రుణమాఫీని వెంటనే అమలు చేయాలి

  • ‘ధరణి’ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
  • రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆందోళన
  • జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు
  • రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపుతో నిరసనల్లో పాల్గొన్న పార్టీ నేతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీని వెంటనే అమలు చేయాలని బిజెపి డిమాండ్‌ ‌చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ‌కారణంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని  ఆ పార్టీ డిమాండ్‌ ‌చేసింది. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆందోళనలకు దిగింది. నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతుధర్నా, రైతు దీక్ష పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేస్తూ వరంగల్‌ ఎం‌జీఎం సెంటర్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్‌, ‌మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ ‌రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హనుమకొండ కాళోజీ సర్కిల్‌ ‌లోనూ బీజేపీ నాయకులు ‘రైతు ధర్నా’ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌ ‌రెడ్డి, జిల్లా ఇన్‌ ‌చార్జ్ ‌మురళీధర్‌ ‌గౌడ్‌, ‌పలువురు నేతలు, రైతులు పాల్గొన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నాయకులు ‘రైతు ధర్నా’ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ ‌మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు నరహరి వేణుగోపాల్‌ ‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్‌ ‌కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నాయకులు ‘రైతు ధర్నా’ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డితో పాటు ఇతర సీనియర్‌ ‌నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపిస్తూ..జగిత్యాల కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్‌ ‌వద్ద బీజేపీ నాయకులు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. రైతు రుణమాఫీ చేయాలని, ధరణి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ ధర్నాలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. మెదక్‌ ‌కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ రైతు ధర్నా చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఫసల్‌ ‌బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని మెదక్‌ ‌జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్‌ ‌ప్రశ్నించారు.

ధరణి అంటేనే దగా అని ఆరోపించారు. ఎరువుల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఎకరాకు రూ.20 నుంచి 30 వేల వరకూ సబ్సిడీ ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఎరువులను ఇస్తానని హావి• ఇచ్చి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. రాబోయే రోజుల్లోనూ రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు కరెంట్‌ ఎక్కడ ఇస్తుందో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. గత ఎనిమిదేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా ఇన్‌ ‌చార్జ్ ‌మల్లారెడ్డి చెప్పారు. ధరణితో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలన్నారు. యంత్ర లక్ష్మీ పథకం అమలు చేయడం లేదన్నారు. తాము రైతుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి..పంజాబ్‌ ‌రైతులను ఆదుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. రైతులు, యువకులు, ఉద్యోగుల హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్‌ ‌లో కలెక్టరేట్‌, ‌నిర్మల్‌ ‌జిల్లా కలెక్టరేట్‌ ‌ముందు బీజేపీ ధర్నా చేపట్టింది. రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ ‌చేశారు. ఇటు ఆదిలాబాద్‌ ‌జిల్లా కేంద్రంలోనూ బీజేపీ ర్యాలీ చేపట్టింది. ఆ తర్వాత కలెక్టరేట్‌ ‌ముందు ధర్నా నిర్వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *