రాహుల్‌ యాత్రతో భయపడుతున్న భాజపా ..!

18వ లోకసభది ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఫ్రీ ఫైనల్‌ గా భావించిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో  కేంద్రంలో ఉన్న అధికార భారతీయ జనతాపార్టీ విజయ దుందుభి మోగించింది. కేంద్రంలో 2014, 2019 లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ పార్టీకి  జవసత్వాలు నింపేందుకు గాంధీ ఇతర కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పజెప్పిన రాహుల్‌ గాంధీ ప్రజల కష్ట, సుఖాలను తెల్సుకునెందుకు చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌ పాలిట ‘సంజీవిని’ అయ్యింది.12 రాష్ట్రాల్లో 75జిల్లాలు ,2కేంద్రపాలిత ప్రాంతాలు కల్పి 136 రోజుల పాటు కన్యాకుమారి నుండి జమ్మూ,కాశ్మీర్‌ వరకు 4080 కిలోమీటర్ల ప్రయాణంలో లక్షలాది మంది ప్రజలు, కవులు,కళాకారులు, ప్రజాస్వామ్యవాదులు, సామాజిక కార్యకర్తలు ఉద్యమంలో స్వచ్చందంగా పాల్గొని గళాన్ని వినిపించారు.

దాని ప్రభావం కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో భారత్‌ జోడో యాత్ర కొనసాగిన జిల్లాల్లో వచ్చిన ఫలితాలు రుజువు చేసాయి. యాత్ర సందర్భంగా రాహుల్‌ కేంద్రంపై సంధించిన ప్రశ్నలు , ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఆయా రాష్ట్రాల అస్తిత్వ సమస్యలు, ప్రతిపాదించిన గుణాత్మక పరిపాలన విధానాలను పూసకుచ్చినట్టు చెప్పడం వల్ల కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ తమ అభ్యర్థులను గెలిపించుకోలేని దుస్థితి వచ్చింది. 2014లోకసభ ఎన్నికల్లో ముక్త భారత్‌ పేరుతో హిందుత్వం ఎజెండాగా 282 స్థానాల్లో గెలిచి బొటాబొటి మెజార్టీ సాధించిన భారతీయ జనతా పార్టీ 2019లో తిరిగి గతంలో కంటే ఎక్కువ 303 సీట్లతో అజేయంగా నిలవడానికి విపక్షాల ద్వంద వైఖరనే ప్రచారం ఉంది. కేంద్రంలోనూ అధికారం మార్పు కోరుకుంటున్నా.. దాన్ని అందిపుచ్చుకోవడానికి విపక్షాలు కనుచూపుమేరకు సిద్ధంగా ఉన్నట్టు కన్పించడంలేదు. సొంత ఎజెండాతో ముందుకు సాగడం వల్ల, ప్రజల్లో నమ్మకం సన్నగిల్లి అపశకునాలు ఎదురవుతున్నాయనే విమర్శ ఉంది.

image.png
దేశంలో బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడంలో విపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయి. నాడు ఎన్నికల ప్రచారంలో  ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, సంకీర్ణ ప్రభుత్వాలతో అభివృద్ధి జరుగదని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలతో నమ్మించి అధికారం చేపట్టి రైతులను, యువత గొంతుకోసింది. ఇక కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు తెచ్చిన నల్ల చట్టాలతో వ్యవసాయరంగం ప్రమాదంలో పడనున్నదని నిపుణులు చెప్పినా వెనుకకు తీసుకోలేదు. విపక్షాల అనైక్యత కారణంగా ప్రజలకు తెలియజేయలేక పోయారనే భావన అందరిలో దాపురించింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కూడా అనేకం.దేశ ప్రజలకు ఇచ్చిన హామీలపై విపక్షాలు పార్లమెంటులో, వెలుపల గొంతెత్తుతే నిమ్మకు నీరెత్తినట్టు అధికారపార్టీ వ్యవహరించింది. భారత దేశం ప్రజాస్వామ్య దేశం అంటూ ప్రపంచదేశాలు చెప్పుకుంటాయి కానీ, దేశ పార్లమెంటరీ చరిత్రలో  ఎమర్జెన్సీని తలపించే విధంగా 146 మంది ప్రతిపక్ష పార్లమెంట్‌ సభ్యులను సస్పెండ్‌ చేసి ప్రజావ్యతిరేక బిల్లులను ఆమోదించడం బీజేపీ అప్రజాస్వామిక పాలనకు నిలువెత్తు నిదర్శనం. నియంతృత్వం వల్ల సుదీర్ఘ కాలంగా మిత్రులుగా కొనసాగిన ఉద్దవ్‌ శివసేన,అకాలీదళ్‌ దూరమైనాయి.

దక్షిణాదిన పాగా వేయాలని కలలుకన్న బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ ఘడ్‌ ఫలితాలు వాపును చూసి బలుపు అనుకుంటే పొరపాటే. అక్కడ ఫలితాలు అసెంబ్లీకి ఇస్తే పార్లమెంట్‌ కు అవకాశం ఇవ్వరనేది గత అనేక ఫలితాలు సాక్షాత్కరిస్తున్నాయి.
భారత్‌ జోడో యాత్రకు వచ్చిన ఆదరణ చూసి రాహుల్‌ గాంధీ ప్రజలతో మమేకం కావాలనే సంకల్పంతో మరోమారు భారత జోడో న్యాయ యాత్ర పేరుతో ఈ నెల 14 మణిపూర్‌ నుండి  మార్చి 30, ముంబాయి వరకు దేశంలో జీఎస్టీ పేరుతో చేస్తున్న దోపిడిని, గ్యాస్‌,డీజిల్‌, పెట్రోల్‌ అధిక ధరల భారాన్ని,  సామాన్యులకు జరుగుతున్న అన్యాయాలను చాటి చెప్పేందుకు, దేశ వ్యాప్తంగా, మహిళలపై, దళితులపై, గిరిజనులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ , న్యాయం కోసం 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల్లో 6,713 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. యాత్ర కొనసాగితే పుట్టగతులు ఉండవని, హ్యాట్రిక్‌ కొట్టడం మిస్‌ అవుతామనే భావంతో అడుగడుగునా బీజేపీ ప్రభుత్వం అవరోధాలు కల్పిస్తున్నది.మణిపూర్‌ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇవ్వలేదంటే రాహుల్‌ యాత్ర ప్రభావం  ఉంటుందనే భయం మోదీ ని వెంటాడుతున్నది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, కేంద్ర, రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి భంగం కల్గిస్తూ ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నా బీజేపీ ని గద్దె దించడానికి భారత్‌ జోడో న్యాయ యాత్ర దోహదపడుతుందనే నమ్మకం కాంగ్రెస్‌ క్యేడర్‌ లోనే కాదు, ప్రజాస్వామ్యవాదులకు ఏర్పడిరది. మూడు రాష్ట్రాల్లో గెలుపొందిన బీజేపీ 2024లో 400 సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పుతుంది. అయితే వోటు షేరింగ్‌ భాజపా కంటే కూడా కాంగ్రెస్‌ కూ పెరిగిందంటె అతిశయోక్తి కాదు. ఇండియా కూటమిలో తృణమూల్‌, డీఎంకే, సిపిఐ,సిపిఎం,జనతాదళ్‌ (యు), ఎస్పీ,ఆప్‌,ఆర్జేడీ లాంటి తదితర 26పార్టీలు బీజేపీని ఓడిరచే క్రమంలో ఒక్కతాటి మీదికి వచ్చాయి. ఇదే అదనుగా దేశంలో నరేంద్ర మోదీ ని వ్యతిరేకిస్తున్న బలమైన ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుంటే కాంగ్రెస్‌ కు మేలు చేస్తాయనే భావన ప్రధాని నరేంద్ర మోదీ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. కట్‌ చేస్తే .. భారత్‌ జోడో న్యాయ యాత్ర చేపట్టాలన్న ప్రతిపాదన ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ పెట్టలేదని నితీష్‌ తీకునాలు తీయడం వెనుక బీజేపీ పాత్ర ఉన్నదనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.

   -డా. సంగనిమల్లేశ్వర్‌
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌,
సెల్‌ : 9866255355    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *