లక్నో, జూలై 26 : కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోరుతూ ఆశిష్ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 15నే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం వెల్లడించింది. కాగా 2021 అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నిరసనలు చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఈ దుర్ఘటనలో నలుగురు అన్నదాతలు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో గేతేడాది అక్టోబర్ 9నే అరెస్టయిన ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రైతులు సుప్రీమ్ కోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం ఆశిష్ బెయిల్‌ను రద్దు చేసింది. మంత్రి కుమారుడు అయినందుకు కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా అదే కారణంతో ఆశిష్‌కు బెయిల్ నిరాకరించింది.




