రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు స్థానం దక్కేనా?

గోల్కొండ పూర్వ నామం గొల్లకొండ.గొల్లకొండ పరిసర ప్రాంతాల్లో యాదవులు అధిక సంఖ్యలో నివసించే వారు.16 శతాబ్ధంలో గోల్కొండకు సమీపంలోనే హైదరాబాద్‌ నగర నిర్మాణం జరిగింది.హైదరాబాదు నిర్మాణం తర్వాత కుతుబ్‌ షాహి,అసఫ్‌ జాహి పాలనలో యాదవులు సైనికులుగా,యుద్ద వీరులుగా ప్రముఖ పాత్ర పోషించారు.బ్రిటిష్‌ వారి కాలంలో అహిర్‌ రెజ్మెంట్‌ గా పేరుగాంచిన యాదవ సైన్యం 1853 వరకు  నిజాం సైన్యంలో భాగంగా ఉంటు నిజాం (హైదరాబాద్‌) రాజ్యానికి రక్షణ కల్పించింది. హైదరాబాద్‌ నగరం పెరిగినట్లు యాదవుల జనాభా కూడా నగరంలో పెరిగింది.హైదరాబాదులో యాదవులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.యాదవులు సదర్‌ ఉత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చిన దున్నల ప్రదర్శన దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది.మరోjైుపు ఆలైబలై ఉత్సవం అన్ని పార్టీల నాయకులను,అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి ఆహ్వానిస్తుంది.హైదరాబాద్‌ లోనే గాక  తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా యాదవులు (గొల్ల,కుర్మలు)అధిక సంఖ్యలో ఉన్నారు.ఇతర వెనుకబడిన తరగతులలో యాదవులు సంఖ్య పరంగా మొదటి వరుసలో ఉంటారు. రాష్ట్రంలోనే గాక  దేశంలో కూడా అన్ని  రాష్ట్రాల్లో యాదవులు సుమారు 20 శాతం జనాభాతో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నారు.దేశ రాజకీయాల్లో సైతం క్రియాశీలంగా ఉన్నారు.ఇతర వెనుకబడిన తరగతులలో ప్రముఖంగా ఉన్న యాదవులు ఓబీసీ  రిజ్వేషన్ల పోరాటంలో ముందు వరుసలో ఉన్నారు.

బి పి మండల యాదవ్‌ సిఫారసుల వల్లనే ఓబీసీ రిజ్వేషన్లు అమల్లోకి రాగలిగాయి.ఓబీసీ రిజ్వేషన్ల అమాలుకై యాదవ త్రయం ములాయం సింగ్‌ యాదవ్‌,లాలూ ప్రసాద్‌ యాదవ్‌,శరత్‌ యాదవ్‌ ప్రముఖంగా ఉద్యమించారు. దేశ వ్యాప్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గంలో నలుగురు యాదవులకు అవకాశం కల్పించింది.మధ్యప్రదేశ్లో  బిజెపి పార్టీ యాదవులకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది.బీహార్‌ కు ఉపముఖ్య మంత్రిగా తేజస్వి యాదవ్‌ పని చేస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, హర్యానా,రాజస్థాన్‌, మహారాష్ట్ర,గుజరాత్‌,జార్కండ్‌ లాంటి రాష్ట్రాలతోపాటు ఉత్తర భారతదేశంలో రాజకీయంగా యాదవులు చైతన్య వంతులుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ గుండెకాయ లాంటిది,హైదరాబాద్‌ కు యాదవులు గుండెకాయ లాంటివారు. గతంలో హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాల నుంచి యాదవులు తప్పనిసరిగా ఒక్కరైనా  ఎమ్మెలేగానో,ఎంపిగానో లేక రాష్ట్ర మంత్రిగానో,కేంద్ర మంత్రిగానో  మంత్రివర్గంలో ఉండేవారు. బండారు దత్తాత్రేయ,తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌,అంజన్‌ కుమార్‌ యాదవ్‌,కృష్ణ యాదవ్‌ ఇలా ఎవరో ఒకరు హైదరాబాద్‌ -సికింద్రాబాద్‌ జంట నగరాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న యాదవుల తరఫున కూడా ప్రాతినిధ్యం వహించే వారు.

గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్టానికి ప్రధానమంత్రి తో పాటు ఇతర ఏ ప్రముఖులు హైదబాద్‌ నగరానికి వచ్చిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నగరానికి ఆహ్వానించేవారు. గత ప్రభుత్వ కాలంలో యాదవుల నుంచి ఒక మంత్రి, ఐదుగురు ఎమ్మెలేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యులు, కొందరు కార్పొరేషన్‌ చైర్మన్లు ఉండేవారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు జనాభా దామాషా ప్రకారం 22 ఎమ్మెల్యే స్థానాలు,7 ఎమ్మెల్సీ స్థానాలు,3 లోక్‌ సభ స్థానాలు,2 రాజ్యసభ స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలి.కానీ గత నెలలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ 5,కాంగ్రెస్‌ పార్టీ 4, బిజెపి పార్టీ 5 స్థానాలు మాత్రమే కేటాయించాయి. కానీ బిఆర్‌ఎస్‌ లో ఒకరు,కాంగ్రెస్‌ లో ఒకరు మాత్రమే గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు జనాభా దామాషా ప్రకారం దక్కాల్సిన స్థానాలు,ప్రాతినిధ్యం దక్క లేదు. ఈ ఎన్నికల్లో యాదవుల ప్రాతినిధ్యం అధికార పక్షంలో ఒకరు,ప్రతిపక్షంలో ఒకరుగానే మిగిలింది. అంటే ఆయా రాజకీయ పార్టీలు గెలిచే స్థానాలే ఇచ్చాయా లేకా లెక్క సరిచేయడానికి ఓడిపోయే స్థానాలే ఇచ్చాయా అనేది యాదవులు గుర్తిస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో కొన్ని  దశాబ్దాలుగాఏ ప్రభుత్వం ఏర్పడిన  రాష్ట్ర మంత్రివర్గంలో తప్పనిసరిగా యాదవులకు ప్రాతినిధ్యం ఉండేది. ప్రస్తుతం ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో యాదవులకు ప్రాతినిధ్యం లభించలేదు. బీర్ల ఐలయ్య గారికి ప్రభుత్వ విప్‌ గా అవకాశం కల్పించడం హర్షించదగ్గ పరిణామం.కానీ హైదరాబాద్‌ నగరానికి,అందులో హైదరాబాద్‌ లో అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు ప్రాతినిధ్యం లేకపోవటాన్ని కాంగ్రెస్‌ పార్టీ మారో మారు పరిశీలించాలి.
తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఇప్పటికే అఖిల భారత యాదవ మహాసభ,యాదవ హక్కుల పోరాట సమితి, గొర్ల కాపర్ల సహకార సంఘాలు,యాదవ విద్యా వంతుల వేదిక లాంటి సంఘాలతో సంఘటితంగా ఉన్నారు.వారందరి ఉమ్మడి కోరిక గతంలో లాగానే రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు ప్రాతినిద్యం కల్పించాలని. ముఖ్యమంత్రి తో కలిపి నలుగురు రెడ్లు,ఇద్దరు దళితులు,ఒక ఆదివాసీ,ఒక బ్రాహ్మణ,ఒక వెలమ,ఒక కమ్మ,ఇద్దరు బిసిలతో రాష్ట్ర క్యాబినెట్‌ కొలువు తీరింది.కానీ రాష్ట్ర మంత్రివర్గంలో 50 శాతానికి పైనున్న బిసి వర్గాలకు ఇద్దరు మాత్రమే ప్రాతినిద్యం వహిస్తున్నారన్న విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ పరిగణలోకి తీసుకోవాలి.ఏ లెక్కన్న చూసిన కనీసం 6 గురు బిసిలకైన ప్రాతినిద్యం కల్పించాలి.ఇప్పటికే గౌడ,పద్మశాలి సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించిన్నందున రాబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో తప్పనిసరిగా యాదవ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కేటాయించాలి.

ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా పరంగా హైదరాబాద్‌ జిల్లాకు ప్రాతినిద్యం లభించలేదు. రాష్ట్ర రాజధానిగా ఉన్న జిల్లాకు ప్రాతినిధ్యం లభించక పోవడం ఆశ్చరం కల్గిస్తుంది.హైదరాబాద్‌ కు ప్రాతినిధ్యం కల్పించాలన్న,హైదరాబాద్‌ లో మరియు రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు ప్రాతినిధ్యం లభించలన్న ఎమ్మెల్సీ పదవి ఇచ్చి హైదరాబాద్‌ లోని యాదవులకు రాష్ట్ర మంత్రి వర్గంలో ప్రాతినిద్యం కల్పించాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులకు రాజకీయంగా సరైన స్థానం లభించలేదు.ఎమ్మెల్సీ స్థానాల్లోనైన యాదవులకు జనాభా దామాషా ప్రకారం వాట దక్కాలి.ఇక రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్న నామినేటెడ్‌ పదవులు,కార్పొరేషన్‌ చైర్మన్లు, సభ్యులు,ప్రముఖ ఆలయాల్లో  చైర్మన్లు, సభ్యులు,ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేటెడ్‌ పదవులు ఉన్నాయి.జనాభా దామాషా ప్రకారం యాదవులకు నామినేట్‌ మరియు  కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు కేటాయించాలి.రాబోయే ఎన్నికల్లో జిల్లా పరిషత్‌  చైర్మన్లు,మున్సిపాలిటీ  చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపిపిలు మరియు సర్పంచులు తదితర స్థానిక సంస్థల పదవుల్లో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలి. దేశంలో, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులను కాంగ్రెస్‌ పార్టీ విస్మరించకూడదు.రానున్న అన్ని నియామకాల్లో,ఎన్నికల్లో యాదవులకు జనాభా దామాషా ప్రకారం  స్థానాలు కేటాయించాలని,రానున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో యాదవులకు తప్పనిసరిగా స్థానం కల్పించాలని అన్ని యాదవ సంఘాలు కోరుతున్నాయి.
-జుర్రు నారాయణ యాదవ్‌
తెలంగాణ యాదవ విద్యావంతుల వేదిక
మహబూబ్‌నగర్‌, 9494019270

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *