- రూ.150 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని కేంద్రం పేచీ
- జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్మాక్టరి…ఆయిల్ పామ్ సాగు పెంపుకు కృషి
- సిద్ధిపేట జిల్లా పరిషత్ సమావేశంలో కేంద్రంపై మంత్రి హరీష్‌రావు ధ్వజం
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై కేంద్రంలతోని బిజెపి పార్టీ ప్రభుత్వం కయ్యం పెడుతుందనీ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈజిఎస్ ద్వారా నిర్మించిన రైతు కల్లాల డబ్బులు 150 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని పేచీ పెడుతున్నదని కేంద్రం తీరుపై ఆర్థిక మంత్రి దుయ్యబట్టారు. కోడిగుడ్డుపై ఈకలు పీకేలా కేంద్రం వ్యవహరిస్తుందని మంత్రి విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి హరీష్‌రావు, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, అన్నీ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…జిల్లాలో వానాకాలంలో వరిసాగు 5 లక్షల 27వేలు, యాసంగి వరిసాగు 2 లక్షల 90 వేల లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
గజ్వేల్ రేక్ పాయింట్ ఉన్న దృష్ట్యా ఎరువుల విషయంలో అధికారులు జాగ్రతలు పాటించాలనీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎరువులు దొరకక లైనులో నిల్చుని 7 మంది రైతులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. డిఏపి ఎరువు ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని, ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికార వర్గానికి మంత్రి ఆదేశించారు. వచ్చే నెల నుంచి బోరు బావుల్లో వరి పంటకు నీరు కొరత ఏర్పడుతున్న దృష్ట్యా ముందస్తు మల్లన్నసాగర్ 15టిఎంసి, రంగనాయకసాగర్‌లో 3 టిఎంసిల నీరు నిల్వ ఉందని మంత్రి వెల్లడించారు. రైతులు ఆయిల్ పామ్ సాగు పెంచేలా కృషి చేయాలని, అవసరమైతే ఖమ్మం జిల్లా సత్తుపల్లి వెల్లి క్షేత్ర సందర్శన, ఫీల్డ్ విజిట్ వెళ్లాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఆయిల్ పామ్ సాగు వల్ల లక్షా 20 వేల కనీస లాభం వస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసిన సత్తుపల్లి రైతులు సొంత భవనాలు నిర్మించుకుని కార్లు కొన్నారని చెప్పుకొచ్చారు. జిల్లాలో రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామనీ, జిల్లాలో 7 వేల ఎకరాలు ఆయిల్ పామ్ సాగు పూర్తయిందన్నారు.
ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ఎకరానికి లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తుందనీ, లక్ష కోట్ల రూపాయల పామాయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఎంపి ప్రభాకర్ రెడ్డి కోరిన మేరకు దుబ్బాక నియోజకవర్గంకు అవసరమైన స్పింక్లర్ సెట్లు అందించాలని డిడి రామలక్ష్మిని మంత్రి ఆదేశించారు. వొచ్చే నెల జనవరి 2న మనఊరు-మనబడిలో భాగంగా పనులు పూర్తయిన 100 పాఠశాలలను ప్రారంభం చేసుకుందామన్నారు. గతేడాది పదవ తరగతిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందనీ, ఈ యేటా కూడా సిద్ధిపేట జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని, ఫలితాల్లో ఏ మాత్రం తగ్గినా ఉపేక్షించేది లేదని అధికారులన• మంత్రి హెచ్చరించారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. సిఎం కేసీఆర్ చదువుకున్న దుబ్బాకలో నూతనంగా నిర్మించిన భవనాన్ని సిఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం చేయనున్నామనీ, పాఠశాలలో కాంపౌండ్ వాల్, డ్రింకింగ్ వాటర్, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
హుస్నాబాద్ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించండి : అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్‌రావు
జిల్లాలోని హుస్నాబాద్‌లో డయాలసిస్ కేంద్రం ప్రారంభం చేసిన తెల్లారే తాళం వేయడంపై అధికారులపై ఆరోగ్య మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 48 గంటలలో సమస్య పరిష్కారం చేసి దవాఖానలో డయాలసిస్ కేంద్రం తిరిగి ప్రారంభం చేయాలని వైద్యాధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.
ప్రభుత్వ దవాఖానలలో డెలివరీల సంఖ్యపై అధికారులను ఆరా తీసిన దరిమిలా సిద్ధిపేట, గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలలో బెడ్స్ దొరకని పరిస్థితి వొచ్చిందని పేదలకు వైద్యం అందడంపై హర్షం వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలు స్కానింగ్‌ల కోసం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వెళ్లకుండా చూడాలని, అలాగే ప్రభుత్వ దవాఖానల్లో టిఫా స్కానింగ్ మిషనరీలు అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు కోరారు.



