- ఇదే తొలి ఎన్నికల ప్రచార సభ
- హుస్నాబాద్‌లో తిరుగులేని శక్తిగా బీఆర్‌ఎస్
- భారీ జనసమీకరణకు ఏర్పాట్లు…గులాబీమయమైన హుస్నాబాద్
- అన్ని దారులు హుస్నాబాద్ వైపే
హుస్నాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : హుస్నాబాద్ గులాబీ మాయమవుతుంది. సిఎం కేసీఆర్ బహిరంగ సభకు ముస్తాబవుతుంది. తొలి ఎన్నికల ప్రచార సభకు సన్నద్ధమవుతుంది. తొలి ప్రచార సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు గులాబీ సైన్యాలు కదం తొక్కుతున్నాయి. సిఎం కేసీఆర్‌కు హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం సెంటిమెంట్‌గా వొస్తుంది. గత రెండు ఎన్నికల్లోనూ హుస్నాబాద్ సెంటిమెంట్ కలసివచ్చింది. ఇదే ఉత్సాహంతో మరోసారి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిఎం కేసీఆర్ హుస్నాబాద్ వేదికను ఎంచుకున్నారు. ఇక్కడి నుండి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు తనయుడు వొడితల సతీష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హుస్నాబాద్ గులాబీ పార్టీకి పెట్టని కోటలా తయారైంది. నాడు తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న హుస్నాబాద్ నేడు అదే బాటలో గులాబీ పార్టీకి కంచుకోటలా ఉంది. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. సిఎం కేసీఆర్ సభ గులాబీ పార్టీలో మంచి జోష్ నింపడంతో పాటు ప్రతిపక్షాలలో దడ పుట్టించనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అభివృద్ధిలో మేటి – సతీష్‌కు లేరు సాటి
గడచిన పదేళ్లలో హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సక్సెస్ అయ్యారు. కల్లోల ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్‌లో అయన ప్రశాంతత నింపారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చారు. విద్య, వైద్యం, విద్యుత్‌తో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో హుస్నాబాద్‌ను తీర్చిదిద్దారు. హుస్నాబాద్‌కు సతీష్ హయాంలో మంచి గుర్తింపు వొచ్చింది. గడచిన పదేళ్లలో హుస్నాబాద్ అభివృద్ధిని సతీష్ కుమార్ పరుగులు పెట్టించారు. హుస్నాబాద్‌ను రెవిన్యూ డివిజన్‌గా తీర్చిదిద్దారు. కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. కొత్త సబ్ స్టేషన్లు, కొత్త రోడ్లు..ఒక్కటేమిటి..అన్ని రంగాల్లోనూ హుస్నాబాద్ అభివృద్ధి చేశారనేది అందరూ ఒప్పుకునే అంశం. గతంలో హుస్నాబాద్‌కు ఇప్పటి హుస్నాబాద్‌కు పోల్చి చూసినప్పుడు కనిపిస్తున్న మార్పును విమర్శకులు కూడా ఒప్పుకోవడం గమనార్హం.
వ్యక్తిత్వం సతీష్ అదనపు బలం
ప్రజల దృష్టిలో మంచి ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా వొడితల సతీష్ కుమార్ పేరు తెచ్చుకున్నారు. ఇటు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే..మరోవైపు నిరంతరం ప్రజల్లో మమేకమై పనిచేసారు. తనవద్దకు వొచ్చేవారికి ఎవరికీ కాదనకుండా సహాయం చేసారని అందరూ అంటారు. శత్రువులకు కూడా అయన ఉపకారం చేస్తారే తప్ప ఎలాంటి అపకారం చేయరనే పేరుంది. శత్రువులు కూడా సతీష్ కుమార్‌ను ప్రశంసిస్తారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చీమకు హానికూడా చేయని నేతగా సతీష్ కుమార్‌ను అభివర్ణించారు. ఎమ్మెల్యే అంటే సతీష్ బాబులా ఉండాలి అంటూ కితాబునిచ్చారు.
గులాబీకి కంచు కోటలా హుస్నాబాద్
ఉద్యమం ప్రారంభం నుండి హుస్నాబాద్ గులాబీ పార్టీకి కంచుకోటలా ఉంది. మొదటి నుండి బలమైన పార్టీ నిర్మాణం బీఆర్‌ఎస్ పార్టీకి ఉంది. దాదాపు 60 వేల మంది బీఆర్‌ఎస్ పార్టీ క్రియాశీల సాధారణ కార్యకర్తలు ఉన్నారు. లక్ష యాభై వేలకు పైగా వివిధ ప్రభుత్వ పథకాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వొస్తుంది. నియోజకవర్గంలో 90 శాతానికిపైగా బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉండడం గమనార్హం.
గులాబీ జోరు – ప్రతిపక్షాల బేజారు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నాయకత్వంలో ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతుంది. కానీ కాంగ్రెస్, బీజేపీల నుండి ఎవరు అభ్యర్థులుగా పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రచారం ఊపందుకుంది. ముగ్గురు మంత్రులు నియోజకవర్గంలో ప్రచార సభలు నిర్వహించారు. రేపు ఆదివారం సిఎం బహిరంగ సభ జరగనుండగా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వొచ్చిన తర్వాత గ్రామగ్రామాన ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తుంది. సిఎం కేసీఆర్ సభతో గులాబీ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్న సంకేతాలు ఇటు ప్రత్యర్థులకు అటు ప్రజలకు ఇచ్చేందుకు సన్నద్ధమవుతుంది.





