దేశ చరిత్రలో వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉన్నది. సాహిత్య ఆధ్యాత్మికతకు ఇక్కడ ఎంత పేరుందో, పౌరుషానికి ఇది పెట్టింది పేరు. చరిత్రలో అనేక ఉద్యమాలకు వరంగల్ ముందు వరుసలో నిలుస్తూ వొచ్చింది. అలాంటి నగరానికి ఇప్పటివరకు నలుగురు ప్రధానులు రావడం విశేషం. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రెండు పర్యాయాలు ఈ చారిత్రక నగరానికి వొచ్చినట్లు తెలుస్తున్నది. 1959 అక్టోబర్‌లో ఆయన రాక సందర్భంగా హనుమకొండలోని నేటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే అంతకు ముందు 1952లో కూడా ఒకసారి వొచ్చి వెళ్ళినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఇందిరాగాంధి 1968 జూన్ 29లో వరంగల్‌లో పర్యటించారు.
అప్పుడు ఆమెకు వసతి సౌకర్యం కల్పించే పెద్ద భవనాలు లేకపోవడంతో వరంగల్‌లో ఆనాడు పెద్ద పరిశ్రమగా వెలుగొందిన ఆజంజాహి మిల్లు గెస్ట్ హౌజ్‌లో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పివి నర్సింహారావు ప్రధాని హోదాలో హనుమకొండలోని హంటర్‌రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పై ముగ్గురు కూడా కాంగ్రెస్ ప్రధాన మంత్రులు కాగా, శనివారం నగరాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీకి చెందిన వాడు కావడం విశేషం. తాను తమ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తగానే వొచ్చినట్లు చెప్పుకున్న నిగర్విగా ఆయన కొనియాడ బడ్డారు.




