రైతులూ.. ఆందోళన వద్దు

– యూరియా సరఫరా పెంచేందుకు అన్ని చర్యలు
– ఆర్‌ఎఫ్సీఎల్‌ లో ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం
– సచివాలయంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు విజ్ఞప్తి చేశారు. రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్సీఎల్‌) యాజమాన్యం, వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎఫ్సీఎల్‌లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సీజన్‌లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్‌ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆర్‌ఎఫ్సీఎల్‌ సీఈవో అలోక్‌ సింఘాల్‌ ను ప్రశ్నించారు. మిమ్మల్ని తాము కేవలం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదని, రాష్ట్రాభివృద్ధిలో తమతో కలిసి నడిచే భాగస్వామిగా చూస్తున్నామని స్పష్టం చేశారు. ప్లాంట్‌ పునరుద్ధరణకు రూపొందించిన యాక్షన్‌ ప్లాన్‌ను సమీక్షించి మార్గనిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణను చూడొద్దన్నారు. రామగుండంలో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఆర్‌ఎఫ్సీఎల్‌ మాతృ సంస్థ ఎన్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన ఇతర ప్లాంట్ల నుంచి తెలంగాణకు ప్రతి రోజూ ఒక రేక్‌ యూరియాను సరఫరా చేసేలా చొరవ చూపాలని కోరారు. ఈ విషయంలో మీకేమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడి పరిష్కరించేందుకు రాష్ట్రం చొరవ తీసుకుంటుందని భరోసానిచ్చారు. సమావేశంలో స్పెషల్‌ సీఎస్‌ సంజయ్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, ఆర్‌ఎఫ్సీఎల్‌ రామగుండం యూనిట్‌ హెడ్‌, జీఎం రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *