ప్రపంచంలోను, మనదేశం లోను ఎంతో మంది తత్వవేత్తలు జన్మించి తమదైన శైలిలో మానవాళికి మహోపకారం చేసారు. కొంత మంది నాస్తికులుగా ప్రపంచంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజల్లో చైతన్యం రగిలించి, శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంపొందించారు మరి కొంతమంది తమ ఆధ్యాత్మికతకు,తత్వానికి నైతికతను,మానవత్వాన్ని మేళవించి జన జీవితాలను ప్రభావితం చేసారు. కొంతమంది దైవభక్తిని విడనాడి కేవలం సత్యాన్ని మాత్రమే నమ్మి శాస్త్రీయతను తమ సిద్దాంతంగా భావించడం జరిగింది. మరికొంత మంది దైవత్వాన్మి విశ్వసిస్తూనే శాస్త్రీయమైన ఆలోచనలను ప్రోత్సహించారు. ఎవరూ ఏ మార్గంలో పయనించినా ప్రపంచ మానవాళిని సరైన పంథాలో నడిపించిన వారే చరిత్రలో మిగిలి పోయారు. అలాంటి వారి గురించి అవలోకనం చేసుకోవాలి.జర్మనీకి చెందిన తత్త్వవేత్త ఫ్రెడరిక్ నీట్షే ఒక విమర్శకుడు,విశ్లేషకుడు. వ్యంగ్యం,తత్వం,సత్యం,కవిత్వం,విలువలపై ఆయన చేసిన కృషి అమోఘం. స్వీయ అనుభవాల ద్వారా, మానవుడు తనను తాను నిర్మించుకోవాలని,ఊహాజనితమైన శక్తులకు ప్రభావితం కాకూడదని సూచించాడు.నీతికి స్థానం కల్పించి,సత్యాన్ని బ్రతికించడం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్ ఒక మహా జ్ఞాని. ఇంతటి మహాజ్ఞాని ఎప్పడూ తనను తాను అజ్ఞానిగానే భావించే వాడు. తాము జ్ఞానులమని విర్రవీగే వారెప్పుడూ అజ్ఞానులు గానే మిగిలిపోతారు. నిరంతరం తెలుసుకోవడానికే ప్రయత్నించాలి. సముద్రమంత జ్ఞానంలో నీటి బొట్టంత జ్ఞానం మనకుండదు. అందుకే నిరంతర జ్ఞానం కోసం తపించాలి. మూర్ఖులు జ్ఞానులమని భ్రమిస్తారు. అహంకారంతో విర్రవీగుతారు. తామే సర్వం అని భావిస్తుంటారు.
ఇది అత్యంత మూర్ఖ భావజాలం నుండి ఉద్భవించిన ఉచ్ఛస్థాయి అవివేకం. వ్యక్తిత్వం లేని కృత్రిమమైన తెలివి, తెచ్చి పెట్టుకున్న ఢాంబికం అజ్ఞానానికి పరాకాష్ఠ. ఎంతటి జ్ఞానులకైనా సంస్కారం, వినయ విధేయతలు, మృధుభాషణం కొరవడితే, పరుష పదజాలంతో విర్రవీగితే అది పెరిగిన పైత్య ప్రకోపాలకు నిదర్శనమే తప్ప జ్ఞానం అనిపించుకోదు. మూర్ఖత్వం జ్ఞానం కాజాలదు. సోక్రటీస్ ఎంతటి మహాజ్ఞాని అయినా, ఏనాడూ తన విచక్షణను కోల్పోలేదు. వివేకవంతమైన ఆలోచనలతో ప్రజలను చైతన్యం చేసాడు.జీవితమంటే కేవలం జన్మించి, మరణించడం కాదని, మరణం అందరూ చవిచూడక తప్పదని,మరణం గురించి ఆలోచించడం వృథా అని, బొందిలో చలనమున్నంత కాలం ప్రతీ ఒక్కరూ నిరంతర విద్యార్థుల్లా నేర్చుకోవాలని, సత్యం,ధర్మం, నీతి తప్పకూడదని ప్రజలకు బోధించే వాడు. సమాజాన్ని నాశనం చేస్తున్నాడనే నెపంతో నాటి గ్రీకు పాలకులు మార్పు కోసం శ్రమించిన సోక్రటీస్ కు విషమిచ్చి,అర్థాంతర మరణాన్ని బహూకరించారు. కర్కశ పాలకుల మూర్ఖత్వాన్ని నాటి గ్రీకు ప్రజలు హర్షించలేదు. జీవించిన కాలంలో సోక్రటీస్ పట్ల అత్యంత గౌరవం ప్రదర్శించారు. ఆయన చెరశాలలో ఉన్నా,చావుకు దగ్గరౌతున్నా అశేష జనవాహిని ఆయన సందర్శన కోసం తపించేది. ఇంతకంటే పుట్టుకకు సార్ధకత మరొకటుండదు. మరణించినా ప్రపంచానికి ఒక వెలుగును చూపించి, నేటి శాస్త్రీయ దృక్పథానికి ఒక మార్గం చూపించిన నిజమైన మేథాసంపన్నుడు సోక్రటీస్. ఇలా ఎంతో మంది మహా తత్త్వవేత్తలు మన ముందు సజీవంగా లేకపోయినా వారి చరిత్ర భావి తరాలకు స్ఫూర్తినిచ్చింది.
