ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 : గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించాలని సిఐటియు జిల్లా నాయకులు బుగ్గరాములు,పోచమని కృష్ణ డిమాండ్ చేశారు.సోమవారం గ్రామపంచాయతి కార్మికుల సమ్మె 33వ రోజు సందర్భంగా జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు బుగ్గరాములు, పోచమోని కృష్ణ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు 33 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నిమ్మకు నిరెత్తినట్టుగా వ్యవహరించడం సరైనది కాదని వారు ద్వజమెత్తారు.అసెంబ్లీ సమావేశాల్లో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై అధికార,ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చర్చించిన స్పందించకుండా మొండి తనం మార్చుకోవాలన్నారు.అనేక సంవత్సరాలుగా గ్రామాలలో అతి తక్కువ వేతనంతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులకు వర్తిస్తున్న 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలి.పిఎఫ్, ఈఎస్ఐ,ఉద్యోగ భద్రత, వారంతపు సెలవులతో పాటు జాతీయ,అంతర్జాతీయ సెలవులు ఇవ్వాలన్నారు.తక్షణమే గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెను విరమించే విధంగా జెఎసి నాయకులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.లేని పక్షంలో శాంతియుతంగా చేస్తున్న సమ్మెను ఉదృతం చేస్తామని ప్రగతి భవన్ ముట్టడిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కోశాధికారి దేవదాస్, భాస్కర్,ఖాజాపాషా,రవి,జంగయ్య, శంకరయ్య,సురేష్ కిషన్,చంద్రయ్య,మల్లేష్, బుగ్గయ్య,సుశీల,పోచమ్మ,రాణమ్మ తదితరులు పాల్గొన్నారు.


