రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు

ఉత్సాహంగా పాల్గొన్న యువత…రంగులమయంగా మారిన హైదరాబాద్‌
ఈవెంట్లతో రెట్టింపయిన పండుగ సందడి
భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించిన దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల హోలీ వేడుకలు
ఆదిలాబాద్‌ జిల్లాలో పండుగ పూట విషాదం…వార్దా నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25 : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం హోలీ వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ముఖ్యంగా అధిక స:క్యలో పాల్గొని అరుపులు కేరింతలతో ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్‌ నగరంలోనైతే హ్యాపీ హోలీ అంటూ యువత తెల్లవారుజాము నుంచే పండుగ సంబురాల్లో పాల్గొన్నారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి హోలీ వేడుకల్లో ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ కలర్‌ఫుల్‌ పండుగను ఎంజాయ్‌ చేశారు. దీంతో నగరం మొత్తం ఎక్కడ చూసినా రంగుల మయంగా మారిపోయింది. కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్య హైదరాబాదీలు పండుగను జరుపుకున్నారు. ఇక సికింద్రాబాద్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, పీపుల్స్‌ ప్లాజా తదితర ప్రాంతాల్లో హోలీ ఈవెంట్లు ఏర్పాటు చేశారు. డీజేలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈవెంట్ల నిర్వాహకులు అదరగొట్టారు. మినీ ఇండియాను తలపించే హైదరాబాద్‌లో వారావారి ఆచారాల క్రారం వేడుకలను జరుపుకోవడం చూస్తే భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబిస్తుంది. ఇందులో భాగంగా వారి ఆచారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారమే హోలీ వేడుకలు జరుపుకున్నారు. బేగంబజార్‌, సిద్ది అంబర్‌బజార్‌లో ఎక్కువగా ఉండే రాజస్థానీలు కామదహనానికి పెద్దపీట వేస్తారు. ఆదివారమే కర్రలు, పిడకలు, నెయ్యితో కామదహనం ఏర్పాటు చేసి రాజస్థానీ పండిత్‌ల మంత్రోచ్ఛరణల మధ్య కాముడు చుట్టూ ప్రదక్షణలు చేసి దహన కార్యక్రమాలను నిర్వహించారు.
image.png
ఇక సికింద్రాబాద్‌లో ఉండే సింధులు ఐదు రోజులపాటు వేడుకలు నిర్వహించుకుంటున్నారు. వారు ఎక్కువగా కుటుంబాలకు పరిమితం కాకుండా స్నేహితులతో సందడి చేసారు. బిహారీలు రెండు రోజులపాటు వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఉట్లను కొట్టారు. మరోవైపు సికింద్రాబాద్‌ తార్నాకలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బల్దియా కార్మికుల హోలీ సంబురాలు జరుపుకోగా వేడుకల్లో డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఇక పాతబస్తీలో కులాలు, మతాలకతీతంగా పెద్దలందరూ కలిసి డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య దూలండి నిర్వహించారు. యువత కేరింతలు, నృత్యాల మధ్య జరుపుకునే దూలండిలో బస్తీలోని హిందువులు, ముస్లింలు పాల్గొన్నారు. చిన్న తప్పిదాల కారణంగా దూరమైన వారు కూడా అన్ని మరిచిపోయి బంధుత్వం దృఢం కావాలని దూలండిలో పాల్గొంటారు. ఇక బంజారా హిల్స్‌, జూబిలీ హిల్స్‌ లాంటి ప్రాంతాల్లో ఎకువగా కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు బృందాలుగా ఏర్పడి హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలు చాలా చోట్ల సమూహాలుగా ఏర్పడి హోలీ వేడుకలను జరుపుకోవడం కనిపించింది.
image.png
ఆదిలాబాద్‌ జిల్లాలో పండుగ పూట విషాదం…నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హోలీ పండుగ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పెను విషాదం నెలకొంది. కొమరం భీమ్‌  జిల్లా తాటిపల్లి వద్ద వార్దా నదిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు నదిలో గల్లంతయిన విషాద ఘటన చోటు చేసుకుంది.. లోతు సరిగా అంచనా వేయకపోవడంతో నదిలోకి దిగినవారు ఒక్కొక్కరుగా మునిగిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టగా నలుగురు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కాగా యువకులందరూ 25 ఏళ్ల లోపే కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు నదీమాబాద్‌కు చెందిన సంతోష్‌ కుమార్‌, ప్రవీణ్‌, సాయి, కమలాకర్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబీకులు రోదనలు చూసిన వారికి కంటతడి పెట్టించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *