వడపోత

కళ్ల నుండి జారిపడుతున్న..
కన్నీరునంతా వడపోస్తున్నాను.
ఒక్కో కన్నీటి చుక్కను
దోసిట్లోపట్టి హృదయపు పలకమీద పోసి..
కన్నీటికి కారణం ఎవరోనని అడుగుతున్నాను.
అశ్రుధారలన్ని కాలువలై పారుతున్నాయి.
కళ్ళముందు సముద్రాలై నిండుతున్నాయి.

మనసనే చెట్టుకు పూస్తున్న..
కోరికల పూలను నేలరాలుస్తున్నదేవరోనని
వీస్తున్న గాలిని అడుగుతున్నాను.
ఆశలన్నింటిని అందని ద్రాక్షలా మార్చి..
దహించివేస్తున్నదేవరోనని మండుతున్న..
అగ్నికణాను అడుగుతున్నాను.
ఒక్కో గడ్డిపరక పోగేసి అల్లిన పిట్టగూడును..
కూలుస్తున్నదేవరోనని తుఫానును అడుగుతున్నాను.
తడారిపోయిన గుండెకు కారణమెవరని..
కురుస్తున్న చినుకును అడుగుతున్నాను.

ఇపుడు ప్రతిమనిషిని జల్లెడపడుతున్నాను.
మల్లెమొగ్గలాంటి తెల్లని మనసున్న
మనుషులకోసం దేవులాడుతున్నాను.
కోకిలలాంటి కమ్మని గొంతును వినిపించే
కొన్ని మాటల కోసం..అన్వేశిస్తున్నాను.
మానవత్వం ఉన్న మనుషులకోసం …
ఈ సమాజాన్నంత వడపోస్తున్నాను.

తూనిగల్లా స్వేచ్ఛగా గాల్లోఎగిరే
ఆనందపు క్షణాలకోసం వేచిచూస్తున్నాను.
గమ్యాన్ని చేర్చే పట్టుదల తనువులో..
ఏమూలన దాగుందోనని రుధిరాన్నంత
వడపోస్తున్నాను.
కాలం ప్రశ్నగా మారి  వెంటపడుతుంటే..
నాలో దాగిన జవాబుల కొసం..
నన్ను నేనే వడబోసుకుంటున్నాను.
– అశోక్‌ ‌గోనె, 9451317361.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *