విభిన్న రాజకీయ లక్ష్యాలతో సెప్టెంబర్‌ 17

సెప్టెంబర్‌17… తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేకం. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన  నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న దినం. ఈ రోజును.. విలీన దినంగా జరుపుకోవాల్నా, విమోచన దినమనాలా, స్వాతంత్య్ర దినంగా పరిగణించాలా అనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ఎవరి అవసరాలకు తగినట్లు వారు తమకు అనుకూలంగా దీన్ని మార్చుకుంటున్నారు. సెప్టెంబర్‌ 17ను కేంద్రంలో అధికారంలో ఉండి, తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ ఆశిస్తున్న భా జ పా విమోచన దినమంటే, కాంగ్రెస్‌ పార్టీ విజయభేరిగా ప్రకటించింది. తెలంగాణ సెంటిమెంట్‌ ను జనాలలో ప్రేరేపించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన భా రా స (గతంలో తె రా స) జాతీయంగా ఎదగాలన్న లక్ష్యంతో ఈ 17వ తేదీని సమైక్యతా దినంగా అభివర్ణిస్తున్నది. తెలంగాణ నిజాం అధీనం నుంచీ స్వేచ్ఛ కల్పించేందుకు ప్రాణాలను పనంగ పెట్టి సాయుధపోరటం జరిపిన కమ్యూనిస్టులు వర్తమానంలో ఉనికి కోసం తాపత్రయ పడుతున్న తరుణలో ఏ పేరిట జరిపినా నామ మత్రమే అవుతుంది. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న తరం కాలం తీరిపోయి, అప్పటికి పుట్టని వారే ఇప్పుడు తెలంగాణ పోరాటాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. నాడు పటేల్‌ చొరవతో ‘‘ఆపరెషన్‌ పోలో’’ నిర్వహించి నేటితో 75 వత్సరాలు పూర్తవుతున్నది. ఆ పోరాటంలో పాల్గొని ఉంటే ఇప్పుడు వారి వయసు కనీసం 90 – 95 సంవత్సరాలుండాలి. అటువంటి వారెవరూ కనబడడం లేదు, వినబడడంలేదు.

రెండు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో పాల్గొని త్యాగాలకు ప్రతీకగా నిలిచిన ప్రముఖుల పేర్లూ వర్తమానంలో కనుమరుగయ్యయి. నేడు వారి స్మరణే కరవైంది. రాజకీయ పదవుల్లో ఉన్న వారు, ఆశిస్తున్న వారు పోరాట వీరుల పేరు పక్కన పెట్టి తరుముకొస్తున్న ఎన్నికలలో లబ్దికోసం తమ నాయకులు, వారి ఆప్తులను కీర్తించే పనిలో మునిగిపోయారు. ఎన్నికలకు సొమ్ము సమీకరణలో కొందరు, ఓటర్లను ఆకర్షించేందుకు ఉచితాల పేరిట పథక రచన, ప్రచారాల్లో మునిగి ఉన్నారు.  చివరకు అందరూ కలసి విమోచన, విలీనం వాదన లేకుండా సాయుధ పోరాటాన్నే రాజకీయాలలో నిమజ్జనం చేస్తున్నారు.

విమోచనోద్యమం సాకుగా రానున్న అసెంబ్లి, పార్లమెంట్‌ ఎన్నికలలో విజయం లక్ష్యంగా భారతీయ జానతా పార్టీ తెలంగాణ తో పాటు దిల్లీ రాష్ట్రపతి భవన్‌ లోనూ విమోచనదినం నిర్వహించేందుకు కార్యక్రమాలు రూపొందించుకుంది. కేంద్ర ఆంతరంగిక భద్రత శాఖ మంత్రి అమిత్‌ షా 16వ తేదీ హైదరాబాద్‌ చేరుకుని పార్టీ కార్యక్రమాలకు హాజరై, విమోచన దినం సందర్భంగా 17 వతేదీ ఉదయం పెరేడ్‌ గ్రౌండ్స్‌ లో రాష్ట్ర పోలీసు, పారామిలిటరీ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు.  కాంగ్రెస్‌ తొలిసారి హైదరాబాద్‌ లో సెప్తెంబర్‌ 15, 16 సి డబ్ల్యు సి సమావేశాలు నిర్వహించి 17 వ తేదీ సాయంత్రం హైదరబాద్‌ తుక్కుగూడలో విజయభేరి పేరిట భారీ సమీకరణతో బహిరంగ సభకు ఉద్యుక్తమౌతున్నది.

సి డబ్ల్యు సి కి హాజరయ్యే కాంగ్రెస్‌ జాతీయ నేతలు ఖర్గే, సోనియా, ప్రియాంక, రాహుల్‌ తదితరులు సభకు ప్రధాన ఆకర్షకులవుతున్నారని సమాచారం. ఇక గత తొమ్మిదేళ్ళుగా కె సి ఆర్‌ నాయకత్వంలో అధికారంలో ఉన్న భా రా స జాతీయ స్థాయిలో విస్తరణ యోచనలో భాగంగా పావులు కదుపుతున్నది. 17 వతేదీ కార్యక్రమం కేవలం రాష్ట్ర రాజధానికి పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో మండల స్థాయిలొ పార్టీని పటిష్ఠం చేసుకుని ఎన్నికలలో హాట్రిక్‌ సాధించే వ్యుహ రచన చేస్తున్నది. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌ మైదానంలో నాటి ఉదయం ముఖ్య మంత్రి కె సి ఆర్‌ జాతీయ పతాకావిష్కరణ, ప్రసంగం ఉంటాయి. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్య్లు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యులు  మండల, జిల్లా స్థాయి కార్యక్రమాలకు హాజరవుతారు. కమ్యూనిస్టులు రానున్న ఎన్నికల పొత్తులకు అనుగుణంగా వ్యవహరిస్తారని భోగట్టా.

చరిత్రలోకి వెళితే….

రాజకీయమేమైనా నిరంకుశ పాలన నుంచి స్వాతంత్య్రం లభించి, విముక్తి దొరికిన రోజుగా చూడాలన్నది సామాన్యుల ఏకాభిప్రాయం. 1947 ఆగష్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే, ఆనాడు నిజాం సంస్థానంలోని 16 జిల్లాల హైదరాబాద్‌ రాష్ట్రానికి మాత్రం విముక్తి లభించలేదు. వీటిలో ఎనిమిది జిల్లాలు తెలుగు ప్రాంతంలో, 5 జిల్లాలు మరాఠ్వాడాలో, మరో మూడు కర్ణాటక ప్రాంతంలో ఉండేవి. ఎందరో త్యాగధనుల సుధీర్ఘ పోరాటం, బలిదానాల ప్రతిఫలంగా సెప్టెంబర్‌ 17, 1948న హైదరాబాద్‌ సంస్థానమనే రాష్ట్రం  భారతదేశంలో కలిసిపోయి స్వేచ్ఛా వాయువులను పీల్చుకుని స్వాతంత్య్రం పొందింది. నాటి సాయుధ పోరాటం నిజాం పేరు మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తలచుకుంటున్న దాఖలాలే లేవు.

వాస్తవానికి హైదరాబాద్‌ సంస్థానంలో ఉన్న అత్యధిక అత్యల్ప  వర్గాల మధ్య సాంఘిక, ఆర్థికపరంగా భేదం ఉండేది కాదు. ప్రత్యేక హోదా కలిగిన వ్యక్తులు కొందరు ఈ రెండు వర్గాలలో ఉండేవారు. అయితే పాలకుడు మహమ్మదీయుడు కావడంతో ఆ వర్గానికి చెందిన వారు అదొక సదుపాయంగా భావించుకునేవారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ముస్లింలు, తమ పౌరులు హిందువులతో సమానంగా వెనుకబడే ఉన్నారు..  మైనారిటీ వర్గాల వారు కూడా నిజాం పాలనలో అణచివేతకు గురైనవారే. భూస్వామ్య వర్గాలకు చెందిన వారు నవాబుకు అండదండలుగా ఉండేవారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన పదమూడు నెలల తరువాత హైదరాబాద్‌ రాష్ట్రం సెప్టెంబర్‌ 17న భారతదేశంలో విలీనమయ్యింది. అయితే హైదరాబాద్‌ రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ భారత యూనియన్‌లో కలవనంటూ మొండికేసి హైదరాబాద్‌ ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న నేపథ్యంలో నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ సైన్యాన్ని రంగంలోకి దింపడంతో తాము లొంగిపోతున్నట్లు అసఫ్‌జాహీ వంశస్థుడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ రేడియోలో ప్రకటించడంతో వివాదం సుఖాంతమయ్యింది. రజాకార్ల ఊచకోతలతో పేట్రేగిపోతుంటే ఎన్నో వేలమంది ప్రాణాలు బలిదానం చేస్తే కానీ హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ స్వాతంత్య్రం లభించలేదు. దేశానికి స్వాతంత్య్రం లభించిన పదమూడు నెలల తరువాత హైదరాబాద్‌ రాష్ట్రం సెప్టెంబర్‌ 17న భారతదేశంలో విలీనమై  వివాదం సుఖాంతమయ్యింది.

జమలాపురం కేశవరావు, లక్ష్మీనరసయ్య, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, చండ్ర రాజేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్‌, షోయబ్‌ ఉల్లాఖాన్‌, మల్లు స్వరాజ్యం, రాంజీగోండ్‌, విశ్వనాథ్‌ సూరి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, బెల్లం నాగయ్య, కిషన్‌ మోదాని తదితరులు తెలంగాణ విమోచనానికి పోరాటాలు చేశారు. మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి తదితర పోరాటయోధులు, దాశరథి, కాళోజీల కవితల స్ఫూర్తితో సామాన్య ప్రజలు సైతం ఊరువాడ నిజాంపై తిరగబడ్డారు. రజాకార్ల ఊచకోతలతో పేట్రేగిపోతుంటే ఎన్నో వేలమంది ప్రాణాలు బలిదానం చేస్తే కానీ హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ స్వాతంత్య్రం   స్వాతంత్య్రం లభించలేదు.
నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని ఒక ఒక వర్గం హిందూ, ముస్లీంల పోరాటంగా పేర్కొనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శలుండగా,  నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల ఆగడాలకు అణచివేయబడినవారు అన్ని మతాలకు చెందిన గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం అనే అంశం గుర్తించి విమోచన దినంగా చూడాలంటున్నారు మరి కొందరు. భూస్వామ్య దోపిడీ ఇంకా గ్రామాల్లో కొనసాగుతునే ఉందనీ, ఇప్పటికీ వారి నుంచి ప్రజలకు విమోచనం లభించలేదు కాబట్టి 17వ తేదీని విలీన దినంగానే చూడాలని కొందరు అంటున్నారు. ఏదేమైనా నిజాం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన రోజుగా చూడాలికాని, విద్రోహ దినం  కాకూడదని సామాన్యులు అందరూ అంటున్నారు.
– నందిరాజు రాధాకృష్ణ, 98481 28215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *