సిఎల్‌పి నేతగా పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
రేపు ప్రమాణస్వీకారం
విూడియా సమావేశంలో ప్రకటించిన ఏఐసిసి నేత కెసి వేణుగోపాల్
ఉదయం నుంచి సిఎం పదవిపై వరుస భేటీలు..చర్చలు
ఖర్గే, వేణుగోపాల్‌లతో డికె శివకుమార్ భేటీ
కెసి వేణుగోపాల్‌తో ఉత్తమ్, భట్టిల చర్చ..వారి సమక్షంలోనే ప్రకటన
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు ..
న్యూ దిల్లీ, డిసెబర్ 5 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. సిఎల్‌పి నేతగా రేవంత్ పేరును మంగళవారం ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ ప్రకటించారు. 7వ తేదీన రేవంత్ సిఎంగా ప్రమాణం చేస్తారని ప్రకటించారు. సిఎల్‌పి నేతగా రేవంత్‌ను ఎన్నుకున్నామని, అధిష్టానానికి అందిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సిఎల్‌పీ తీర్మానం మేరకు నిర్ణయించామని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ బాగా పనిచేశారని, కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డారని అన్నారు. రేవంత్ ఓ డైనమిక్ లీడర్ అంటూ వేణుగోపాల్ తెలిపారు. దిల్లీలో విూడియా సమావేశంలో మాణిగం థాక్రే, డికె శివకుమార్ పాల్గొన్నారు. మంత్రివర్గ కూర్పు తదితర విషయాలను రేపు ప్రకటిస్తామని అన్నారు. మరోవైపు ఒక వైపు ప్రకటన వెలవడుతుండగానే అధిష్ఠానం పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఏడు గంటలకు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా నుంచి దిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధిష్ఠానం నుంచి సీఎం పదవీపై స్పష్టమైన తర్వాతనే రేవంత్ దిల్లీ బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తుంది. మంగళవారం ఉదయం మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారం కైవసం చేసుకుంది. రేవంత్ దిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ ఊహగానాలకు తెరపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే సిఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ కరసత్తు చేసింది. ఖర్గే నివాసంలో చర్చలు జరిగాయి. కెసి వేణుగోపాల్ చర్చించారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ముఖ్యమంత్రి పదవికి పలువురు కీలక నేతలు పోటీపడ్డారు. సోమవారమే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. దిల్లీ వేదికగా మంగళవారం ఉదయం నుంచి వరుస భేటీలు సాగుతున్నాయి. మల్లికార్జున ఖర్గేతో రాహుల్ భేటీ అయ్యారు. తరవాత డికె శివకుమార్ కూడా భేటీ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కొందరు దిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో సిఎం ఎవరన్నదనిపై తీవ్రంగానే కసరత్తు జరిగింది. సిఎం పదవికి రేవంత్ పేరునే నేతలంతా ఖరారు చేశారని, మంత్రివర్గ కూర్పుపై తుదినిర్ణయం తీసుకునేందుకే రేవంత్‌ను దిల్లీకి రావాలని ఆదేశించారని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొన్నారు. వారంతా కూడా కాబోయే సీఎం అభ్యర్థిపై చర్చించిట్లు తెలుస్తుంది. అయితే తాము రేసులో ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోద యోగ్యమేనని భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు తెలిపారు. తన అభిప్రాయం కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పామని వారు అన్నారు. సీఎం అయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, మొదటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ అన్ని ఆలోచనలు చేస్తుందని, నలుగురు.. ఐదుగురు రేసులో ఉండటం తప్పుకాదని ఉత్తమ్ అన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అంతర్గత విషయాలు బయటకు చెప్పలేనని ఉత్తమ్ తెలిపారు. తాజాగా ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో సైతం ముమ్మర ఏర్పాట్లు జరిగాయి.
ఈ క్రమంలో పార్టీ పరిశీలకుల సమావేశంలో సోమవారం సీఎల్పీ విూటింగ్ జరిగింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సీఎం ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగించారు. సీఎం పదవి, కేబినెట్ బెర్తుల విషయంలో పంచాయితీ నేపథ్యంలో వాయిదాపడిరది. ముఖ్య నేతలు పట్టువీడకపోవడంతో డీకే శివకుమార్‌తో పాటు పరిశీలకులను అధిష్ఠానం దిల్లీకి పిలిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్లు సైతం దిల్లీలో మకాం వేశారు. ఎవరికి వారు తమ బెర్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి కోసం కూడా పలువురు నేతలు దిల్లీలో అప్పుడే లాబీయింగ్ మొదలు పెట్టారు. బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జీ వినోద్ దిల్లీలో మంగళవారం కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అయితే, వినోద్ సోదరుడు సైతం వివేక్ చెన్నూరు నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం అన్నాదమ్ముళ్లు ఇద్దరు మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. అయితే, ఇద్దరిలో ఒకరికి మాత్రమే పదవి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండడంతో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్‌లో చేరేందుకు వివేక్ సమ్మతించారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నాదమ్ముళ్లు ఇద్దరు కేబినెట్ బెర్తు కోసం లాబీయింగ్ చేస్తున్నారు. సోనియా సమావేశం అనంతరం విూడియాతో వినోద్ మాట్లాడుతూ.. తాను 2004`2009 వరకు మంత్రిగా పని చేశానన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశంతో మరోసారి కేబినెట్‌లో చోటు చేసుకోసం రెక్వెస్ట్ కోసం దిల్లీకి వొచ్చానని..ఈ మేరకు సోనియాకు విజ్ఞాపన పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. మంత్రి పదవి ఖాయమనే సంకేతాలున్నాయన్నారు. మరోవైపు తెలంగాణ తదుపరి సీఎం ఎవరనేదానిపై తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతుండగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఒకరినొకరు అభినందించుకోవడానికి హోటల్ ఎల్లాకు వొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు ..
ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం
నూతన సీఎల్పీ నాయకుడుగా తనను ఎంపిక చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్ధతుగా నిలిచిన శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్నాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.ఈ నెల 7న జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మల్లికార్జున ఖర్గే, శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రయాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్ రావు ఠాక్రే, డీకే శివ కుమార్ లను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి మంగళ వారం సాయంత్రం దిల్లీ బయలుదేరి వెళ్లారు.
రేవంత్ రెడ్డి ప్రొఫైల్
పుట్టినరోజు :1969 నవంబరు 8, నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామం
2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం
2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వాతంత్య్రంగా ఎన్నిక
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు
2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్
2014-17 మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్
2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా
2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి
2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం
2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్
2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం