న్యూ దిల్లీ, జూలై 26 : భారతీయ రైతులందరీ శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) యోజన 14వ ఇన్‌స్టాల్‌మెంట్ నిధులు జులై 27న విడుదల కానున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు చేరనున్నాయి. 2023 జులై 27న ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని శిఖర్‌లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. ఇదే సందర్భంగా రైతులతో ముఖాముఖి కూడా జరుపుతారు. ఈ విషయాన్ని పీఎం-కిసాన్ స్కీమ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పీఎం-కిసాన్ యోజనను ప్రారంభించింది. ముఖ్యంగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలతో సహా రైతుల వ్యక్తిగత అవసరాలను తీర్చడమే ఈ పథకం ఉద్దేశం.
ఈ పథకం కింద భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6000 అందిస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మొత్తం మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతులకు అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ 13వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎం-కిసాన్ యోజన యాప్‌లో ఫేస్ అథంటికేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు చాలా సులువుగా తమ ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి వీలువుతుంది. ఇంతకు ముందు ఈ-కేవైసీ కోసం ఒన్ టైమ్ పాస్ వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ ఉపయోగించాల్సి వొచ్చేది.వాస్తవానికి పీఎం-కిసాన్ పథకం కోసం దరఖాస్తు చేసే రైతులందరూ ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి.


