వయోధిక పాత్రికేయుడు కూచి గోపాలకృష్ణకు నివాళి

సహృదయుడు, స్నేహశీలి, చతుర సంభాషణ ప్రియుడు, పాత్రికేయుల్లో పాతతరంవాడు, చిరునవ్వుల వదనం.. అయనే కూచి గోపాలకృష్ణ. ఎనభై అయిదేళ్లు ఆడుతూ పాడుతూ కలంకార్మికునిగా జీవితం గడిపి సరిగ్గా గత ఏడాది ఆగస్ట్ 27‌వ తేదీ స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌ ‌లో కన్నుమూసిన మిత్రునికి నివాళి. హైదరాబాద్‌ ‌మిత్రులకంటె విజయవాడ కేంద్రంలో సుమారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా వివిధ అంశాలపై కలం ఝళిపించి పాఠకులు, పాత్రికేయుల మెప్పు పొందారాయన. పాత తూర్పుగోదావరి జిల్లా ముంగడ గ్రామంలో 1936 ఏప్రిల్‌ 5 ‌వ తేదీ జన్మించిన గోపాలకృష్ణ అమలాపురం కాలేజీలో బి కాం వరకు అభ్యసించి తదనంతరం పాత్రికేయునిగా రంగప్రవేశం చేసారు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య అంశాలే కాదు, సినిమా రంగ వార్తలను కూడా రుచిగా వండి వార్చి వడ్డించిన వాడు.

ఆంధ్రపత్రిక, సినీ హెరాల్డ్, ఇం‌డియన్‌ ‌హెరాల్డ్, ఉదయం, ఆంధ్రప్రభ తెలుగు వార్తాపత్రికలే కాదు జాతీయ ఆంగ్ల పత్రిక నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కు విజయవాడ కేంద్ర ప్రతినిధిగా దీర్ఘకాలం వార్తలందించారు. పలువురు రాష్ట్రపతుల వద్ద పత్రికా వ్యవహారాల కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన కూచి సూర్యనారాయణ వీరి ఆరుగురు సోదరులలో ఒకరు. విజయవాడ ప్రెస్‌ ‌క్లబ్‌ ‌కార్యక్రమాలలో చురుకైన పాత్రి నిర్వహించడంతో పాటు, ఇండియన్‌ ‌ఫెడెరషన్‌ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టస్ ‌కార్యవర్గంలో కీలక పాత్ర నిర్వహించారు. జర్నలిస్ట్ ‌యూనియన్‌ ‌ప్రతినిధిగా పాత్రికేయునిగా చురుకుగా వ్యవహరించి అనేక పురస్కారాలు కూడా అందుకున్నారు. గోపాలకృష్ణ సినీ విలేఖరిగా మాత్రమే కాక పలు చిత్రాలలో నటనానుభవం కూడా గడించారు. సిరిసిరిమువ్వ, సావాసగాళ్ళు, సొమ్మొకడిది సోకొకరిది.. తదితర చిత్రాలలో నటునిగా గుర్తింపు పొందిన పాత్రికేయుడాయన. విలేఖరుల సమావేశాలలో, విలేఖరుల పర్యటనలలో ఎక్కువగా ఆయన రంగుల సఫారీ దుస్తులలో మెలితిరిగిన మీసాలతో నవ్వులు విరజిమ్మి కనిపించేవారు.

విజయవాడ సిద్దార్ఠ కళాశాల సమీపంలోని జర్నలిస్ట్ ‌కాలనీలో చాలాకాలం ఉండి వయోధికులై విశ్రాంతి తీసుకుంటూ అర్ధ దశాబ్దం కిందట హైదరాబాద్‌ ‌చేరారు. హైదరాబాద్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌కార్యక్రమాలకూ తరచు హాజరయ్యేవారు. గోపాలకృష్ణ (86) స్వల్ప అనారోగ్యంతో గత ఏడాది ఆగస్ట్ 27‌న కనుమూసారు. ఈయనకు భార్య లక్ష్మి, కుమారుడు సాయి కుమార్‌, ‌కుమార్తెలు సురేఖ, సత్యశ్రీ, శోభ ఉన్నారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో శనివారం ఆగస్ట్ 27, ఉదయం 11 గంటలకు ఆయన సహచర పాత్రికేయులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, ఆయనను గుర్తు చేసుకుని నివాళులర్పించేందుకు సమావేశమవుతున్నారు.
– నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *