అది హృదయ రాగాల మందిరం
ఏ విషపు వాయువులు తాకని కుటీరం
విద్యుదీకరణ గాంచిన మనస్సులు
ఊలలాడుతుంటాయి అచ్చట
వినమ్రంగా పువ్వులు ఆకులతో ముచ్చటిస్తూ
ఎండకు మెరిసే ఇసుక రేణువులనుంచి
వెలుగులను పొందుతూ ఆస్వాదిస్తుంటాయి
రెక్కలు వాలుతుంటాయి ఎదపై
భూమ్యాకర్షణ నుంచి దూరంగా తచ్చాడతాయి
కృతజ్ఞతగా నీళ్ళను చప్పరిస్తాయి
లోకకల్యాణం కోసం ఒక గూడు కడతాయి
ఒక నాగలిని హృదాంతరాళాల్లో
జ్ఞాపికగా ఇచ్చిపుచ్చుకుంటాయి
గడ్డిమోపులోని పసిరిక వాసనలు
కాలువలోని ధ్వనులు
మసక సంధ్యలో రాత్రిని కావలించుకుంటూ
పొద్దెక్కేసరికి జీవశబ్దంలో
ఒక జొన్నకంకి నిటారుగా
మొలిచి చూస్తుంటుంది చుట్టూ
ఒక పిచ్చుక దానిపై వాలి
స్వాగతం తెలుపుతుంది కూతతో
మేఘాలు దారంతా పరుచుకుని దూది పిందెల్లా
ఆ రొడ్డెంటా సుదూర ప్రాంతాలకు
పయనిస్తున్న రెండు పాదాలు
ముందు నడుస్తుంటే
వేలు పట్టుకుని చిన్ని పాదాలేమో
వెనకాలే అనుసరిస్తుంటాయి
రేపటి భవిష్యత్తును జాగ్రత్తగా
ఒదిమి పట్టుకుని
ఏ తీరాలకో చేరాల్సిన శిఖరాలకో
తావు చూపిస్తూ
నిఖార్సయిన రంగులను పొదుగుతున్న
ప్రకృతి దృశ్యాన్ని
గాలులు మోసుకెళ్తున్నాయి
నదీ తలాల మీదగుండా
తీసుకొస్తాయి పాలనురగల
కాంతిపుంజాల్ని మరల మరలా
చీకటి వెలుగుల క్రీనీడల్లో…
– రఘు వగ్గు, 9603245215




