తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: మాదిగల హక్కులకై చేపడుతున్న విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం తాండూరులో పట్టణంలోని తులసి గార్డెన్లో నిర్వహించిన విశ్వరూప మహా బహిరంగ సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగల ఎస్సి వర్గీకరణ మాదిగల హక్కులకై హైదరాబాద్లో చేపడుతున్న విశ్వరూప మహాసభకు రాష్ట్రంలోని నలుమూలల నుండి మాదిగ జాతి బిడ్డలు భారీ ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేసి తమ ఐక్యతను చాటాలని కోరారు. గత సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కొరకు పోరాడుతున్న ఏ ప్రభుత్వాలు కూడా మాదిగల సమస్యలను పరిష్కరించకుండా మాదిగల పట్ల వివక్ష చూపుతున్నాయని అన్నారు. ఎన్నో ఏండ్లుగా మాదిగ జాతి బిడ్డల తరపున అనేక పోరాటాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఒక్క మాదిగ బిడ్డకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ బిజెపి పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాయని దండోరా ను బలోపేత చేయాలని ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. మాదిగ బిడ్డల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసి సాధించామని అన్నారు. ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పింఛన్లు రేషన్ కార్డుదారులకు 6 కిలోల బియ్యం తదితర అంశాలపై పోరాటాలు చేసి సాధించిన ఘనత ఎమ్మార్పీఎస్ దక్కుతుందని అన్నారు. విశ్వరూప మహాసభను విజయవంతం చేసేందుకు మాదిగ బిడ్డలు ఇంటికి తాళం వేసి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ, మండల ఇన్చార్జి నర్సింలు ,యాలాల ఇన్చార్జి కృష్ణ, బషీరాబాద్ ఇన్చార్జి మహేందర్ ,మండల కో కన్వీనర్ వెంకట్ జిల్లా కో కన్వీనర్ ప్రకాష్, మల్కప్ప, జిల్లా కో కన్వీనర్ అంజి విద్యార్థి నాయకులు జాన్ వెంకట్, రాందాస్, జావిద్, ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.




