద్రలేమి, అధిక బీపీ, మధుమేహం, ఒత్తిడి, స్థూలకాయం, స్ట్రోక్, గుండె జబ్బులు అధికంగా కనిపిస్తాయి. అసలు వయస్సు కన్న వృద్ధులుగా కనిపించే వారిలో చర్మం ముడతలు, మానసిక బలహీనతలు, సులభంగా అలసి పోవడం, భావోద్వేగ సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం, అల్జీమర్స్ వ్యాధులు లాంటి అనారోగ్యాలు అధికంగా ఉంటాయి. బయలాజికల్ ఏజ్ అధికంగా ఉన్న వ్యక్తుల్లో రోగ నిరోధకశక్తి పడిపోవడం నిర్థారించబడుతుంది. యవ్వనంగా కనిపించాలంటే తగు సమయం నిద్ర పోవడం, పడక గదిని అందంగా తీర్చిదిద్దు కోవడం, ఉదయ భానుడి కిరణాలు దేహంపై పడే విధంగా నడవడం, కాఫీ/టీ/ఆల్కహాల్‌లను తగ్గించడం, తగు నీటిని తాగడం, స్మార్ట్‌ఫోన్/టీవీలను తక్కువగా వీక్షించడం, తగు విశ్రాంతిని తీసుకోవడం, సమయానుసారం తేలికగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తీసుకోవడం, మంచి స్నేహితుల నడుమ కాలాన్ని సరదాగా గడపడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి ఆలోచనలు చేయడం, సమాజహిత కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండడం, మన అనుభవాలను సమాజానికి అందించడం, దాతృత్వ గుణాలను అలవర్చుకోవడం లాంటి గుణాలు ఉపకరిస్తాయి.
యవ్వనంగా, చురుకుగా కనిపించడానికి మార్గాలు
వృద్ధాప్యం పట్ల అవగాహన లేకపోవడం, రానున్న ముసలితన సమస్యల్ని ముందే అంచనా వేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవడం, షుగర్‌ను తగ్గించడం, ఫాస్ట్‌ఫుడ్స్/బేకరీ ఫుడ్స్‌ను తిరస్కరించడం, వయస్సుకు తగిన జీవనశైలిని అలవర్చుకోవడం, ఇంట్లో ఆశావహ వాతావరణాన్ని నెలకొల్పడం, కుటుంబ సభ్యులను లేదా జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మడం, రేపటి ఇబ్బందుల గూర్చి అతిగా ఆలోచించకపోవడం, మన పనులను ప్రాధాన్యతాక్రమంలో సకాలంలో నిదానంగా పూర్తి చేయడం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం అవ్వడం, కృతజ్ఞతా భావాన్ని పెంచుకోవడం, భావోద్వేగ సమతుల్యత ప్రదర్శించడం, ఆకస్మిక ఖర్చులకు బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉండడం, ఎవరిపైనా అతిగా ఆధారపడకుండా ఉండడం, ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఆనందంగా గడపడం, బంధు మిత్రులతో సరదాగా గడపడం, నిత్యం ప్రయోజనకరమైన పనుల్లో మునగడం, ప్రణాళికాబద్ధంగా గడపడం, ఈర్ష్య/గొడవలు/ అసూయలకు దూరంగా ఉండడం లాంటివి మన జీవసంబంధ వయస్సును తగ్గిస్తాయి.
నేను వయస్సులో పెద్దవాన్ని కాబట్టి నా మాటే నెగ్గాలని అనుకుంటే ఆనందం ఆవిరి అవుతుంది. మన అహానికి హద్దులు వేసుకోవాలి. మరణం గూర్చి అతిగా ఆలోచించరాదు. అనాయాస మరణాన్ని ఆహ్వానించాలి. మొండితనం, పట్టుదలలను గట్టున పెట్టాలి. అనుకూల ప్రతికూలతల్లో కూడా ఒకే విధంగా స్పందించాలి. శారీరక చురుకుదనాన్ని మేల్కొల్పాలి. మన వద్దకు ఎవరూ రారని గమనిస్తూనే ఎవరి నుండి ఏదీ అతిగా ఆశించరాదు. •
మధుపాళీ
కరీంనగర్, 9949700037





