రేవంత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ పాలన

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్‌ మార్కు ప్రజాస్వామిక పాలన స్పష్టంగా కనిపిస్తుంది. యువకుడైన రేవంత్‌ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలసి చేస్తున్న పాలనాతీరు పట్ల ప్రజల్లో ఓ నమ్మకం..భరోసా పెరిగింది. బిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలు ఏవగింపు కలిగిలా…వారిని మరింత అసహ్యించుకునేలా చేస్తున్నాయి. చేసిన అప్పుల గురించి, అక్రమాల గురించి కాకుండా ఎదురు దాడితో చేస్తున్న విమర్శలు సామాన్యుల్లో బిఆర్‌ఎస్‌ వారిపట్ల మరింత వ్యతిరేకత పెంచుతుంది.. మేడిగడ్డపై కెసిఆర్‌ చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆయనలోని అసహనం బయటపడిరది. మేడిగడ్డ కుంగిపోతే… బాధ్యతారహితంగా మాట్లాడా రు. ఇంతకన్నా దారుణం ఉండదు. పదేళ్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. అసెంబ్లీకి రాకుండా టివిల్లో చర్చ చేస్తానని చెప్పడం ఆయన అసహనానికి పరాకాష్టగా చూడాలి. హరీష్‌రావు, కెటిఆర్‌, కవితలు కూడా చేస్తున్న విమర్శలు ప్రజల్లో ఇప్పుడు బాగా చర్చగా మారాయి. రచ్చబండ చర్చల్లో రేవంత్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న హావిూలపై బాగా చర్చ సాగుతోంది. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు అన్నది గ్రావిూణ ప్రాంతాల మహిళలకు వరంగా మారింది. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, 500కే సిలిండర్‌ కూడా మహిళలకు ఆర్థికంగా తోడ్పడే కార్యక్రమంగా చెప్పుకోవాలి. అందుకే బిఆర్‌ఎస్‌ నేతల తీరుపై తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది. గతంలో ఉన్న సానుభూతి కూడా పోగొట్టుకుంటున్నారు. మేమే తెలంగాణ తెచ్చామని ఇప్పటికీ చెప్పు కోవడం సిగ్గుచేటు. ప్రజలంతా కలిసి పోరాడితేనే తెలంగాణ వొచ్చింది. కేవలం కెసిఆర్‌ పోరాడితే రాలేదని గుర్తించలేకపోతున్నారు. అధికారం పోవడంతో ఉండలేకపోతున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వం వందరోజుల పాలన పూర్తి చేసుకుంది. డిసెంబర్‌ 7 సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక ఆయన తో పాటు, మంత్రులు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. అదేపనిగా బిఆర్‌ఎస్‌ను వారు విమర్శలు చేయడం లేదు. కేవలం చేస్తున్న బిఆర్‌ఎస్‌ నేతలు విమర్శలపై మాత్రమే ఖండిస్తున్నారు. అప్పులు ఎలా జరిగాయో ప్రజలకు వివరిస్తున్నారు. ఇక వందరోజుల పాలన అంతా సజావుగా సాగుతోంది. అయితే ఇప్పటి వరకు రేవంత్‌ రెడ్డి , ఆయన టీమ్‌ కేవలం వారు హావిూ ఇచ్చిన పనులను మాత్రమే చేసి చూపారు. కానీ హావిూ ఇవ్వని పనులు గ్రామాల్లో కోకొల్లలు. మంత్రులు ఎవరికి వారు వారి శాఖల్లో ఉన్న సమస్యలపై స్పందించాల్సి ఉంది. ప్రధానంగా పంచాయితీల్లో అంటే..గ్రామాల్లో ఇంటి వారసత్వం కొడుకులు లేదా కూతుళ్లకు బదిలీ అయ్యేది. తండ్రి చనిపోగానే ఓ తెల్ల కాగితం రాస్తే..బదిలీ చేశారు. ఈ పద్దతిని గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎత్తేసింది. గ్రామాల్లో ఇళ్లను కూడా తండ్రి మరణానంతరం బదిలీ చేసుకునేలా ఉన్న వెసలుబాటును పునరుద్దరించాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో అటెండర్‌ దగ్గర నుంచి ఇవో వరకు లంచాలు మేయనిదే పనులు చేయడం లేదు. దీనిని సీరియస్‌గా తీసుకుని కఠిన ఆదేశాలు ఇవ్వాలి.

గ్రామస్థాయిలోనే ప్లాస్టిక్‌ నిషేధాన్ని ప్రోత్సహించాలి. అవసరమైతే చట్టం చేయాలి. ప్లాస్టిక్‌, చెత్తా చెదారం ఎక్కడపడితే అక్కడ మోరీల్లో, రోడ్లపై వేశాక..పారిశుద్ద సిబ్బందితో ఎత్తివేయించడం కన్నా…వారు చెత్తా చెదారంతో పాటు ప్రధానంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయట వేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క దీనిని తక్షణ కర్తవ్యంగా స్వీకరించాలి. ఇకపోతే గతంలో వైఎస్‌ అధికారంలో ఉన్నా తరవాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రోశయ్య, పదేళ్ల కెసిఆర్‌ పాలనలో దేవాదాయ భూములు అన్యాకాంతం అయ్యాయి. కౌలుకు తీసుకున్న దేవాలయ భూములకు కౌలు చెల్లించడం లేదు. కొన్నిచోట్ల కౌలుదారులు ఎమ్మార్వోల ను మేనేజ్‌ చేసి తమ పేరున పట్టాలుగా రాయించుకున్నారు. ధరణిలో ఎక్కించుకున్నారు. ఇలాంటి భూములను స్వాధీనం చేసుకుంటే ధూపదీప నైవేద్యాలకు డబ్బులు విదల్చాల్సిన అవసరం రాదు. ఇకపోతే కోతుల భయంతో ప్రజలు గ్రామాల్లో పంటలు వేయాలంటే భయపడుతున్నారు. ఇళ్లల్లో పాదులు కూడా పెట్టుకోవడం లేదు. ఇంటిముందున్న చెట్లను నరికేస్తున్నారు.  ఇళ్లకు గేట్లు వేసుకుని కూర్చిఉంటున్నారు. ఇది ఓ ప్రధాన సమస్యగా మారింది. కుక్కల బెడద  తీవ్రంగా ఉంది.  దీంతో పర్యావరణం దెబ్బతింటోంది. కోతుల బెడదను తొలగించేందుకు లేదా తరలించేందుకు మార్గాలను అటవీశాఖ ఆలోచన చేయాలి. ఇది యువతకు ఉపాధిగా కూడా మార్చవచ్చు. దీనిపై మంత్రి కొండా సురేఖ ఆలోచన చేయాలి.

గ్రామాల్లో చెరువుల పూడికతీతలు ఎక్కడా జరగలేదు. మిషన్‌ కాకతీయ పేరుతో నిధులు మింగారు. అలాంటి చెరువులను గుర్తించి ప్రజల భాగస్వామ్యంతో పునరుద్దరించాలి. చెరువుల ఆక్రమణలను తొలగించాలి. గ్రామాల్లో పారిశుద్ద్యం కూడా ముఖ్యంగా గమనించాలి. గ్రావిూణ రోడ్లను అభివృద్ది చేయాలి. నగరం నుంచి వెలపలకు వెళ్లే ప్రధాన రహదారులతో పాటు , సర్వీస్‌ రోడ్లను అభివృద్ది చేయాలి. ఇవన్నీ కొన్ని సమస్యలు మాత్రమే. ఎందుకంటే సమస్యలను గుర్తించి పరిష్కరిస్తే ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుంది. తొలి రోజే ప్రగతి భవన్‌ వద్ద ఉన్న గేట్లను తొలగించి,. అక్కడ ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగింది. ప్రజలు ఎక్కువగా తమ వ్యక్తిగత సమస్యలే ప్రస్తావిస్తారు. గ్రామాల వారీగా సమస్యలను గుర్తించే పనిని పార్టీపరంగా చేయాలి. జిల్లాల్లో సమస్యలు పరిష్కారం కాని వాళ్లు ఇక్కడకు వొచ్చి వినతులు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హావిూలు అమలవుతున్నాయి. అధికారంలోకి వొచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలుపైనే రేవంత్‌ సర్కారు దృష్టి పెట్టింది. అలాగే గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను పరిశీలించి, పరిష్కరిస్తే మంచిది. ముందుగా మంచినీటి సమస్యలతో పాటు, సాగునీటి సమస్యలు కూడా పరిష్కరించాలి. అవినీతికి ఆస్కారం లేని పాలనపై దృష్టి సారించాలి. ప్రజల్లో అప్పుడే మరింత విశ్వాసం  కలుగుతుంది.
 `ప్రజాతంత్ర డెస్క్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *