వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ,సెప్టెంబర్ 20: జిల్లాలో అనువైన వాతావరణం ఉన్నందున రైతులను ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయిల్ ఫామ్ సాగుపై ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ మరియు హెల్తీ హార్డ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలో భాగంగా రైతులను ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించాలన్నారు. జిల్లాకు నిర్దేశించిన 3 వేల ఎకరాల ఆయిల్ పామ్ సాగును 6 వేల ఎకరాల సాగుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలపై కిందిస్థాయి రైతుల్లో కూడా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. పంట సాగు విషయంలో ప్రభుత్వం సహకారం ఉంటుందని, పండిన పంటను ఆయిల్ కంపెనీలు తప్పనిసరిగా కొనే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయిల్ ఫామ్ పంటల వల్ల మార్కెట్లో డిమాండ్ ఉంటుంది కానీ నష్టం వాటిల్లదనే నమ్మకాన్ని రైతులకు కల్పించాలన్నారు. పంట సాగుకు జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతో ముందుకు వెళ్లాలని, రైతులు నిర్భయంగా పంటల సాగు చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు ఏఈఓ ల సహకారంతో పంటల సాగుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ అధికారి చక్రపాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, హెల్తీ హార్డ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ భరత్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు మల్లికార్జున్, స్వరూప, వినోద్ , శంకర్, రుద్ర మూర్తి, లక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయిల్ పామ్ సాగు విధానంపై రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.




