పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: రైతులు సాగు చేసిన పత్తి పంటలలో వ్యవసాయ అధికారుల సూచనలు సలహాల మేరకు అవసరమైన మందులను వాడుకోవాలని పరిగి వ్యవసాయ సంచాలకురాలు సౌభాగ్యలక్ష్మి కుమారి అన్నారు. బుధవారం పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో రైతులు పత్తి పంటలను ఏఈఓ చెన్నయ్యతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాతవరణ పరిస్థితుల కారణాలతో రైతులు సాగు చేసిన పత్తి పంటలకు రోగాల బెడద వాటిళ్లిందన్నారు. రైతులు అవసరమైన మందులను పిచికారీ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో రైతులు పత్తి పంటలపై మందులను పిచికారి చేసుకుంటే రోగాల బెడద నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. అధిక వర్షాలు కురిసి పంటలను దెబ్బతినడంతో పాటు మరో పక్క వర్షాలు కురువకపోవడంతో పత్తి పంటలు ఎర్రలు బారుతూ జింకు లోపం కారణంతో పాడైపోతున్నాయన్నారు. దీని నుండి ఉపశమనం పొందేందుకు లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నిషియం సల్ఫేట్, రెండు గ్రాముల జింకు సల్పెట్తో పాటు మొక్కల్లో తేమ శాతం కొల్పోకుండా 20 గ్రాముల యూరియా, లేదా డీఏపీ వేసుకొని మొక్కలపై పిచికారీ చేసుకోవాలన్నారు. దీంతో మొక్కలు రంగు మారీ ఎదుగుదలకు దోహదపడుతాయని తెలిపారు. ప్రతి రైతు తాను సాగు చేసిన పంటలను రోగాల బారి నుండి కాపాడుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి అవసరమైన మందులను పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.



