రూ.1000 కోట్లతో కొండగట్టు ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం

  • కాంగ్రెస్‌ హయాంలో ఇక్కడ తాగునీటికి కటకట
  • రామచంద్రాపూర్‌ సర్పంచ్‌ బోర్లు వేసివేసి ఆడనే ప్రాణమిడిచిండు…
  • నేడు ఆ పరిస్థితి లేదు…బ్రహ్మాండంగ పంటలు పండుతున్నయ్‌
  • చొప్పదండిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌

చొప్పదండి, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని రూ.1000 కోట్లు ఖర్చు చేసైనా సరే అద్భుతంగా తీర్చిదిద్దుతానని సిఎం కెసిఆర్‌ హావిూ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో చొప్పదండి నియోజకవర్గంలో సాగునీటికి ఎన్ని తిప్పలు ఉండెనో గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఆ బాధలు తీరినయని చెప్పారు. శుక్రవారం సిఎం కెసిఆర్‌ చొప్పదండి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీఅని, తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ అని అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో సాగు నీటికి కటకట ఉండెనని, రైతులు బోర్లు వేసి నీళ్లు పడక ఆత్మహత్యలు చేసుకునేటోళ్లని, ఇదే నియోజకవర్గంలో రామంచంద్రాపూర్‌ సర్పంచ్‌ తిరుపతి బోర్లు వేసివేసి నీళ్లు పడక చివరికి ఆ బోర్ల కాడనే ప్రాణం ఇడిసిండని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, బ్రహ్మాండంగా పంటలు పండుతున్నయని సీఎం తెలిపారు. ఇంకా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ..‘విూరు గతం గురించి ఒకసారి ఆలోచన చేయాలె. అప్పుడు గూడా వరద కాలువ ఉండె, ఇట్లనే కాకతీయ కాలువ ఉండె. అయినా చొప్పదండిలో సాగునీళ్లుకు కరువుండె. వరద కాలువతోని ఎన్ని బాధలు ఉండె..? మనం మోటర్‌ పెట్టుకుని నీళ్లు పారిచ్చుకుందాం అంటే దాన్ని కోసి అదే కాలువల ఎత్తేద్దురు. ఇయ్యాల విూ జోలికి ఎవడన్నా వత్తుండా..? ఇప్పుడు ఎన్ని తూములు పెట్టుకున్నం..? వరద కాలువను ఎంత బ్రహ్మాండంగా నదిలాగ చేసుకుని చొప్పదండిలో 1.25 లక్షల ఎకరాలకుపైగా పంటలు పండిరచుకుంటున్నం..? అంతేగాక మిషన్‌ కాకతీయ కింద కూడా అనేక చెరువులను, కుంటలను బాగు చేసుకుని పంటలు సాగుచేసుకుంటున్నం.’ అని చెప్పారు. ‘ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైన నియోజకవర్గం.

ఈ మధ్యనే విూ ఎమ్మెల్యే రవిశంకర్‌, వినోద్‌కుమార్‌ ఇంకా చాలా మంది కొండగట్టు అంజన్న ఆలయాన్ని ఒక అద్భుతంగా, దివ్యదామంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ మధ్యే నేను ఆ ఆలయాన్ని సందర్శించాను. వెయ్యి కోట్ల రూపాయల ఖర్చయినా సరే కొండగట్టు అంజన్న ఆలయాన్ని బ్రహ్మాండమైన ఆలయంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న దీవెన మనందరి విూద ఉండాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని సీఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *