పోటీలో వరుసగా మూడోసారి
పాల్గొన్న కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్ షా, యూపీ సిఎం యోగి, టీడీపీ అధినేత చంద్రబాబు
వారణాసి, మే 14 : సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్ వేశారు. కేంద్ర మంత్రులు, కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా.. ఉదయం జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ స్థానం నుంచి ప్రధాని వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్ కార్యక్రమం లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. దీనికి ముందు కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రధాని పూజలు నిర్వహించారు.
అక్కడే క్రూజ్ షిప్‌లో పర్యటించారు. కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. నామినేషన్ నిమిత్తం మోదీ పర్యటన ఏర్పాట్లను హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షించారు. ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ బన్సల్ చాలా రోజుల నుంచి వారణాసిలో ఉండి పనులను చక్కబెట్టారు. ఇక, ఈ రోజు ఉదయం మోదీ ’ఎక్స్’ వేదికగా ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. వీడియోతో పాటు నరేంద్ర మోదీ.. ’కాశీతో నా అనుబంధం అద్భుతమైంది. సమగ్రమైంది, సాటిలేనిది. ఈ భావాన్ని మాటల్లో వ్యక్తీకరించలేను’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నామినేషన్ వేసిన తర్వాత రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ కార్యకర్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.





