రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

  • అదుపుతప్పి కట్టెల లారీ బోల్తా…
  • అక్కడే ఉన్న కానిస్టేబుల్‌, టీచర్‌ దుర్మరణం
  • టూవీలర్‌ను ఢీకొన్న బస్సు… ఒకరు మృతి

మహబూబాబాద్‌/రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 14: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం మహబూబాబాద్‌ నుంచి నర్సంపేట కట్టెల లోడుతో వెళ్తున్న లారీ గూడూరు మండల కేంద్రంలో మూలమలుపు వద్ద టర్న్‌ అవుతుండగా బోల్తా పడిరది. అదే సమయంలో అక్కడే రోడ్డుపై నిలిచి ఉన్న గూడూరు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ దనసరి పాపారావు, సీఆర్‌టీ టీచర్‌ చించ దేవేందర్‌పై పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలు కాగా అతడిని గూడూరు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌, లారీ క్లీనర్‌ ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. బాధిత కుటుంబాలకు న్యాయం  చేయాలని గిరిజన సంఘాలు వొచ్చి రోడ్డుపై పైఠాయించి ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రామ్‌ నాద్‌ కేకన్‌ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానిక పోలీసుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డుపై పడి ఉన్న కట్టెల లారీ క్లియర్‌ చేయించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాజన్న సిరిసిల్లలో టూవీలర్‌ను ఢీకొన్న బస్సు…ఒకరు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రంగి గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వొస్తున్న ఇద్దరు యువకుల్లో గండి అజయ్‌(19) అక్కడికక్కడే మృతి చెందాడు. బోయిని సంతోష్‌ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అజయ్‌ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *