బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
అస్త్రవిద్యా ప్రదర్శనంగావించిన తర్వాత గదా, ఖడ్గ విద్యల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అదే సమయంలో సహజ కవచకుండలాలతో సూర్యకాంతితో ప్రకాశిస్తూ విశాలనేత్రుడై మత్తేభంలా నడుచుకుంటూ వచ్చాడు. దుర్యోధనాదులు కర్ణుని వెంటనిలిచారు. కర్ణుడు అర్జునుడు చేసిన విన్యాసాలన్నింటినీ చేసి •చూపించాడు. దుర్యోధనుడు అమితానందం పొందాడు. కర్ణుని గాఢాలింగం చేసుకుని తనతో స్నేహంగా వుంటూ రాజభోగాలన్నింటినీ అనుభవించమన్నాడు. కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తానన్నాడు. అర్జునుడు సన్నద్ధమయ్యాడు. కర్ణుడు ధనుర్భాణాలు పట్టుకుని ఎదురుగా నిలిచాడు. వారిరువురినీ చూసిన కుంతి కన్నీరు కార్చింది. ఆ సమయాన కృపాచార్యుడు రంగస్థలంలోకి అడుగుపెట్టి ద్వంద్వ యుద్ధ నియమాల ప్రకారం ఉభయులను కులగోత్రానామాలను చెప్పమన్నాడు. కర్ణుడు తలవంచుకుని నిలుచుండగా, దుర్యోధనుడు చూసి ఆచార్యునితో ఇలా చెప్పాడు. ఉత్తమ సంజాతునీ, మహావీరునీ, సైన్యాధిపతినీ శాస్త్రం క్షత్రియునిగా పేర్కొన్నాది. ఇప్పుడు నేను కర్ణుని అంగదేశాధీశుడిగా అభిషేకిస్తున్నాను. అని చెప్పి, అప్పటికప్పుడు స్వర్ణ సింహాసనం తెప్పించి, ధృతరాష్ట్రునకూ, భీష్మునికీ చెప్పి, కర్ణుని అంగరాజుగా అభిషేకించాడు. కర్ణుడు, దుర్యోధనుడుకి ఏంకాలన్నా చేస్తానని వాగ్దానం చేశాడు.
‘రధం తోలవలసిన నీకు రాజ్యాభిషేకమా’ అంటూ భీముడు అంటుంటే, దుర్యోధనుడు కోపంగా కాలమే క్షత్రియునికి ప్రధానం అంటూ హీనుడయినా భలవంతుడయితే క్షత్రియుడే అన్నాడు. అంతేకాదు పాండుల పుట్టుకనూ ప్రశ్నించాడు. కవచకుండల శోభతో విలసిల్లుతున్న కర్ణుడు సూతకులంలో పుట్టినా అంగరాజ్యానికే కాదు సమస్త భూమండలానికే ప్రభువు కాదగ్గవాడన్నాడు. అంతలోనే సూర్యాస్తమయం కావచ్చింది.
దుర్యోధనుడు కర్ణుని భుజంమీద చేయివేసి అర్జునుని ఓడించగల మిత్రుడు దొరికాడనే సంతోషంతో వెడలిపోయాడు. భీష్మప్రముఖులందరూ నిష్క్రమించారు. కర్ణుడు అంగదేశాధీశుడు కావడం కుంతికి ఆనందాన్ని కలిగించింది.
(మిగతా..వొచ్చేవారం)




