పలు జిట్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
ఇప్పటికే పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
నిండుకుండల్లా గోదావరి తీర ప్రాజెక్టులు
పాఠశాలలకు శనివారం వరకు సెలవులు పొడిగింపు
వరద పరిస్థితులపై మరోమారు సిఎం కెసిఆర్ సమీక్ష
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరిక
భద్రాచలం వద్ద మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక జారీ
హైదరాబాద్‌లో పాతభవనాలను గుర్తించి నోటీసులు ఇచ్చిన జిహెచ్‌ఎంసి
ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీలో వర్షాలతో జనజీవనం అతలాకుతలం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : రాష్ట్రంపై వరుణుడి ప్రకోపం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. వరద పోటెత్తుటుండటంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఇన్ ప్లో అంతకంతకూ పెరుగుతుండటంతో కొన్ని జలాశయాలు ప్రమాదం అంచుకు చేరాయి. బాసర• నుంచి మొదలు గోదావరి తీరం అంతా వరదతో ముంచెత్తుతుంది. ధర్మపురిలో గోదావరి పొంగి గ్రామంలోకి నీరు చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తడిసి ముద్దయ్యింది.
హైదరాబాద్‌లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే పరిస్థితి ఇంత దారుణంగా ఉండగా మరోవైపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవి•క్ష నిర్వహించారు. అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీసారు. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేయనున్నారు. అయితే ఎడతెరిపి లేని వర్షాల దృష్ట్యా పాఠశాలలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కుండపోత వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనుండగా..మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల ,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,పెద్దపల్లి, భదాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ అర్బన్..రూరల్, జనగాం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పింది. వర్షాల నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులను ప్రభుత్వం పొడగించింది. భారీ వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో..సెలవులను శనివారం వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం సెలవు కావడంతో తిరిగి సోమవారం విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. భద్రాచలంలో గోదావరి కనీవినీ ఎరుగని రీతిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే 50 అడుగులు దాటిన గోదావరి నీటి మట్టం బుధవారం సాయంత్రానికి 60 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం 53 అడుగులు దాటడంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతం సమ్మక్క బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వొస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం, వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలం వైపు రాకపోకలు స్తంభించాయి. ఇకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ప్రస్తుతం 56,506 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వొస్తుంది. శ్రీరాంసాగర్ నుంచి 10వేలు, నర్మాల ప్రాజెక్టు అలుగు పారుతుండటంతో మానేరు, మూల, గంజి వాగుల ద్వారా 43,306 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 318 వి•టర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 310.23 వి•టర్లకు చేరడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశముందని అధికారులు చెప్పారు. కుండపోత వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు భారీగా చేరడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని 85 గేట్లు ఒకేసారి ఎత్తివేశారు. దీంతో ములుగు జిల్లాలోని గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో 4లక్షల క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్నందున నదీ పరివాహక ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గత ఆరురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరవాసులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై దృష్టిపెట్టింది. ఈ ఏడాది 584 భవనాలను గుర్తించింది. ఇప్పటివరకు 168 శిథిలావస్థకు చేరుకున్న భవనాలను జీహెచ్‌ఎంసీ అధికారులు డేమాలిష్ చేశారు. గడిచిన రెండు రోజుల్లో 45 భవనాలను అధికారులు కూల్చివేశారు. 199 భవనాలను రిపేర్ చేసినట్టు తెలిపారు. మరో 257 బిల్డింగ్స్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీలో వర్షాలతో జనజీవనం అతలాకుతలం
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి..చెరువులు కట్టలు తెగుతున్నాయి..ఏజెన్సీల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు ఏజెన్సీలో చాలా గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రామప్ప, లక్కవరం, భద్రకాళీ, వడ్డెపల్లి చెరువులు అలుగుపోశాయి. మరోవైపు గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తుంది. రామన్నగూడెం పుష్కరఘాట్, వాజేడు పేరూరు వద్ద గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రకాళీ చెరువు రెండు రోజులుగా అలుగు పారుతుంది. శివనగర్‌లోని నాలాలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి, కాలనీల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉన్నాయి.
ఐదు రోజులుగా ముసురు పడుతూనే ఉంది. హనుమకొండ, జిల్లాలోని దాదాపు అన్ని చెరువులు పూర్తిగా నిండి జలకళను సంతరించుకున్నాయి. పెద్ద చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. వర్షాల వల్ల జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది. నగరంలోని తోతట్టు ప్రాంతాల పరిస్థితి మరింత క్షీణించింది. ఇలాగే మరో రెండు రోజులు వర్షం పడితే నగరంలోని అనేక ప్రాంతాలు మరోసారి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. పరిస్థితిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సవి•క్షిస్తుంది. వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు నగరంలోని నీటమునిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు ఏర్పడిన పక్షంలో ప్రజలను ముంపు ప్రాంతాల నుంచి తరలించడానికి డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. హైదరాబాద్ నుంచి పడవలను కూడా తెప్పించారు.




