షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ముఖ్యమంత్రి మాటలు మోసమే.
షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 28: లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్” బీఆర్ఎస్ పార్టీకీ ఎన్నికల అవకాశం మారిందని ప్రజలు టిఆర్ఎస్ పార్టీ మాటలు విశ్వసించే పరిస్థితిలో లేరని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ విమర్శించారు. షాద్ నగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రజలను మభ్యపెట్టి కల్లబొల్లి కబుర్లతో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణపై ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గత రెండు పర్యాయాలు లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ చూపెట్టి స్థానిక ప్రజలను వంచనకు గురి చేశారని మరోసారి ప్రజా ఆశీర్వాద సభలో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు మాట్లాడుతుంటే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని అన్నారు. ఇలాంటి కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులను ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని సూచించారు. ఇప్పటికే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కు చెంచాడు మట్టి తీయని ప్రభుత్వం మళ్లీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు పీజీ, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు ఇదో ఎత్తుగడ అని అభివర్ణించారు. మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి తైలం అన్నట్టు కేసీఆర్ వ్యవహారం ఉందని దెప్పి పొడిచారు. గడిచిన పదేళ్లలో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పుడు మెట్రో రైలు, పిజి మెడికల్ కళాశాలల ఏర్పాటు చేస్తామని కల్లబొల్లి హామీలు ప్రజలు గుర్తించరని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ ను నిర్మించి, షాద్ నగర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నా, రిజర్వాయర్ ను నిర్మించకుండా కేసిఆర్, అంజయ్య యాదవ్ షాద్ నగర్ ప్రజలకు మొండి చేయి చూయించారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి అంటేనే ముఖ్యంగా లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ అని గుర్తు చేశారు. జీవో 72 ప్రకారం జూరాల ద్వారా ఆరు జిల్లాలకు ఈ ప్రాజెక్టు వచ్చేదని కానీ ప్రభుత్వం కమిషన్ల అత్యాశకు పోయి రీడిజైన్ల పేరుతో పథకం స్వరూపమే మార్చేసిందని వాస్తవాలు గ్రహించాలని అన్నారు. లక్ష్మీదేవి పల్లి కేవలం ఓట్ల రాజకీయం కోసమే పనికి వస్తుందని అన్నారు. 33% పరివాహక ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీల నీరు కేటాయిస్తే, 66% పరివాహాక ప్రాంతం ఉన్న తెలంగాణకు 292 టీఎంసీల నీరు కేటాయించడం పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని? అన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పాలనకు చరమగీతం పడాలని పిలుపునిచ్చారు.





