సెప్టెంబర్ 5 జయంతి
డా. రాధాకృష్ణన్ భారతీయ మహర్షుల కోవకు చెందిన వారు. సౌమ్యుడు, విద్యావేత్త, నిరడంబరుడు, తత్వవేత్త, రాజకీ యవేత్త, తెలివైన వాడు. మానవజీవితంలో మంచిని పెంచాలనీ, ఉత్తమ సమా జాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లో మమతాను రాగాలను పెంచే దిశగా ప్రపంచం కృషి చేయాల న్నారు. అహింసా విధానం ద్వారా ప్రపంచ దేశాల్లో శాంతిని పెంచ వచ్చన్నారు. మంచి విద్యార్థుల వల్లే మంచి ఉపాధ్యాయులు తయార వుతారనీ, అదేవిధంగా మంచి ఉపాధ్యాయుల వల్లే మంచి విద్యార్థులు తయారవుతారని చాటి చెప్పారు. మంచి విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎన్నో పదవులను అంలకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయులకు ఆదర్శమూర్తి. దేశానికి నేత అయినా గురువుకు విధ్యార్ది యే. ఉపాధ్యాయుల దశానిర్దేశమే లేకపోతే విధ్యార్దుల జీవితాలు చీకటి ప్రయాణాలు అవుతాయి. ‘‘విద్యకు విద్యార్ధులు అంకితం – ఉపాధ్యాయులు విద్యార్ధులకు అంకితం’’ ఈ అవినాభావ సంబంధంతోనే సంస్కారవంతమైన సమజనిర్మాణం’’ అని చెప్పిన తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి. స్వాతంత్య్రదినోత్సవం, గాంధీ జయంతి గణతంత్ర దినోత్సవం తరువాత దేశ వ్యాప్తంగా ప్రతిచోటా సెప్టెంబర్ 5, జరిగే ఉత్సవం ఉపాధ్యాయ దినోత్సవం . తల్లిదండ్రులు జన్మనిస్తే చదువుతో క్రమశిక్షణ, విలువలను నేర్పి సమగ్ర వ్యక్తిత్యం గల మనిషిగా తీర్చిదిద్ద గల శక్తి కేవలం ఒక ఉపాధ్యాయుడికే ఉన్నది. కుటుంబ సభ్యులు తరువాత ప్రతి మనిషి తన జీవితంలో ఎక్కువ కాలం గడిపేది ఉపాధ్యాయుడితోనే. ఒకనాడు ఉపాధ్యాయ వృత్తి మీద అభిమానం ఉన్నవారు ఉపాధ్యాయులుగా చేరేవారు. గ్రంధాలయం, ఆటస్థలం, ప్రయోగశాల, తరగతులు తగిన సంఖ్యలో ఉంటేనే విధ్యాలయాలు, ఏ ఉపాధ్యాయుడైన తమ భాధ్యతలను సక్రమంగా నిర్విహించ గలుగుతారు.
ఒకమారు ఆయన రాష్ట్రపతిగా పనిచేసేప్పుడు ఆయన జన్మదినాన ఆయన్ను అభినందించేందుకై వచ్చిన వారితో ఆయన మందస్మిత వదనంతో ‘‘నాకు సన్మానాలు, శుభాకాంక్షలు చెప్పే బదులుగా మీరు, నా జన్మదినాన్ని ‘ఉపాధ్యాయ దినోత్సవంగా’ ప్రకటించి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తే నన్ను సంతోషపెట్టినట్లే, నాకు సన్మానం చేసినట్లు భావిస్తాను, ఉపాధ్యాయులుగా మేథావులు ఉండాలి, వారిని ప్రోత్సహించాలి’’ అని చెప్పారు. ఆ విధంగా 1962 నుండీ రాధాకృష్ణన్ జన్మ దినోత్సవాన్ని ‘గురు పూజోత్సవం‘ గా ప్రకటించి, ‘‘ ఉపాధ్యాయ దినోత్సవం’’గా జరుపుకుంటున్నాము.. మన మాదిరే అనేక దేశాలు ఈ టీచర్స్ డే ని జరుపుకుంటున్నాయి. అమెరికాలో ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం టీచర్స్ డే గా గుర్తిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 100 ఫైగా దేశాలు అక్టోబర్ 5వ తేదీని ‘‘టీచర్స్ డే’’ గా గుర్తిస్తూ ఆ దేశాలలోని ఉపాధ్యాయులను సత్కరిస్తాయి.