జీవితం అనేక పరీక్షలను పెడుతుందని, బాధలు,కష్టాలు తెలియని వారు సుఖవంతమైన జీవితానికి అలవాటు పడి, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అజ్ఞానులుగా మిగిలిపోతారు. వర్తమాన ప్రపంచంలో జరుగుతున్న తంతు ఇదే. తాము సుఖంగా బ్రతకాలి, ఇతరులు ఎలాపోతే మనకేంటి అనే ధోరణి ప్రబలింది. నమ్మిన వారిని నిండా ముంచి, తాము మాత్రం సుఖంగా జీవించాలనే భావన పెరిగింది. కృతఘ్నత ప్రబలిపోయింది. నీతి నియమాలు గాలికి వదిలేసి, ఎవరి సుఖాన్ని వారు చూసుకుంటే మానవ పుట్టుక దండగ.కన్ఫ్యూషియస్ చైనీయుల గురువు గా ప్రసిద్ధి. మానవ నడవడిక, నీతి ఆధారంగా సమాజం సద్గతిలో పయనిస్తుందని ఇతని ఆశ. సమాజంలో నీతి కరువైతే ఎలాంటి పరిణామాలుంటాయో ప్రస్తుత ప్రపంచ పోకడలు నిరూపిస్తున్నాయి.ఇక మన దేశానికి చెందిన స్వామి వివేకానంద ప్రపంచం కొనియాడిన ఆధ్యాత్మిక గురువు మరియు తత్త్వవేత్త. ఆయన ప్రసంగాలు నేటికీ యువతకు ఉత్తేజ భరితాలు. ప్రపంచాన్ని మార్చే శక్తి గల విద్య గురించి, విద్య యొక్క ఆవశ్యకత గురించి ఆనాడే చాటి చెప్పాడు. యువత పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని చాటి చెప్పాడు.యువత కోసం ఆయన చేసిన ప్రసంగాలు నేటికీ స్ఫూర్తి దాయకం.గుంపులో ఒకరిగా కాకుండా, అందరిలో మేటిగా రాణించాలని చెప్పాడు. జీవితంలో ఎవరికి వారే ఆత్మశోధన చేసుకోవాలని. మన అంతరాత్మకు మించిన అద్భుతమైన శక్తి మరొకటి లేదని, మనలో మనమే తర్కించుకొని ముందుకు సాగాలని, మనలో దాగిన అద్భుతమైన వ్యక్తితో మనం సంభాషించాలని సూచించాడు.కష్టాలను భరించే శక్తి అత్యంత గొప్పదని,తనను తాను తెలుసుకోవాలని,చావుకు భయపడడం ఒక మూర్ఖత్వమని వివేకానంద భావన.ఎవరూ ఈ దేశంలో ఆకలితో మరణించరాదనే వివేకానంద ఆలోచన ఆయన మానవత్వానికి నిదర్శనం.
తెలుగు వాడిగా జన్మించి,ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాజ్జాని,తత్త్వవేత్త జిడ్డు కృష్ణ మూర్తి గురించి నేటి తరం తెలుసుకోవాలి.కృత్రిమంగా కాకుండా హృదయం నుండి స్పందన రావాలని,అప్పుడే మార్పు సాధ్యమని జిడ్డు కృష్ణ మూర్తి భావన.సత్యాన్వేషి, జీవన మార్గదర్శి” జిడ్డు కృష్ణ మూర్తి”. తెలుగువారి జ్ఞాన గని జిడ్డు కృష్ణమూర్తి. నిజమైన మానవ సంబంధాలు,మానసిక విలువలు, మానసిక పరివర్తన కోసం కృషి చేసి జగద్గురువుగా ప్రజలు భావించినా, ఈ భావజాలాన్ని దూరంగా నెట్టిన నిజమైన తాత్వికుడు,సత్యాన్వేషి జిడ్డు కృష్ణమూర్తి. పూలపాన్పులా సాగే జీవితాన్ని త్యజించి, వేలాది ఎకరాల భూమిని వద్దనుకుని వాస్తవిక ప్రపంచంలో నిరాడంబరంగా జీవించి, తత్వంలో ఆధునికత్వం జోడించిన జిడ్డు కృష్ణమూర్తి నిజమైన దార్శనికుడు. ఆయన బోధనలు నేటి అస్తవ్యస్త ప్రపంచ గమనాన్ని సరిచేయడానికి ఎంతో ఉపకరిస్తాయి.ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మవద్దని,నమ్మి మోసపోవద్దని, తమను తాము నమ్ముకోవడం కూడా దండగని, చంచలమైన ఆలోచనలను విడనాడాలని,ఉన్నతంగా ఎదగాలని ఉద్భోధించాడు.
మన తెలుగు నాలుకలపై నాట్యం చేసే “విశ్వదాభిరామ వినురవేమ…” అనే వేమన శతక పద్యాలకు సృష్టికర్త “యోగి వేమన’.వేమన ఒక అద్భుతమైన తత్త్వవేత్త. ఎన్నో భోగాలు అనుభవించి, నిజం గ్రహించి సకల భోగభాగ్యాలను వదలి,జీవిత సత్యాలను ఆకళింపు చేసుకుని, అశాశ్వతమైన జీవితం కోసం కాకుండా నిజాన్ని గ్రహించి జీవించాలని చతురతతో, మనసుకు గుచ్చుకునేలా నిష్కర్షగా నిజం చెప్పిన వేమన తరతరాల తెలుగు ఆస్తి. వేమన ఒక సత్యశోధకుడు,జ్జాని,తత్త్వవేత్త. నీతివంతమైన సమాజ స్థాపనకు,చైతన్యం రగిలించిన వేమన పద్యాలను మరవకూడదు. ఇక ఎంతో మంది మహనీయులు వివిధ ఉద్యమాల ద్వారా ప్రజలను జాగృతి చేసారు. వారి మాటల్లో తర్కం,తత్వం ఉట్టి పడుతుంది. పుట్టుకకు,చావుకు మధ్య ఉన్న స్వల్ఫకాల జీవితం ఎలా గడిపామన్నదే ప్రధానం.పుట్టుక నీది,చావు నీది, బ్రతుకంతా దేశానిదన్న కాళోజీ మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని గ్రహించాలి. మనల్ని ,మానసికంగా బలహీన పరిచే శక్తులకు దూరంగా ఉండాలి. మనం మన మనసుకు నచ్చిన రీతిలో జీవించాలి. మన మనసు లోతుల్లో ఉన్న నిజమైన లోకం తలుపులకు తాళాలు మనవద్దే ఉన్నాయని, వాటిని తెరవడం మన చేతుల్లోనే ఉందన్న “జిడ్డు కృష్ణమూర్తి” తత్వం తరతరాలకు స్ఫూర్తి. పుట్టుకతో వృద్ధత్వం కాదు ముందు తరాలకు మార్గదర్శకత్వం కాగల యువత దేశానికి అవసరమన్న శ్రీశ్రీ అక్షరాగ్ని తూణీరాలు భావి తరం ఆలోచనలకు ఇంధనాలు కావాలి. ఇలాంటి విశిష్ఠ,విలక్షణ లక్షణాలతో, ధైర్య సాహసాలతో కేవలం దేశం కోసమే జీవించి, దేశం కోసమే మరణించిన మహనీయుల ఆదర్శాలు భావితరాలను ఆదర్శం.
– సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు,కాలమిస్ట్)
మొ:9704903463.