విమోచనాక్షరం!

పిచ్చుక వాలింది భుజంపై
ఆమె కూర్చున్న చోటల్లా
ఏవో కొన్ని వాలుతూనే ఉంటాయి
పువ్వులు విప్పుకుంటాయి
గడ్డి పచ్చబడుతుంది
చిలుకలు ఊపిరి సలిపే
వసంతం వచ్చేదేమో కానీ
ఆమె వస్తుందంటే కంటగింపే
మాపై వాళ్ళకెందుకో అంత
మందూ మాకులు ఏవో ఉన్నాయంటారు
మానవీయ కోణంలో చూడరు
వెన్నెల నక్షత్రాలు ఆమెలో పొదగబడి ఉన్నాయి
కొన్ని వేల నదీగానాలు పారాడుతున్నాయి
మనం కూడా చుట్టూ ఉండే కావాల్సిన వాళ్ళమే
గాయాలు చేస్తుంటాం అప్పుడప్పుడు
ఓర్చుకోవడం నేర్చుకుందాం సహజంగానే
గుర్తించడం తిరగబడడం మరువకుండా
ఆమె మౌనంలో భయంకర విప్లవం ఉందని
ఆమెను చూస్తేనే అవగతం అవుద్ది
అవును ఆమె మాట్లాడదు
చూస్తూ విమోచనాక్షరాలు వెదజల్లుతుంది
వృధాగా కాలం వెళ్ళబుచ్చదు
కాంతుల హారం అల్లుతుంటుంది
భలేగా చూడచక్కగా చకచకా పరమ ఓపికగా
అది అబ్బిందా ఆమె నైజామా పిచ్చి మాటలు
నవ్వుతుంది మాత్రం అర్థవంతంగా
అనవసరంగా స్థలం ఇవ్వదు
అవసరానికి దారి చూపిస్తది
అలవాటు చేయదు సోమరిగా
అలవర్చుకోమంటుంది సాధనతో శ్రమతో
అన్నీ అలా అయిపోతుంటాయి ఆమె చేతిలో
అబ్బ! ఆమెలా ఉండాలని అందరికీ ఉంటది లోపల
అది అలానే మూలన పడుంటుంది
ఎప్పటికీ రూపం దాల్చక
తలవడం కాదు కేవలం
ఆ కలను నేలపై నడిపించాలి కదా..!

  -వగ్గు రఘువీర్‌
9603245215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *