అత్యధిక స్థానాల గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పావులు
వేగవంతంగా దర్యాప్తులు, విచారణలు
మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్, జనవరి 29 : రాష్ట్రంలోని అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఇప్పటికే సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవడంతోపాటు, ప్రచారానికి తగిన హంగులను తయారు చేసుకుంటుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బిజెపి, బిఆర్‌ఎస్‌ను ఎదుర్కునాల్సి ఉండడంతో ఆయా పార్టీల లోపాలను ప్రజల ముందు బహిర్ఘతం చేసే కార్యాచరణను ఆ పార్టీ సిద్ధం చేసుకుంటున్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయి, ప్రతిపక్ష స్థానంలో నిలిచిన బిఆర్‌ఎస్‌ను ప్రజాక్షేత్రంలో నిలదీయడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. గత ఎన్నికల్లో నాడు ప్రభుత్వంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అక్రమాలను ఎత్తి చూపడం ద్వారా ప్రజలను మన్ననలను పొందిన కాంగ్రెస్ ఇప్పుడు వాటికే మరింత పదునుపెట్టే పనిలో పడిరది. తాము అధికారంలోకి రాగానే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుపడంతోపాటు, అందుకు కారకులను శిక్షిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీపై ఇప్పుడు ఆ పార్టీ కసరత్తు మొదలు పెట్టింది.
అయితే నాటి ప్రభుత్వ అక్రమాలను లెక్కలు, రుజువులతో సహా బహిర్ఘతం చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోమన్న విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్ తాజాగా దిల్లీ కేంద్రంగా ప్రకటించారు. రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసం, అవినీతిని బట్టబయలు చేస్తామని, అందుకు కారకులైన నాయకులతోపాటు, అధికారులెవరినీ వొదిలిపెట్టే ప్రసక్తేలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తాజాగా ఒక ప్రభుత్వ అధికారి వద్ద వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడడాన్ని ప్రస్తావిస్తూ, అధికారుల వద్దే వందలాది కోట్ల రూపాయలుంటే, నాయకులు ఇంకా ఎన్ని వందల కోట్లను కొల్లగొట్టి ఉంటారన్నది తేలాల్సి ఉందంటారాయన. అందుకే ముందుగా కెసిఆర్ ఫామ్ హౌజ్‌పై దాడి చేస్తేగాని అక్కడ ఎన్ని వందల కోట్లు బయటికి వొస్తాయో చూడాల్సిఉందన్నారు. అక్కడ గోడల్లో కేవలం డబ్బేకాదు.. వజ్ర వైడూర్యాలెన్ని బయటపడినా ఆశ్చర్యపడేదిలేదంటారాయన. అయితే ఆ ఫామ్ హౌజ్‌పైన ఎలా దాడిచేయాలన్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నదంటూ ఆయన దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన మల్లు రవిని అభినందిస్తున్న సందర్భంగా ఆదివారంనాడు అన్నమాటలివి.
వాస్తవంగా గడచిన శాసనసభ ఎన్నికలకు ముందు నుండే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఆరోపణలే చేస్తూ వొచ్చారు. వారి ఆరోపణలో నిజమెంతోగాని అది ప్రజల్లోకి విస్తృతంగా చేరిందనడానికి ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టడమే నిదర్శనం. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అదే ధోరణితో మాట్లాడిన విషయం గమనార్హం. ‘కెసిఆర్.. ఆటమొదలైంది..కాస్కో.. కొన ఊపిరితో ఉన్నావు..ఆ యుద్దంలో(లోకసభ ఎన్నికల్లో) నీ పార్టీని బొందపెట్టే బాధ్యతను మావాళ్ళంతా తీసుకున్నారంటూ..ఇప్పటివరకు తాము చేసిన పోరాటం ఇంటర్వేల్ వరకే అయిందని, అసలు సీనిమా ముందుందని ఆయన హెచ్చరించిన తీరు.. మధుయాష్కి పేర్కొన్నట్లు లోకసభ ఎన్నికల్లోగానే బిఆర్‌ఎస్ ప్రభుత్వంపైన ఉన్న ఆరోపణలన్నీ నిగ్గుతేల్చే పనిలో కాంగ్రెస్ ఉన్నట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌లైన్‌గా ఉన్న నీళ్ళు, నిధులు, నియామకాలపైనే జరిగిన అవినీతి, అక్రమాలపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టిపెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్‌గా ఇంతకాలం బిఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పుకున్న కాళేశ్వరం కుంగిపోవడం వెనుక ఎన్ని వేలకోట్ల అవినీతి, ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని కూలంకశంగా లోకసభ ఎన్నికలలోగానే దర్యాప్తు జరిపి, తాము మొదటి నుండి ఆరోపిస్తున్నట్లు ఈ ప్రాజెక్టు బిఆర్‌ఎస్‌కు ఎటిఎం అయిందన్న విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే 24 గంటల కరెంటు ఇస్తున్నామని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ 81 వేల కోట్ల రూపాయలకు పైగా ఆ రంగంలో అప్పు చేసిన విషయాన్ని, భూముల విషయంలో భూ యజమాని హక్కును ఎవరూ కాదనలేని విధంగా వీలులేని సాంకేతికతో తయారు చేశామని నాటి ప్రభుత్వం చెప్పుకున్న ధరణి పోర్టల్ వల్ల జరిగిన నష్టాన్ని, దానివల్ల నేటికీ రైతులు ఎదుర్కుంటున్న సమస్యలేమిటన్న విషయాలన్నిటినీ ప్రజల ముందుకు రుజువులతో సహా తీసుకువెళ్ళడం ద్వారా బిఆర్‌ఎస్ పార్టీని లోకసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిరచి రాష్ట్ర పొలిమేరలవరకు సాగనంపాలన్న రేవంత్‌రెడ్డి మాటలను నిజం చేయాలన్న పట్టుదలతో ఆ పార్టీ ఉంది. అందులో భాగంగా యువతకు ఉపాధిని దూరం చేసిన టిఎస్‌పిఎస్సీ, కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసిన ‘ఈరేస్’తో సహా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాదాపు అన్ని పథకాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తులు, విచారణలను వేగవంతం చేస్తున్నది.



