వరంగల్ శ్రీలేఖ సాహితి ప్రచురణగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ టి శ్రీరంగస్వామి స్ఫూర్తిమూర్తుల జీవనరేఖలను మనకాంతి పుంజాలు పేరుతో పుస్తకంగా వెలువరించారు. చరిత్రలో స్థానాన్ని పొందిన కొందరు కీర్తిశేషులైన స్ఫూర్తిదాతలు, రచయితలు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల పరిచయ మాలికగా ఈ పుస్తకం రూపొందింది. కేవలం వరంగల్, హన్మకొండ ప్రాంతాలకు చెందినవారే కాకుండా పక్క జిల్లాల వారిని గురించి కూడా ఇందులో రాశారు. ఉమ్మడి వరంగల్ దారి దీపాలు తొలి వ్యాసం కాగా అందులో విస్తృతంగా ఆ ప్రాంతపు వ్యక్తులను గురించిన విశేషాలు కన్పిస్తాయి.
కైరం భూమాగౌడ్, పరాంకుశం సమ్మాళ్వారయ్య, ఆకారపు నరసింగం గుప్త, ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు, గంగుల శాయిరెడ్డి, అంబటి లక్ష్మీనరసింహరాజు, గార్లపాటి రాఘవారెడ్డి, చాట్రాతి లక్ష్మీనరసమ్మ, గొట్టుముక్కల రాధాకృష్ణారావు, చందా కాంతయ్యశ్రేష్ఠ, కేశపోగు గుల్బానమ్మ, కందాళై గోపాలాచార్యులు, వానమామలై జగన్నాథాచార్యులు, ఉదయరాజు శేషగిరిరావు, హరి రాధాకృష్ణమూర్తి, కాళోజి రామేశ్వరరావు, ముదిగొండ శంకరశాస్త్రి, టి.యస్. మూర్తి, వృక్షాల జగన్నాథం, టి. (తిరువరంగం) హయగ్రీవాచార్యులు, బత్తిని మొగిలయ్య, జమ్మలమడక పిచ్చయ్య, తిరుకోవలూరు రామానుజస్వామి, మద్దికాయల ఓంకార్, తిరునగరి వెంకటేశ్వర్లు, చిలుకమణ్ఱి రామానుజాచార్యులు, యం.యస్. ఆచార్య, దివ్వెల హనుమంతరావు, దెందుకూరి సోమేశ్వరావు, భండారు సదాశివరావు, తిరుకోవలూరు మనోహరస్వామి, నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు, భండారు చంద్రమౌళీశ్వరరావు, పి. (పరికిపాటి) ఉమారెడ్డి, జమ్మలమడక కృష్ణమూర్తి, నెమురుగొమ్ముల యతిరాజారావు, బి.ఆర్. భగవాన్‌దాస్, మహమ్మద్ నవాజ్ అలి, కోవెల సంపత్‌కుమారాచార్యులు, ముక్తవరపు శ్రీరాములు, తిరునగరి కృష్ణయ్య, డాక్టర్ రామక లక్ష్మణమూర్తి, రంగు చక్రపాణి, పరాంకుశం దామోదరస్వామి, మంథెన ఆండాళమ్మ, యం.వి. తిరుపతయ్య, వేముల పెరుమాళ్ళు, అష్టకాల నరసింహరామశర్మ, పొగాకు సుదర్శన్, యస్.యస్. చారి (సిద్ధోజు నరసింహాచారి), కె. రామమోహనరాజు, తక్కళ్ళ బాలరాజు, యం. రత్నాకరరావు, నమలికొండ బాలకిషన్‌రావు, కందాళ శోభారాణి వంటి స్ఫూర్తిమూర్తుల జీవిత రేఖలను సోదహరణంగా వివరించారు. గంటా జలంధరరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన తెలంగాణ దారి దీపాలు అన్న గ్రంథ ప్రత్యేకతను విశ్లేషిస్తే తెలంగాణ చలివెలుగు అన్న వ్యాసం కూడా పలువురు స్ఫూర్తిమూర్తులను గుర్తు చేసింది.
ఎంతో శ్రమకోర్చి డాక్టర్ రంగస్వామి అందించిన ఈ గ్రంథం ఎంతో ఉపయుక్తమైంది. మూల కారకులు, మార్గదర్శకులైన వ్యక్తుల జీవితాలలోని లోతుల్ని స్పృశించి వారి స్ఫూర్తిని వెలికితీసి అందించేందుకు జరిగిన ఈ ప్రయత్నం సఫలీకృతమేనని చెప్పాలి. వరంగల్ సాహిత్య చరిత్రకు, తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆధారంగా నిలిచే అంశాలెన్నో స్ఫూర్తిమూర్తుల జీవన ప్రయాణంలో వ్యక్తమయ్యాయి. పలువురు స్ఫూర్తిమూర్తుల జీవితాలను రాసే క్రమంలో వర్తమాన సమాజానికి మన మూలాలను, చరిత్రలో మనకు లభించిన స్థానాన్ని అంచనా కట్టే వెసులుబాటును రచయిత కల్పించారు. మనిషి మూలాలకు వారసులైన వారిని, చరిత్రలో తమకంటూ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న రచయితలు, కళాకారులు, స్ఫూర్తిదాతలు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత క్రమాన్ని వారు కష్టాలను ఎదురీది విజేతలుగా నిలిచిన తీరును సులభమైన భాషలో వ్యక్తీకరించారు. నిలిచి గెలిచి వెలిగి జ్ఞాపకంగా మిగిలిపోయిన స్ఫూర్తిమంతులను, మహనీయులను తిరిగి తలచుకునేందుకు ఈ గ్రంథాన్ని అందరూ చదవాలి.
– డా.తిరునగరి శ్రీనివాస్
8466053933





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల