పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: సర్వవిఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యులు, మాజీ డీప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకులు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాట శ్రీనివాస్ గౌడ్, స్ధానిక ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఉత్సవాలలో ఆటా పాటా కార్యక్రమాలు ఉల్లాసంగా ఉత్సాహ భరితంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నల్లొండ గద్దర్, మధుప్రియ విచ్చేసి, వారు పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.



