వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 9: వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు వికారాబాద్ పట్టణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ప్రజలను కోరారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు గుడుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ పైసలకు పదవులు అమ్ముకునే ఆనంద్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఘాటైన విమర్శలు చేశారు. మహిళా చైర్ పర్సన్ అయిన నాకు మొదటిసారి ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే.. ఎమ్మెల్యే ఆనంద్ అహంకారంగా ప్రవర్తించాడన్నారు. వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేద్దామంటే అడుగడుగునా అడ్డుపడ్డాడని, అలాంటి వ్యక్తిని మరోసారి గెలిపించుకుంటే అభివృద్ధి కుంటు పడుతుందని అన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి ప్రజల మనిషి ఆయన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కౌన్సిలర్ మురళి, దేవి రెడ్యానాయక్, గ్రామ నాయకులు బందయ్య నాయకులు రెడ్యానాయక్, మాజీ జెడ్పిటిసి ముక్తాహార్ షరీఫ్, మల్లికార్జున్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అడ్డుపడే ఎమ్మెల్యే మనకు వద్దు





