- ప్రజలతో మమేకమై తిరిగే నేత…పబ్బులు, క్లబ్యులు అని విమర్శించడం అవివేకం
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్
- కెసిఆర్ కూడా చంద్రబాబు పక్కన ఉన్నవాడే..!
- మంత్రి కెటిఆర్‌కు కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి కౌంటర్
ఖమ్మం(ఎర్రుపాలెం)/జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 17 : పేద ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీని విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదని మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ క్లబ్బులు పబ్బులు అంటూ విమర్శించడంపై మండిపడ్డారు. సోమవారం ఎర్రుపాలెం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…గతంలో ప్రధాని పదవి సున్నితంగా తిరస్కరించి పదవులు కోసం కాదు ప్రజల సమస్యల కోసమే పరితపిస్తూ ప్రజల మధ్య తిరుగుతూ వెల్డింగు కార్మికుల నుండి వ్యవసాయ కార్మికుడి వరకు అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్లో మమేకమై తిరుగుతున్న రాహుల్ గాంధీని పబ్బులు క్లబ్బులు అనటం అవివేకమని, మంత్రి కేటీఆర్ మాటలు ఉపసంహరించుకోవాలని తీవ్రంగా ఖండించారు.
రానున్న రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ నేనని, దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరగనున్నట్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, శీలం ప్రతాపరెడ్డి, నాయకులు బండారు నరసింహారావు శ్రీనివాసరెడ్డి, బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, అనుమోలుకృష్ణారావు, సామినేని హనుమంతరావు, చెరుకుమల్లి జగన్నాధ రావు, శీలం వెంకటరామిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి, జానీ పాషా, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కెసిఆర్ కూడా చంద్రబాబు పక్కన ఉన్నవాడే..! : మంత్రి కెటిఆర్‌కు కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి కౌంటర్
ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న నేతలంతా గతంలో టిడిపిలో, చంద్రబాబు పంచన పనిచేసిన వారేనని మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వి• నాయన కెసిఆర్ కూడా చంద్రబాబు పక్కన ఉన్నవాడేనని, అక్కడి నుంచే వొచ్చాడని తెలుసుకోవాలని అన్నారు. కెసిఆర్ ఆకాశంలోంచి ఊడిపడలేదని, తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిన విషయం మరిచావా అని అన్నారు. ఇటీవలి కాలంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబును జత చేస్తూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జీవన్‌రెడ్డి.. కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు.
నీ పోచారం శ్రీనివాసరెడ్డి చంద్రబాబు పంచన లేడా? నీ దయాకర్ రావు చంద్రబాబు పంచన లేడా? నీ తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు పంచన లేడా? గంగుల కమలాకర్ ది ముందు టీడీపీ కాదా? బాబూ కేసీఆర్ అసలు నువ్వు ఎక్కడి నుంచి వొచ్చావు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గురించి తెలుసుకుని మాట్లాడండి. చంద్రబాబు దయా దక్షిణ్యాలతోనే బీఆర్ఎస్ నేతలకు రాజకీయ భిక్ష వొచ్చిందన్నారు. నీ మంత్రి వర్గం మొత్తం టీడీపీలోనే పుట్టింది. రాహుల్‌కు నీలాగా వాస్తవాలను వక్రీకరించడం రాదు. నువ్వా రాహుల్ గాంధీ గురించి మాట్లాడేది..? మేము ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు నీ బతుకు దెరువు ఏంది కేటీఆర్? కాంగ్రెస్ ఆందోళనతోనే మూడు రోజులుగా 24 గంటలు ఇస్తున్నారు. ఆ సోయి మొన్నటిదాకా ఎందుకు లేదు కేటీఆర్? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.




