గెస్ట్ ఎడిట్:
మండువ రవీందర్ రావు
దేశంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ బిజెపియేతర పక్షాలను కూడగట్టే బృహత్ కార్యక్రమంలో మునిగి ఉంటే, ఆ పార్టీ ఆశాజ్యోతిగా భావిస్తున్న రాహుల్ గాంధీ మాత్రం వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఇటీవలనే పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ నాలుగు నెలల తర్వాత తాజా పార్లమెంటు సమావేశాల్లో పున:ప్రవేశించారు. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న ఘోర హింసాకాండపైన కేంద్రం స్పందించాల్సినంతగా స్పందించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు ప్రధాని మోదీని బాధ్యుడిని చేస్తూ విపక్షాలు ఆయనపై అవిశ్వాసాన్ని ప్రకటించాయి. దీనిపైన తాజాగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు తిరిగి పార్లమెంటు సభ్యత్వాన్ని పొందిన రాహుల్ గత రెండు రోజులుగా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. మణిపూర్ సంఘటనను తీసుకుని రెండు రోజులుగా సభ దద్దరిల్లి పోతున్నది. బుధవారం రాహుల్ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. మణిపూర్‌లో దేశం సిగ్గుపడే విధంగా ఘటనలు జరుగుతున్నా ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మణిపూర్ భారతదేశంలో భాగం కాదన్నట్లుగా ప్రధాని మోదీ చర్యలున్నాయంటూ ఘాటైన విమర్శ చేశారు.
దీనిపై కేంద్ర మంత్రి స్మృతిఇరాని కౌంటర్ సమాధానమిస్తున్న క్రమంలో రాహుల్ చర్య నిండుసభలో మహిళ సభ్యులను కించపర్చేదిగా ఉం దన్నది ఇప్పుడు ఆయనపైన వచ్చిన తాజా ఆరోపణ. స్మృతి ఇరానీ మాట్లాడుతున్న క్రమంలోనే సభనుండి రాహుల్ నిష్క్రమించాడు. అయితే ఆయన వెళ్తూ వెళ్తూ బిజెపి మహిళా ఎంపిలవైపు చూస్తూ ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారన్న విషయం ఇప్పుడు వివాదగ్రస్తమైంది. ముఖ్యంగా తాను ప్రసంగిస్తున్న సమయంలో తనవైపుచూస్తూనే ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడన్న ఇరానీ ఆరోపిస్తున్నారు. మోదీ ఇంటిపేరు వివాదానికి సంబందించిన కేసునుండి ఊరట లభించి నాలుగు రోజులైనా కాలేదు. తాజాగా ఆయన ఈ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. అయితే మణిపూర్ సంఘటనపై సభలో రాహుల్‌గాంధీ మాట్లాడిన దానిపై అధికార పార్టీ డిఫెన్స్‌లో పడిరదని, చెప్పుకోవడానికి వారికి సమాధానం లభించక ఎదురుదాడి చేస్తోందని కాంగ్రెస్ వాదిస్తున్నది. పైగా ఆయన మణిపూర్ ఘటనపై చాలా చక్కగా మాట్లాడాడని కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను విష్ చేసిన క్రమంలో ఆయన వారికి ప్రతివందన చేశారేగాని, ఫ్లయింగ్ కిస్ కాదన్నది కాంగ్రెస్ వాదన. కాగా బిజెపికి చెందిన 21 మంది మహిళా ఎంపీలు, మంత్రులు ఈ విషయంపైన పార్లమెంట్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంతవరకు భారత పార్లమెంటు చరిత్రలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరుగలేదని, మహిళల పట్ల రాహుల్ గాంధీకి ఎలాంటి గౌరవం ఉందన్నది ఈ చర్య చెప్పకనే చెబుతున్నదని, ఒక స్త్రీ వ్యతిరేకి మాత్రమే ఇలా చేయగలడంటూ, ఈ విషయంపైన వెంటనే చర్య తీసుకోవాలని బిజెపి మంత్రులు, ఎంపీలు స్పీకర్‌ను కోరారు. అయితే సభ సమావేశాల వీడియో రికార్టును పరిశీలించిన తర్వాతే దీనిపై స్పీకర్ చర్యతీసుకునే అవకాశముంది.
ఇదిలాఉంటే రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో తరుచుగా వివాదగ్రస్తంగా మారుతున్నాడు. గతంలో నిండు సభలో ప్రధాని నరేంద్రమోదీని రాహుల్ గాంధీ కౌగలించుకోవడంపైన అనేక విమర్శలు చోటు చేసుకున్నాయి . 2018లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపైన జరుగుతున్న చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సభలో రాహుల్‌గాంధీ చాలా ఘాటైన ప్రసంగం చేశారు. ప్రధాని మోదీ పైన, ఎన్డీఏ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన నేరుగా ప్రధాని నరేంద్రమోదీ కూర్చున్న చోటికి వెళ్ళి అమాంతం మోదీని వాటేసుకున్నారు. ఈ హఠాత్తు సంఘటనకు మోదీ కొద్ది నిమిషాలు తెల్లబోయారు. సభలోని వారంతా ఒక్కసారే అవాక్కయ్యారు. మరుక్షణంలో అక్కడినుండి వెళ్తున్న రాహుల్‌ను పిలిచి మోదీ కరచాలనం చేశారు. అయినా దీనిపై కొద్దిరోజులపాటు చర్చజరిగింది. తన స్థానంలో కూర్చున్న రాహుల్ కాంగ్రెస్ సభ్యులవైపు చూస్తూ కన్నుగీటిన విషయంలోకూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాను మోదీని ఖిన్నుడిని చేసానన్న భావన కలిగేవిధంగా ఆ కన్నుగీటిన విధానం ఉన్నట్లుగా భావించారు.
రాహుల్ లండన్ పర్యటన సందర్భంలోకూడా వివాదగ్రస్త వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణ ఉంది. ఆయన అక్కడ పాల్గొన్న ఒక సమావేశంలో వీర సావర్కర్‌పై అనుచితంగా మాట్లాడంపై సావర్కర్ మనువడు సత్యకి సావర్కర్ పూణే కోర్టులో పరువు నష్టం కేసును నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నేపాల్ పర్యటన సందర్భంగా రాజధాని ఖాట్మాండులో నైట్ క్లబ్‌కు వెళ్ళాడంటూ ఒక విడియోను బిజెపి వైరల్ చేయడం కూడా కొంతకాలం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఫ్లయింగ్ కిస్ పెద్ద వివాదస్పదంగా మారింది. కేవలం రాహుల్‌ను విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబ సంప్రదాయం ఇదేనా అని బిజెపి నేతలు ప్రశ్నించారు. గాంధీ కుటుంబం మహిళలకు ఇచ్చే గౌరవాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ˜




