వినాయక నిమజ్జనాన్ని సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: వినాయక నిమజ్జనాన్ని సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా బుధవారం పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ హోటల్లో తాండూర్ డిఎస్పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో పాటు ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని శాఖల అధికారులు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కుల మతాలకు అతీతంగా నిమజ్జనాన్ని సోదరుభావంతో  భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ శుక్రవారం  తాండూరు పట్టణానికి సంబంధించి యాలాల మండలం కోకట్ కాగ్నాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం చేయడం జరుగుతుందని తెలిపారు. నిమజ్జనం రోజున నిర్వహించే శోభాయాత్ర, వినాయకుల ఊరేగింపుకు పోలీసు శాఖతో పాటు మున్సిపల్, రెవెన్యూ, వైద్య విద్యుత్, ఆర్అండ్బి తదితర శాఖల అధికారులు వారి శాఖల తరుపున ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్రలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో తాండూరు రూరల్ పట్టణ సిఐలు రాజేందర్ రెడ్డి రాంబాబు మున్సిపల్ కమిషనర్ బషీరాబాద్ యాలాల పెద్దెముల్ తాండూరు మండలాలకు చెందిన ఎస్ఐలు వివిధ విభాగాలకు చెందిన అధికారులు పలువురు నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *