విలువల సేద్యం

ఈ నాటకాల జగతిలో
వీళ్లంతా మహానటులే…
నటనకే నడకలు నేర్పగల
నవీన నటపితామహులే

జీవితమంతా నటిస్తూ
నటనలోనే జీవించగల
అపూర్వ సహజనటులే

భువన వేదిక మీద
చిత్ర విచిత్ర పాత్రలను
అవలీలగా పోషించగల
అద్భుత నటసంపన్నులే

మదిలో విషం ఒంపి
నవరసాలు పండించగల
విఖ్యాత నటవిభూషణులే

నటించడం వీరి నైజం
నమ్మించడం వీరి ఇజం

ఇంతటి ఉద్దండులతో
దండిగ నిండిన జగతిలో

విలువల సేద్యానికి
సంసిద్ధపడ్డ నేస్తమా !

తెగుళ్లు సోకిన మెదళ్ళు
నీ సంకల్పాల మొదళ్లపై
విష కత్తులను దూస్తాయ్‌

‌మౌఢ్యం హెచ్చిన నోళ్లు
నీ ఆశయాల చిగుళ్లపై
విద్వేష కుళ్లు కక్కుతాయ్‌

అయినా…
లక్ష్యం మరువక
కార్యదీక్షను విడువక
ధైర్యంగా ముందడుగేయ్‌

‌కలుపు మొక్కల కలదున్ని
జగతిని శ్యామలం చేసేయ్‌

   –  ‌కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *