జీవితమే పెద్ద ప్రశ్న,
ఒక పెద్ద గ్రంధం.
దండలో దారం మాదిరి
తనువులో ప్రాణం పగిది,
మనిషి దైనందిన జీవితంతో పెనవేసుకొన్న
శాస్త్రాలకే శాస్త్రమైన గణితాన
బాలమేధావిగా గణుతికెక్కి,
తన మస్తిష్క గోడలన్నీ
గణిత భావజాలపు రూపాలను
పూయిస్తోంటే,
గణితపూలను కోసి
జగతి సిగలో పెట్టాలనే తపనల దారులలో
ఊహల్ని తలుపులేసుకొని పడుకోనీక,
దారిద్య్రపు నిర్బంధాన్ని ప్రతిఘటించి
తనలో తాను ఆవిష్కరించుకొన్న,
గణితప్రపంచాన చైతన్యదీప్తిని రగిలించే
సిద్దాంతాలను ప్రతిపాదించి,
కాన్సర్ పీడితుల చీకటి నిశీధులన్నీ
వెలుగురేఖలకై నిరీక్షిస్తోన్న సమయంలో
కాన్సర్ కణజాలాన్ని తన సిద్దాంతాలతో
కదిలించిన వైతాళికుడై,
మనసుపడ్డ గణితమే అక్కున చేర్చుకుని
కీర్తి కిరీటాల ఒడిలో ఓలలాడించగా
భారత ఖ్యాతిని
ఖండాంతరాలకు వ్యాపింపచేసి,
పిన్నవయసునందె అంబరానికేగి,
గణితాకాశంలో ధృవతారవోలె
ప్రకాశిస్తోన్న యశఃకాయుడు
‘‘శ్రీనివాస రామానుజన్’’.
ప్రాతఃస్మరణీయుడీతడు,
లెక్కల్లో మనీషీ ఈతడే.
గణితాన్ని ప్రేమించి,
పుట్టుక మాత్రమే తనదై
బతుకును గణితానికే అంకితం చేసిన
మహాత్మా నీకివే వినమ్రప్రణామాలు.
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం




