విచ్ఛిన్నకర శక్తుల నుండి దేశాన్ని రక్షించే సమయం

  • ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్‌కు వోటేయండి
  • విద్వేషపూరిత ప్రసంగాలతో పిఎంఓ గౌరవాన్ని తగ్గించిన మోదీ
  • పూర్తి విభజన స్వభావం కలిగి ఉన్నాయి
  • పంజాబ్‌ వోటర్లకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విజ్ఞప్తి  

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 30 : దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుండి రక్షించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త డా. మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రధాన మంత్రి కార్యాలయం గౌరవాన్ని తగ్గించారని మాజీ ప్రధాని అభిప్రాయపడ్డారు. లోక్‌ సభకు 7వ దశ ఎన్నికలలో భాగంగా పంజాబ్‌లో శనివారం పోలింగ్‌ నేపథ్యంలో ఆయన ఆ రాష్ట్ర వోటర్లకు మూడు పేజీలతో కూడిన లేఖ ద్వారా ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సమాజంలోని ఏ ఒక్క వర్గంపైనా తాను ప్రత్యేక శ్రద్ధ చూపాననే అంశాన్ని మాజీ ప్రధాని ఖండిరచారు. తన హయాంలో ఎక్కువ భాగం రాష్ట్రంలో అకాలీ-బిజెపి ప్రభుత్వం ఉన్నప్పటికీ, సహకార సమాఖ్యవాదం యొక్క నిజమైన స్ఫూర్తిని అనుసరిస్తూ, వనరులకు సంబంధించి సరైన వాటాను అందించామన్నారు. రేపు జూన్‌ 1న లోక్‌సభ ఎన్నికల ఆఖరి దశలో పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి, సమ్మిళిత ప్రగతి కోసం వోటు వేయాలని మన్మోహన్‌ సింగ్‌ పంజాబ్‌ వోటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షించబడే అభివృద్ధి-ఆధారిత ప్రగతిశీల భవిష్యత్తును కాంగ్రెస్‌ మాత్రమే నిర్ధారిస్తుందన్నారు.

ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను రాజకీయ చర్చలను ఆసక్తిగా గమనిస్తున్నానని, మోదీ అత్యంత దుర్మార్గమైన ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడ్డారని, అవి పూర్తిగా విభజన స్వభావం కలిగి ఉన్నాయని వోటర్లకు చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. సమాజంలోని నిర్దిష్ట వర్గాన్ని లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో గతంలో ఏ ప్రధానమంత్రి కూడా ఇటువంటి ద్వేషపూరిత, అన్‌పార్లమెంటరీ పదాలు మాట్లాడలేదని మన్మోహన్‌ తెలిపారు. ఆయన ప్రసంగాలలో మోదీ తనపై కూడా కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు. అయితే తాను తన జీవితంలో ఎప్పుడూ ఒక సమాజాన్ని వేరు చేయలేదన్నారు. అది బీజేపీకి మాత్రమే కాపీరైట్‌ అని, భారత ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారన్నారు. దేశంలో ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్యానికి అవకాశం ఇవ్వాలని వోటర్లను మన్మోహన్‌ కోరారు.

సంప్రదించకుండానే తమపై విధించిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలన్న ఏకైక డిమాండ్‌తో 750 మంది రైతులు..అందులో ఎక్కువగా పంజాబ్‌కు చెందినవారు, నెలల తరబడి దిల్లీ సరిహద్దుల్లో ఎడతెగని పోరాటం చేసి అమరులయ్యారని అన్నారు. లాఠీలు, రబ్బరు బుల్లెట్‌లు సరిపోవన్నట్లుగా వారిని పరాన్నజీవులంటూ పార్లమెంటు ఆవరణలో ప్రధాని మాటలతో దాడికి దిగారని మన్మోహన్‌ విమర్శించారు. గత కాంగ్రెస్‌-యుపిఎ ప్రభుత్వం 3.73 కోట్ల రైతులకు రూ. 72,000 కోట్ల విలువైన రుణమాఫీని అందించిందని, ఎంఎస్‌పిని పెంచిందని, దాని స్పెక్ట్రమ్‌ను విస్తరించిందని, ఉత్పత్తిని పెంచి ఎగుమతులను ప్రోత్సహిహించదని తెలిపారు. గత పదేళ్ల పాలనతో పోలిస్తే తమ హయాంలో వ్యవసాయ రంగం రెట్టింపు వృద్ధిని సాధించిందని మన్మోహన్‌ అన్నారు. బీజేపీ ప్రభుత్వం మన సాయుధ దళాలపై అనాలోచిత అగ్నివీర్‌ పథకాన్ని విధించిందని, దాంతో సాయుధ దళాల ద్వారా మాతృభూమికి సేవ చేయాలని కలలు కంటున్న రైతు కొడుకులైన పంజాబ్‌ యువత ఇప్పుడు కేవలం 4 సంవత్సరాల కాలానికి మాత్రమే రిక్రూట్‌మెంట్‌ పొందడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారని, అగ్నివీర్‌ పథకం దేశ భద్రతకు ప్రమాదమని, కాంగ్రెస్‌ పార్టీ అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని మన్మోహన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *