- పంట నష్టం, పరిహారం చెల్లింపు పై రైతు స్వరాజ్య వేదిక ‘‘ఫాక్ట్ షీట్..
- రాష్ట్రం, కేంద్రం పాత్రల పై నిజానిజాల వెల్లడి
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టాలు, పరిహారం చెల్లింపు కిషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు వాధోపవాదాలు చేసుకుంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. •ణ=ఖీ, చీణ=ఖీ నిధుల గురించీ, చెల్లించాల్సిన పరిహారం గురించి వాస్తవాలు భిన్నంగా ఉండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఫలితంగా నష్ట పోయిన రైతులకు మాత్రం గత రెండేళ్లుగా ఎటువంటి పరిహారం మాత్రం అందలేదు.గత 15 రోజులుగా భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితులైన ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రంలో ఎవరి భూములు ,పంటలు నష్ట పోయాయో వారికి తక్షణమే పరిహారం అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్రంలో రైతు కుటుంబాల సంక్షోభానికి, ఆత్మహత్యలకు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతున్న పంట నష్టాలు ప్రధాన కారణంగా ఉన్నాయని గత 10 సంవత్సరాల రైతు స్వరాజ్య వేదిక క్షేత్ర స్థాయి అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ జిల్లాలలో భారీ వర్షాల వల్ల, పంటలకు, సాగు భూములకు జరిగిన భారీ నష్టాన్ని గురించి రైతు స్వరాజ్య వేదిక టి.శ్రీహర్ష , బి.కొండల్ వివరించారు.
ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది లాంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదలు, చెరువుల కట్టలు తెగడం,రిజర్వాయర్ల బాక్ వాటర్ ఇందుకు కారణమయ్యాయి.రాష్ట్ర అధికారులు వెల్లడించిన ప్రాధమిక వివరాల ప్రకారం రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లింది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక లక్షా మూడు వేల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. మంచిర్యాలలో 34,000 ఎకరాలు, ఆసిఫాబాద్ లో 45,000 ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 32,600 ఎకరాలు, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో 25,200 ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాధమిక అంచనా .
రాష్ట్రంలో జరుగుతున్న పంట నష్టాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ గత 4 సంవత్సరాలలో రైతు స్వరాజ్య వేదిక కార్యకర్తలు రాష్ట్ర హై కోర్టులో రెండు కేసులు దాఖలు చేశారు. రైతులకు అనుకూలంగా తీర్పులు పొందారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పోయిన రైతులను ఆధుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఈ క్రమంలో ఏ చర్యలూ చేపట్ట కుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రైతు స్వరాజ్య వేదిక అనేక సాక్ష్యాధారాలను సేకరించింది.జులై 2015 లో విడుదలైన ఎన్‌డిఆర్‌ఎఫ్ ,ఎస్‌డిఆర్‌ఎఫ్ మార్గదర్శకాలను ఉటంకిస్తూ రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్ కుమార్ వాస్తవాలను మీడియా ముందు ఉంచారు. నష్టాలు జరిగినప్పుడు ముందుగా రాష్ట్ర ఎస్‌డిఆర్‌ఎఫ్ నుండి పరిహారం చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉంటుంది. ఈ ఎస్‌డిఆర్‌ఎఫ్ కు కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులను సమకూరుస్తుంది. మరో 25 శాతం నిధులను రాష్ట్రం తన బడ్జెట్ నుండి చెల్లించవలసి ఉంటుంది. తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రాష్ట్ర ఎస్‌డిఆర్‌ఎఫ్ లో తగిన నిధులు లేవనుకున్నప్పుడు కేంద్రం ఎన్‌డిఆర్‌ఎఫ్ నుండి నిధులు అంద చేస్తుంది.
2021 మే 21 న రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ రాసిన లేఖ ప్రకారం 2020 ఏప్రిల్ ఒకటి నాటికి ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులు 977 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 2021 మార్చ్ 31 నాటికి 2581 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 2020-2021 సంవత్సర ఖర్చులను ఈ లేఖలో ఏమీ ప్రస్తావించలేదు. 2020 అక్టోబర్ వరదల నష్టాలకు 245.96 కోట్లు చెల్లించడానికి ఆమోదం తెలిపినా, కేంద్రం మళ్ళీ నిధులు అందచేయకుండా, అప్పటికే ఎస్‌డిఆర్‌ఎఫ్ దగ్గర ఉన్న నిధులను ఖర్చు చేయమని సూచించింది. ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధికి కేంద్రం ఏమీ చెల్లించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదించడం అబద్దం. ప్రతి సంవత్సరం సుమారు 400 కోట్లు రాష్ట్ర ఎస్‌డిఆర్‌ఎఫ్ కు కేంద్రం అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల నుండి పెద్దగా ఖర్చు చేస్తున్నట్లు ఎటువంటి వివరాలు లేవు.
కేంద్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల పరిహారంగా అడుగుతున్న నిధులలో కొంత భాగాన్ని మాత్రమే ఆమోదిస్తూ తక్కువ నిధులను విడుదల చేస్తున్నది. పైగా దీనికి కారణలేనేమీ చెప్పదు . ఉదాహరణకు అక్టోబర్ 2020 నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీ పంట నష్టాలను వివరంగా అంద చేసినప్పటికీ , 552 కోట్ల పరిహారం చెల్లించాలని కోరినప్పటికీ, కేంద్రం కేవలం 188.23 కోట్ల పంట నష్ట పరిహారం క్రింద ఆమోదించింది. ( మొత్తం 245.96 కోట్లు అన్ని రంగాల నష్టంగా పరిగణించింది).నిజానికి అదే సమయం లో కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులను ఖర్చు చేస్తూ ఉందన్న విషయాన్ని కేంద్రం పరిగణనలో ఉంచుకోలేదు. ఇందుకోసం ప్రత్యేక నిధులనేమీ కేంద్రం విడుదల చేయలేదన్నది ఎంత నిజమో, రాష్ట్ర ప్రభుత్వం కూడా వైపరీత్యాల నుండి రాష్ట్ర ప్రజలను బయట పడేయడానికి తాను చేసిన ఖర్చులను యెప్పుడూ పారదర్శకం గా కేంద్రం ముందు, రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం లేదన్న విషయం కూడా అంతే నిజం.
రాష్ట్ర హై కోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో విస్సా కిరణ్ కుమార్, ఆశాలత లతో పాటు మరో పిటీషనర్ గా ఉన్న కన్నెగంటి రవి మాట్లాడుతూ, రాష్ట్ర హై కోర్టు 2021 సెప్టెంబర్ 28 న, నష్ట పోయిన రైతులకు నాలుగు నెలల లోపు ఇన్ పుట్ సబ్సిడీ పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చినప్పటికీ, ఇందుకోసం రాష్ట్రఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులనుండీ 188.23 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ, తీర్పును అమలు చేయలేదని అన్నారు.దానికి బదులుగా రాష్ట్రప్రభుత్వం పరస్పర విరుద్ధమైన వాదనలు చేస్తూ, సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మొదటి కారణం: పరిహారం చెల్లించడానికి తమకు నిధులు ఏమీ అందలేదనీ, కాబట్టి పరిహారం చెల్లించలేదని. రెండవ కారణం: వరదలు, భారీ వర్షాలు కారణంగా మునిగిపోయిన పంటలన్నీ పూర్తిగా కోలుకున్నాయనీ, కాబట్టి అసలు పంట నష్టాలే లేవనీ. (నిజానికి రాష్ట్ర ప్రభుత్వం తన ఫైనల్ నివేదికలో 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగుందని కేంద్రానికి నివేదించింది). మూడవ కారణం: అక్టోబర్ 2020 నుండీ చాలా కాలం గడిచినందున, ఏ రైతులకు నష్టం జరిగిందో గుర్తించలేమనీ, కాబట్టి పరిహారం చెల్లించ లేదనీ . ఇవన్నీ తప్పుడు కారణాలు. నిజాయితీ లేనివి. పూర్తిగా హాస్యాస్పదమైనవి. రాష్ట్ర ప్రభుత్వానికి పంట నష్ట పరిహారం పట్ల చిత్తశుద్ధి లేదని సూచిస్తున్నవి.రైతు స్వరాజ్య వేదిక 5 డిమాండ్ల తో ఒక మెమోరాండం ప్రభుత్వానికి అందచేసింది.
మరిన్ని వివరాలకు :
విస్సా కిరణ్ : 9701705743
కన్నెగంటి రవి : 9912928422
బి.కొండల్ : 9948897734