1888 సెప్టెంబర్ 5న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మకు జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాభ్యాసం తిరుపతి, నెల్లూరు, మద్రాసులో జరిగింది. రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఈయన చదువంతా ఉపకార వేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. ఆయన రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు.
ప్రపంచవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో గౌరవ సభ్యులుగానూ, విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించిన ఆయన మహా పండితులు. అందుకే ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. గ్లోబల్ టీచర్ ఆఫ్ మోడరన్ టైమ్స్‌గా ఆయన గుర్తింపు పొందారు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్‌ఛాన్స్‌లర్) గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన సర్వేపల్లి పాఠాలు చెబుతుంటే విద్యార్థులు ఎంతో ఆసక్తితో వినేవారు. ఆయన మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి గుర్రములు తొలగించి గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. వారిలో ఒక విద్యార్థి అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నధిష్ఠించిన ఎస్ నిజలింగప్ప.
‘‘మీరు అక్స్‌ఫర్డ్, కేమ్ బ్రిడ్జ్ లాంటి విశ్వ విద్యాలయాల్లో చదివి ఉన్నట్లయితే మరెంతో శొభించేవారు’’ అని ఆయన సన్నిహితులు, అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు, ఆయన సమాధానం ఒకటే, ‘‘నేను విద్యార్థిగాకాదు, ఆ విశ్వవిద్యాలయాలకు గురువుగా వెళ్తాను’’, అని. అన్నట్లుగానే ఆయన 1937 నుంచీ 1957 వరకూ అక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో గౌరవ అధ్యాపకునిగా బోధించారు. 1928లో జరిగిన ఆంధ్రమహాసభ సమావేశాలకు హాజరైన రాధాకృష్ణన్, మద్రాస్ ప్రెసిడెన్సీలో సీడెడ్ జిల్లాల విభజనగా కాక రాయలసీమ గా మార్చాలనే ఆలోచనను ఆయన సమర్ధించారు. 1946 లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషద్ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించిన అయన 1948లో విశ్వ విద్యాలయలవిద్యా కమిషన్ అధ్యక్షునిగా వ్యవహరించారు. రష్యాలో భారత రాయబారిగా నియమితులైన తరువాత ఉభయ దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత పెంపొందించేందుకు ఆయన కృషి అమోఘం.
1952లో మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. ఆ పదవులకే వన్నె తెచ్చారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. ఏనాడూ ఆడంబరాలకు పోలేదు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు. 1975లో ‘టెంపుల్ టన్’ బహుమతి ద్వారా లభించిన 96 వేల డాలర్ల మొత్తాన్ని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతిపై ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. రాధాకృష్ణన్, డా. కె. యం మున్షీతో కలిసి భారతీయ విద్యాభవన్ స్థాపించారు. 1908 నుంచి 1967 వరకూ ఆయన సుమారు 23 గ్రంథాలు రాసి కోట్లాదిమందిని ప్రభావితులు చేసాయి.. ఇంకా చేస్తునే ఉన్నాయి.
ఆయనకు పురస్కారాలతో కీర్తించినా.. ప్రజలు ప్రభుత్వాలు గౌరవించినా, నిరాడంబరంగా, భేషజం లేకుండా జీవితం గడిపి చివరివరకూ అభ్యాసం- అధ్యాపనం పైనే దృష్టి సారించిన మహనీయుడాయన. మహామేధావిగా, గొప్పవ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా, ప్రపంచ దేశాల మన్ననలందుకున్న రాష్ట్రపతి 1967 లో పదవీ విరమణ చేసిన తర్వాత చివరి రోజు వరకు మద్రాసులోని తమ భవనం లో, తాత్విక చింతన చేస్తూ 1975 ఏప్రిల్17 న దివంగతులయ్యారు.
– నందిరాజు రాధాకృష్ణ, 98481 28215




