రేషనలైజేషన్‌ ‌పేరుతో ఐసిటిసి కేంద్రాల కుదింపు

  • కనుమరుగు కానున్న కౌన్సిలింగ్‌ ‌సేవలు
  • చాపకింద నీరులా ఎయిడ్స్ ‌మళ్లీ ప్రబలే ప్రమాదం

రావుల రాజేశం, లెక్చరర్‌
‌హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) ‌పేరుతో ఎయిడ్స్ ‌వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్‌(ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. రేషనలైజేషన్‌ ‌పేరుతో కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్ ‌నియంత్రణ సంస్థ(న్యాకో) ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. జూలై 5వ తారీఖున న్యాకో జారీ చేసిన సర్కులర్‌ ‌నంబర్‌ 11025 ‌పట్ల ఆ సంస్థ సిబ్బంది ఆందోళనలో పడ్డారు. ఎయిడ్స్ ‌రోగులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన మహమ్మారిగా పేరున్న హెచ్‌ఐవి, ఎయిడ్స్ ‌వ్యాధిగ్రస్తులలో ఉన్న వివక్షతలను పారద్రోలి, రోగులలో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కౌన్సిలింగ్‌ ‌స్కిల్స్‌తో సుశిక్షితులైన నిష్ణానితులైన కౌన్సిలర్స్ ‌సేవలు అందించగా, రేషనలైజేషన్‌ ‌కావడం వల్ల కరువు కానున్నాయి.

పరీక్షలు చేయించుకోవడానికి అందుబాటులో ఐసీటీసీ కేంద్రాలు లేకపోవడం వల్ల, సదరు హెచ్‌ఐవీ, అనుమానిత, హై రిస్క్ ‌గ్రూప్‌, ‌సంక్రమిత వ్యక్తుల ద్వారా చాప కింద నీరు లాగా సమాజంలో మరింతగా ఎయిడ్స్ ‌వ్యాధి ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది. భారతదేశం మొత్తమ్మేదా వివిధ రాష్ట్రాలలో 593 ఐసిటిసి కేంద్రాలు ఎత్తివేయడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో 40 సమీకృత సలహా మరియు పరీక్ష కేంద్రాలు (ఐసిటిసిలు) మూతపడనున్నాయి. రేషనలైజేషన్‌ ‌పేరిట ఐసీటీసీ కేంద్రాలను ఎత్తివేసి అందులో ఉన్న కౌన్సిలర్‌, ‌ల్యాబ్‌ ‌టెక్నీషియన్‌  ‌సిబ్బందిని ఇతర ప్రాంతాల్లోని ఐసీటీసీ కేంద్రాలలో సర్దుబాటు చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పరిపాలన, ప్రజా సంక్షేమ పథకాలు ఉండాలని పదేపదే వల్లే వేసే ప్రభుత్వాలు వాటిని ప్రజలకు అందకుండా హేతుబద్ధీకరణ పేరిట పట్టణాలకే పరిమితం చేయడం పట్ల ఉద్యోగులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2005 సంవత్సరం నుంచి  దాదాపు ఇరవై ఎండ్లుగా ప్రతి సామాజిక ఆరోగ్య హాస్పిటల్‌లో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసి హెచ్‌ఐవి, ఎయిడ్స్ ‌వ్యాధి నిర్ధారణ, కౌన్సిలింగ్‌ ‌సేవలను అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రోగులకు హెచ్‌ఐవి, ఎయిడ్స్ ‌వ్యాధి నిర్ధారణ, సలహాలు, సూచనలతో పాటు ఇతర అవకాశవాద రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు వివరిస్తూ, కౌన్సిలర్లు తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. జనరల్‌ ‌వ్యక్తులు, రిస్క్ ఉన్నవారు, ప్రతి గర్భిణీకి, శస్త్ర చికిత్సల సందర్భంగా హెచ్‌ఐవీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను శిక్షణ పొందిన ల్యాబ్‌ ‌టెక్నీషియన్లు మూడు దశలలో పలు టెస్ట్ ‌కిట్లతో ఇంటిగ్రేటెడ్‌ ‌కౌన్సిలింగ్‌ అం‌డ్‌ ‌టెస్టింగ్‌ ‌సెంటర్‌(ఐసీటీసీ) లలో కన్ఫర్మేషన్‌ ‌టెస్టులను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పల్లెల్లోని ఐసిటీసి కేంద్రాలలో గల కౌన్సిలర్‌, ‌ల్యాబ్‌ ‌టెక్నీషియన్లను ఏరియా, జిల్లా కేంద్ర హాస్పిటళ్లలో గల ఐసీటీసీ కేంద్రాల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ పక్రియ వల్ల పల్లె ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్‌ ‌సేవలు చేరువలో లభించక రోగులు అనేక అవస్థలు అనుభవించే పరిస్థితి నెలకొననున్నది. ఆర్థికంగా చితికి పోయే దుస్థితి ఎదురు కానున్నది.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో గల ఐసిటిసి కేంద్రాల యథాతథ స్థితిని కొనసాగించాలని ఉద్యోగులు, రోగులు, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐసీటీసీ కేంద్రాలలో పనిచేస్తున్న కౌన్సిలర్లను, ల్యాబ్‌ ‌టెక్నీషియన్లను జాతీయ ఆరోగ్య మిషన్‌ ‌కింద వివిధ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం పథకాలు అవగాహన, ప్రజా చైతన్య కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచించారు. భూపాలపల్లి జిల్లాలో ఉన్న రెండు ఐసీటీసీ కేంద్రాలను రేషనలైజేషన్‌ ‌పేరిట ఎత్తి వేయనుండడంతో ఆ జిల్లాలో హెచ్‌ఐవి, ఎయిడ్స్ ‌నియంత్రణ సేవలు శూన్యం కానున్నాయి. జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్‌, ‌చిట్యాలలలో రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ రెండు ఐసీటీసీ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌ ‌ఘడ్‌ ‌మూడు రాష్ట్రాలకు సరిహద్దులో కాళేశ్వరం అంతర్‌ ‌రాష్ట్ర త్రివేణి వంతెన మీదుగా దట్టమైన దండకారణ్య గిరిజన తాండవాసులకు మహాదేవ పూర్‌ ఐసీటీసీ కేంద్రం సేవలు అందిస్తున్నది. భూపాలపల్లి జిల్లా కేంద్ర హాస్పిటల్‌ ‌మెడికల్‌ ‌కాలేజీగా అవతరించనున్నప్పటికీ భూపాలపల్లిలో ఐసిటిసి కేంద్రం సేవలు లేకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *