లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ అరుణామిల్లర్‌కు కెటిఆర్‌ అభినందనలు భారత్‌కు గర్వకారణమని ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరుణా మిల్లర్‌ ‌మేరీల్యాండ్‌ ‌లెప్టినెంట్‌ ‌గవర్నర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుణా మిల్లర్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌కంగ్రాట్స్ ‌చెబుతూ ట్వీట్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో గొప్ప స్థాయికి ఎదగడాన్ని కేటీఆర్‌ ‌ప్రశంసించారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో లెప్టినెంట్‌ ‌గవర్నర్‌గా ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్‌ ‌పార్టీ తరఫున మేరీల్యాండ్‌ ‌గవర్నర్‌, ‌లెప్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌ ‌పదవులకు పోటీచేసిన వెస్‌ ‌మూర్‌, అరుణా మిల్లర్‌.. ‌రిపబ్లికన్‌ ‌పార్టీ అభ్యర్థులపై సునాయాసంగా విజయం సాధించారు.

అక్కడ గవర్నర్‌ ‌తర్వాత అత్యున్నత హోదా లెప్టినెంట్‌ ‌గవర్నర్‌దే. ఒకవేళ గవర్నర్‌ ‌సరైన రీతిలో విధులు నిర్వర్తించలేకపోతే ఆ బాధ్యతలను లెప్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌కు అప్పగిస్తారు. ప్రస్తుతం 58వ పడిలో ఉన్న అరుణా మిల్లర్‌ ‌హైదరాబాద్‌లో జన్మించారు. అరుణకు ఏడేండ్ల వయసున్నప్పుడు (1972లో) ఆమె కుటుంబం అమెరికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. మేరీల్యాండ్‌లో అరుణకు విస్తృత ప్రజాదరణ ఉన్నది. ఆమెకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ‌మేరీల్యాండ్‌లో విస్తృత ప్రచారం చేయడంతోపాటు పలువురు రిపబ్లికన్‌ ‌పార్టీ మద్దతుదారులు సైతం అరుణకు అనుకూలంగా పనిచేయడంతో సునాయాసంగా విజయం సాధించినట్టు తెలుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *